తొలిరోజు వసూళ్లు: ‘ఉరీ’, ‘మణికర్ణిక’లను దాటిన ‘కెప్టెన్ మార్వెల్’


తొలిరోజు వసూళ్లు: 'ఉరీ', 'మణికర్ణిక'లను దాటిన 'కెప్టెన్ మార్వెల్'

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘కెప్టెన్ మార్వెల్’ అనూహ్యమైన స్పందనను చవిచూస్తోంది. ఈ హాలీవుడ్ సూపర్ హీరో సినిమా తొలిరోజు రూ. 12.50 కోట్ల నెట్‌ను సాధించింది.

తద్వారా గత ఏడాది ‘అవెంజెర్స్: ఇన్‌ఫినిటీ వార్’ తొలిరోజు వసూలు చేసిన రూ. 31 కోట్ల తర్వాత భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో హాలీవుడ్ సినిమాగా నిలిచింది. భారత్‌లో ఒక హాలీవుడు సినిమా మొదటి రోజే రూ. 10 కోట్ల మార్కును దాటడమనేది పెద్ద విశేషం.

వీకెండ్‌లో ‘కెప్టెన్ మార్వెల్’ మరిన్ని వసూళ్లు సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలుగు, తమిళ్, హిందీ డబ్బింగ్ వెర్షన్లు పెద్ద ప్రభావాన్ని చూపలేకపోతుండటం ఇక్కడ గమనార్హం. ఒరిజినల్ ఇంగ్లిష్ వెర్షన్ చూసేందుకే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

చెప్పుకోవాల్సిన విశేషమేమంటే, హిట్ సినిమాలైన ‘ఉరీ: ద సర్జికల్ స్ట్రైక్’ (రూ. 8.2 కోట్లు), ‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ (రూ. 8.75 కోట్లు) కంటే ఈ సినిమా తొలిరోజు వసూళ్లు ఎక్కువగా ఉండటం. ‘కెప్టెన్ మార్వెల్’గా టైటిల్ రోల్‌లో బ్రీ లార్సన్ నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది.