రాజ్‌తరుణ్‌తో దిల్ రాజు ‘ఇద్దరి లోకం ఒకటే’


రాజ్‌తరుణ్‌తో దిల్ రాజు 'ఇద్దరి లోకం ఒకటే'
రాజ్ తరుణ్

తక్కువ టైంలో ఊహించని ఇమేజ్ సంపాదించిన కుర్ర హీరో రాజ్ తరుణ్ పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగోలేదు. వరుసగా నాలుగు ఫ్లాపులతో కెరీర్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ తర్వాత అతడు చేసిన సినిమాలు ‘అంధగాడు’, ‘రంగుల రాట్నం’, ‘రాజుగాడు’, ‘లవర్’ ఫ్లాపయ్యాయి. దాంతో మార్కెట్‌లో అతడి ధర కూడా పడిపోయింది.

వీటిలో చివరి సినిమా ‘లవర్’కి నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు ఆయనే రాజ్ తరుణ్‌తో ఇంకో సినిమా తీసి, అతడిని గట్టెక్కించే బాధ్యత తీసుకున్నాడు. ఈ సినిమాని కృష్ణారెడ్డి గంగదాసు డైరెక్ట్ చేయనున్నాడు. 2013లో సుధీర్‌బాబు హీరోగా ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాని రూపొందించాక కృష్ణారెడ్డి మళ్లీ డైరెక్ట్ చేయడం ఇప్పుడే.

వాస్తవానికి గత ఏడాది గల్లా జయదేవ్ (మహేశ్ పెద్ద బావ) కుమారుడు గల్లా అశోక్‌ను హీరోగా పరిచయం చేసే సినిమాకి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆ సినిమాని నిర్మించేందుకు దిల్ రాజు ముందుకొచ్చాడు కూడా. తర్వాత ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా ఆగిపోయింది. ఇప్పుడు దర్శక నిర్మాతలు వాళ్లే అయినా హీరో మారాడు. అశోక్ స్థానంలోకి రాజ్ తరుణ్ వచ్చాడు.

ఈ సినిమా కోసం ‘ఇద్దరి లోకం ఒకటే (యు ఆర్ మై హార్ట్ బీట్)’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఈ నెల మూడో వారంలో ఈ సినిమాని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంతోనైనా రాజ్ తరుణ్ కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి.