’96’ విషయంలో దర్శకుడి మాటే నెగ్గింది!


'96' విషయంలో దర్శకుడి మాటే నెగ్గింది!

తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించగా ఘన విజయం సాధించిన ’96’ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రధాన పాత్రల్ని సమంత, శర్వానంద్ చేస్తున్నారు. తమిళ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన సి. ప్రేంకుమార్ తెలుగు వెర్షన్‌నూ రూపొందిస్తున్నాడు.

’96’ అనేది రామ్, జానకి అనే ఇద్దరు చిన్ననాటి క్లాస్‌మేట్ల కథ. స్నేహం ప్రేమగా చిగురించాక తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోయిన ఆ ఇద్దరూ కొన్నేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నాక ఏం జరిగిందనేది అత్యంత ఆసక్తికరంగా, భావోద్వేగపూరితంగా ప్రేంకుమార్ చిత్రించాడు.

వర్తమాన, భూత కాలాల్లో నడిచే ఈ సినిమా కథ ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుందనే నమ్మకంతో దిల్ రాజు తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్ణయించుకున్నారు.

కాగా ’96’ రీమేక్‌కు గోవింద్ వసంత సంగీతం సమకూర్చడం ఖాయమని తేలింది. ఒరిజినల్‌కూ అతనే స్వరాలు అందించాడు. తమిళనాట ఆ సినిమా పాటలు బాగా పాపులర్ అయ్యాయి.

కానీ తెలుగు వెర్షన్‌కు గోవింద్‌తో కాకుండా దేవిశ్రీ ప్రసాద్‌తో బాణీలు కట్టించాలని దిల్ రాజు గట్టిగా ప్రయత్నించడంతో ఆయనకూ, ప్రేంకుమార్‌కూ మధ్య పొరపొచ్చాలు వచ్చాయని ప్రచారం జరిగింది. గోవింద్ అయితేనే కరెక్టంటూ ప్రేంకుమార్ గట్టిగా పట్టుబట్టడంతో చివరకు రాజు సరే అనక తప్పలేదు.

తాజా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్‌కు బాణీలు కట్టే పనిని గోవింద్ మొదలుపెట్టాడు. ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.