50 రోజుల ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’


50 రోజుల 'ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్'

వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందించిన ‘ఎఫ్ 2’ చిత్రం శనివారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఎఫ్2’ 106 స్క్రీన్‌లలో 50 రోజులు పూర్తి చేసుకుందని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ అధినేత దిల్ రాజు తెలిపారు.

బాలకృష్ణ (యన్.టి.ఆర్: కథానాయకుడు), రాంచరణ్ (వినయ విధేయ రామ), రజనీకాంత్ (పేట) సినిమాల నడుమ విడుదలైన ‘ఎఫ్ 2’ వాటన్నినింటినీ అధిగమించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. దాని వసూళ్లు రూ. 80 కోట్ల మార్కును చేరుకోవడం విశేషం.

రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత వచ్చిన కామిక్ రోల్‌ను గొప్పగా చేసిన వెంకటేశ్, సినిమాకు ఈ స్థాయి విజయాన్ని అందించాడని విశ్లేషకులు తీర్మానించారు. ఇద్దరి మధ్యా వయసు వ్యత్యాసం ఎక్కువైనప్పటికీ వెంకటేశ్, వరుణ్ మధ్య కెమిస్ట్రీ అనూహ్య స్థాయిలో పండింది. సినిమా విజయంలో హీరోయిన్ల భాగస్వామ్యాన్నీ తక్కువ చెయ్యలేం.

మొత్తంగా దర్శకుడు అనిల్ రావిపూడి కల్పించిన సన్నివేశాలు, రాసిన సంభాషణలు ప్రేక్షకుల్ని అమితంగా అలరించాయి. ‘అంతేగా అంతేగా’ అనే ఒక పాత్ర ఊత పదం ప్రేక్షకులందరి ఊతపదంగా మారిపోయిందంటే ఈ సినిమా వేసిన ప్రభావం అలాంటిది. రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, హరితేజ, రఘుబాబు వంటి నటులూ తలో చెయ్యి వేసిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో ఎస్సెట్.

F2: Fun And Frustration Celebrating 50 Days