ముచ్చటగా మూడోసారి బన్నీ, సుక్కు కాంబినేషన్


ముచ్చటగా మూడోసారి బన్నీ, సుక్కు కాంబినేషన్
అల్లు అర్జున్, సుకుమార్

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే 20వ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడిగా సుకుమార్‌కు ‘ఆర్య’ (2004) తొలి సినిమా కాగా, అర్జున్‌కు హీరోగా రెండో సినిమా.

ఈ సినిమాతో ఇద్దరూ తమ తమ రంగాల్లో స్టార్‌డం పొందారు. ఇప్పుడు మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

ప్రస్తుతం తివిక్రం డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు బన్నీ. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా ఈ నెల్లోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది.

సందర్భవశాత్తూ ఇది కూడా బన్నీ, త్రివిక్రం కాంబినేషన్‌లో మూడో సినిమాయే. ఇదివరకు వాళ్ల కలయికలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు వచ్చాయి.

ఇప్పుడు బన్నీ, సుకుమార్ సినిమా ఖాయమవడంతో మహేశ్, సుకుమార్ కాంబినేషన్ మూవీ ఉంటుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి ‘మహర్షి’ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లోనే మహేశ్ సినిమా చేయాల్సింది. ఇప్పుడు ఆకస్మికంగా అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.