ఖరారు: ‘కూలీ నం. 1’ రీమేక్‌లో వరుణ్ ధావన్


ఖరారు: 'కూలీ నం. 1' రీమేక్‌లో వరుణ్ ధావన్

గోవిందా, కరిష్మా కపూర్ జంటగా నటించగా 1995లో వచ్చిన ‘కూలీ నం.1’ సినిమా బాక్సాఫీస్ వద్ధ ఘన విజయం సాధించడమే కాకుండా హిందీ సినిమాల్లో ఒక క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన డేవిడ్ ధావన్ ఇప్పుడు దానికి రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. అందులో హీరోగా అయన కొడుకు, నేటి క్రేజీ యాక్టర్లలో ఒకడైన వరుణ్ ధావన్ నటించనున్నాడు.

ఈ విషయాన్ని వరుణ్ ధ్రువీకరించాడు. ప్రస్తుతం అతను అలియా భట్‌తో ‘కళంక్’ సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్లో ఆ సినిమా విడుదల కానున్నది. దాని తర్వాత ‘కూలీ నం.1’ రీమేక్‌ను మొదలుపెట్టనున్నాడు. ఆ సినిమాని తన తండ్రి డేవిడ్ డైరెక్ట్ చేయనున్నాడని వరుణ్ తెలిపాడు.

అందులో అలియా లేదా సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. అయితే అలియా ఆ సినిమాలో నటించదని తేల్చి చెప్పేశాడు వరుణ్. ప్రతి సినిమాలో అలియా తనతో కలిసి చెయ్యడం కష్టం కదా.. అని చెప్పాడు.

మరి సారా అలీఖాన్ సంగతేమిటని అడిగితే, హీరోయిన్ విషయం తర్వాత చెప్తానని దాట వేశాడు. దాన్ని బట్టి ‘కూలీ నం.1’ రీమేక్‌లో అలియా ఉండదని స్పష్టమైంది. సారా అలీఖాన్ విషయమే స్పష్టం కాలేదు. అందులో ఆమె నటించే అవకాశాల్ని తోసిపుచ్చలేం.

ఖరారు: 'కూలీ నం. 1' రీమేక్‌లో వరుణ్ ధావన్

తెలుగులోనూ ‘కూలీ నం.1’ పేరుతో 1991లోనే ఒక సినిమా వచ్చింది. వెంకటేశ్ హీరోగా నటించిన ఆ సినిమా ద్వారా తెలుగు చిత్రరంగానికి నాయికగా టాబు పరిచయమైంది. కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఆ సినిమాకీ, డేవిడ్ ధావన్ తీసిన సినిమాకీ కథ పరంగా ఎలాంటి పోలికా లేదు.

ప్రభు, సుకన్య జంటగా తమిళంలో వచ్చిన ‘చిన్న మాప్పిళ్లై &’ (1993)కి హిందీ ‘కూలీ నం.1’ రీమేక్. తర్వాత ఇదే తెలుగులో సుమన్ హీరోగా ‘చిన్న అల్లుడు’ పేరుతో రీమేక్ అయ్యింది.

You may also like: