చరణ్ నా కష్టసుఖాలు పంచుకొనే స్నేహితుడు: జూనియర్ ఎన్టీఆర్


చరణ్ నా కష్టసుఖాలు పంచుకొనే స్నేహితుడు: జూనియర్ ఎన్టీఆర్

చరణ్ నా కష్టసుఖాలు పంచుకొనే స్నేహితుడు: జూనియర్ ఎన్టీఆర్

నటులుగా ‘ఆర్ ఆర్ ఆర్’లో భాగస్వాములు కావడం తమ అదృష్టమనీ, ఈ సినిమాలో చరణ్, తాను గొప్ప పాత్రలు చేస్తున్నామనీ అన్నారు జూనియర్ ఎన్టీఆర్. మీడియా సమావేశంలో ఆయన ఒకింత ఉద్వేగభరితంగా మాట్లాడారు.

“జక్కన్నతో ఇది నాకు నాలుగో చిత్రం. అన్నింటి కంటే ఇది స్పెషల్ ఫిలింగా నా కెరీర్‌లో మిగిలిపోతుంది. ఎందుకంటే జక్కన్నతో పాటు, నా ఫ్రెండ్ చరణ్‌తో కలిసి పనిచెయ్యడం. మా స్నేహం ఈ చిత్రంతోనే మొదలవలేదు. చరణ్ నా కష్టసుఖాలు పంచుకొనే స్నేహితుడు.

ఆ బంధం ఈ చిత్రానికి కలిసి పనిచేస్తుంటే వేరే స్థాయికి వెళ్లిపోయింది. మా ఫ్రెండ్‌షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. మా ఇద్దరికీ దిష్టి తగలకూడదని కోరుకుంటున్నా. నటుల నుంచి ఈ సినిమా చాలా డిమాండ్ చేస్తుంది.

అల్లూరి సీతారామరాజు గురించి కానీ, కొమరం భీం గురించి కానీ మనకు తెలీని ఒక గీత ఉంది. ఆ ఇద్దరూ గనుక కలిసుంటే ఏం జరిగుండేది అనే పాయింట్‌ను ఎప్పుడైతే దర్శకుడు తీసుకొచ్చాడో నటులుగా మాకది కొత్తగా అయిపోయింది. నటుడికి ఎంత ఇంఫర్మేషన్ తక్కువగా ఉంటే అంత తన ఎఫర్ట్ బయటకు వస్తుందని నమ్మే వ్యక్తిని నేను.

కాబట్టి ఈ చిత్రం నాకూ, చరణ్‌కూ నటులుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. షూటింగ్‌కు వెళ్లే ముందు మాకిచ్చిన శిక్షణ ఫెంటాస్టిక్. ఇప్పటి దాకా నేను చేసిన 28 చిత్రాల కంటే ఈ సినిమాకి నేను తీసుకున్న శిక్షణ నా భవిష్యత్ చిత్రాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా.

ఇందులో మేం గ్రేట్ కేరెక్టర్స్ చేస్తున్నాం. తప్పకుండా ఇది గొప్ప చిత్రంగా నిలుస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం. నటులుగా ఈ చిత్రంలో భాగస్వాములం కావడం నిజంగా మా అదృష్టం. ఎలాంటి భేషజాలు లేకుందా నాలాగే ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్న చరణ్‌కు థాంక్స్. ఎంతో కాన్ఫిడెన్స్‌తో చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభవాన్నిస్తుందని ఆశిస్తున్నా.”

చరణ్ నా కష్టసుఖాలు పంచుకొనే స్నేహితుడు: జూనియర్ ఎన్టీఆర్ | actioncutok.com

You may also like: