మురుగదాస్ చేతికి చిక్కిన బన్నీ?


మురుగదాస్ చేతికి చిక్కిన బన్నీ?

‘నా పేరు సూర్య’ కలిగించిన అసంతృప్తితో కొంత కాలం స్తబ్దుగా ఉండి, తర్వాత త్రివిక్రంతో సినిమా చెయ్యడానికి సిద్ధమైన అల్లు అర్జున్ జోష్ పెంచాడు. గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చెయ్యాలని డిసైడయ్యాడు.

అందులో భాగంగా మహేశ్‌ని ఇంప్రెస్ చెయ్యలేకపోయిన సుకుమార్ సబ్జెక్ట్‌ని ఓకే చేశాడు. త్రివిక్రంతో చేసే సినిమా పూర్తయ్యే లోగా సుకుమార్ సినిమాని పట్టాలెక్కించాలని సంకల్పించాడు. ఆ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.

కాగా తాజాగా మూడో సినిమాని కూడా బన్నీ ఓకే చేశాడని ఫిలింనగర్‌లో గట్టిగా వినిపిస్తోంది. తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో ఆ సినిమా చెయ్యనున్నాడనేది ప్రచార సారాంశం. మురుగదాస్ ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత అతను బన్నీ సినిమాపైనే వర్క్ చేయనున్నాడంటున్నారు.

ఇప్పటివరకు మురుగదాస్ తెలుగులో రెండు సినిమాలు చేశాడు. చిరంజీవితో చేసిన ‘స్టాలిన్’ ఓకే అనిపించుకోగా, మహేశ్‌తో చేసిన ‘స్పైడర్’ డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి తెలుగు హీరోతో పని చెయ్యాలని అతను భావించగా, అర్జున్‌తో సెట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టును బన్నీ సన్నిహిత వర్గాలు ధ్రువీకరించకపోవడం గమనార్హం.