శంకర్‌కు కాదన్నాడు.. రాజమౌళికి ఔనన్నాడు!


శంకర్‌కు కాదన్నాడు.. రాజమౌళికి ఔనన్నాడు!

శంకర్‌కు కాదన్నాడు.. రాజమౌళికి ఔనన్నాడు!

అజయ్ దేవ్‌గణ్.. బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరు. అనేక సినిమాల్లో తన ఉన్నత స్థాయి నటనతో ప్రేక్షకులనే కాకుండా విమర్శకుల్నీ మెప్పించిన నటుడు. జాతీయ ఉత్తమ నటుడిగా రెండుసార్లు పురస్కారాలు పొందినవాడు. బాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉండే నటుడు కూడా.

అలాంటి నటుడు ‘ఆర్ ఆర్ ఆర్’లో ఒక కీలక పాత్ర చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయన కేరెక్టర్ వస్తుందనీ, సినిమాకి ఆ పాత్ర కీలకమనీ రాజమౌళి వెల్లడించాడు. దేవ్‌గణ్ రాకతో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా స్థాయి అకాశానికెదిగిందని చెప్పాలి.

ఉత్తరాదిలో కూడా కచ్చితంగా ఈ సినిమాకు మరింత క్రేజ్ రావడానికి ఇది దోహదం చేస్తుందనడంలో సందేహమే లేదు. గమనించదగ్గ విషయమేమంటే రాజమౌళి సినిమాకు ఓకే చెప్పిన దేవ్‌గణ్, ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2)లో నటించడానికి వచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించడం.

కమల్ హాసన్‌తో ఆ సినిమా చేస్తున్న శంకర్, అందులో విలన్ రోల్ కోసం అజయ్ దేవ్‌గణ్‌ను సంప్రదించాడు. కానీ ఆ సినిమా చెయ్యలేనని దేవ్‌గణ్ చెప్పేశాడు. దానికి కారణాన్ని ‘టోటల్ ధమాల్’ సినిమా విడుదలకు ముందు తెలియజేశాడు.

‘ఇండియన్ 2’లో భాగం కావాలని తాను భావించాననీ, కానీ డేట్స్ సర్దుబాటయ్యే అవకాశం కనిపించలేదనీ ఆయన తెలిపాడు. “శంకర్ సినిమాలో చెయ్యాలని నాకెంతగానో ఉంది. కానీ నా దగ్గర డేట్స్ లేవు. ఆయన ఇప్పుడే షూటింగ్ చెయ్యాలన్నాడు. నేను ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ సినిమాకి ఇప్పటికే డేట్స్ ఇచ్చేశాను” అని చెప్పాడు దేవ్‌గణ్.

విలన్ రోల్ చెయ్యడం ఇష్టం లేకనే ఆ ఆఫర్‌ను ఆయన వద్దనుకున్నాడనే ప్రచారమూ వచ్చింది. దీనిపైనా ఆయన స్పందించాడు. “నేను ‘ఖాకీ’, ‘కంపెనీ’ సినిమాల్లో నెగటివ్ షేడ్స్ రోల్స్ చేశాను. వాటికి మంచి ప్రశంసలు వచ్చాయి. అలాంటి పాత్రలు మళ్లీ చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ‘ఇండియన్ 2’లో నాకు ఆఫర్ చేసింది నెగటివ్ రోల్ కాబట్టి వద్దనుకున్నాననేది కరెక్ట్ కాదు” అని స్పష్టం చేశాడు అజయ్.

మరి డేట్స్ లేవని శంకర్‌కు ‘నో’ చెప్పిన దేవ్‌గణ్, ఇప్పుడు రాజమౌళికి ‘ఓకే’ చెప్పడం గమనించదగ్గ విషయమే. “కలవాలని మెసేజ్ పెడితే దేవ్‌గణ్ కలవమన్నారు. ఆయనకు కేరెక్టర్ వివరించాను. వెంటనే డేట్లు ఎప్పుడు కావాలన్నారు. ఇచ్చారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఒక పవర్‌ఫుల్ కేరెక్టర్‌ను అజయ్ దేవ్‌గణ్ చేస్తున్నారు” అని రాజమౌళి చెప్పాడు.

కాబట్టి ‘ఆర్ ఆర్ ఆర్’లో కేరెక్టర్ నచ్చబట్టే చెయ్యడానికి అజయ్ దేవ్‌గణ్ వెంటనే ఒప్పుకున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ‘ఇండియన్ 2’లో కేరెక్టర్ నచ్చలేదా? అనడిగితే మనమే చెప్పగలం? అది దేవ్‌గణ్‌కు మాత్రమే తెలుసు.

శంకర్‌కు కాదన్నాడు.. రాజమౌళికి ఔనన్నాడు! |actioncutok.com

You may also like: