బన్నీ నిర్ణయంపై ఫ్యాన్స్ వర్రీ!


బన్నీ నిర్ణయంపై ఫ్యాన్స్ వర్రీ!

సృజనాత్మక విభేదాల (క్రియేటివ్ డిఫరెన్సెస్) వల్ల సుకుమార్‌తో సినిమా చేయట్లేదని ప్రకటించిన మహేశ్, అతని స్థానంలో అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నాడు. దాంతో మహేష్ బదులు తన తొలి చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ను డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు సుకుమార్.

ఇది బాగానే ఉంది కానీ మహేశ్ వద్దన్న స్క్రిప్టును బన్నీ ఓకే చేశాడనేది అతని అభిమానులను కలవరపెడుతోంది. దీనిపై వాళ్లు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చెయ్యడానికి వెనుకాడ్డం లేదు. ఇటీవలే జరిగిన ఒక అనుభవం నుంచి బన్నీ ఏం నేర్చుకున్నాడని వాళ్లు ఆక్షేపిస్తున్నారు.

బన్నీ మునుపటి సినిమా ‘నా పేరు సూర్య’ను ఈ సందర్భంగా వాళ్లు ప్రస్తావిస్తున్నారు. నిజానికి అప్పటి దాకా రచయితగా ఉన్న వక్కంతం వంశీని డైరెక్టర్‌గా పరిచయం చెయ్యాలని జూనియర్ ఎన్టీఆర్ భావించాడు. తన సినిమాతోటే వంశీ దర్శకుడిగా పరిచయమవుతాడని అతను స్వయంగా చెప్పాడు.

కానీ తన కథతో జూనియర్ ఎన్టీఆర్‌ను ఇంప్రెస్ చెయ్యడంలో వంశీ ఫెయిలయ్యాడు. కథపై జూనియర్ ఎన్టీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చెయ్యడంతో, అదే కథను బన్నీకి చెప్పాడు వంశీ. అతను ఓకే చేసేశాడు. అలా ‘నా పేరు సూర్య’తో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు వక్కంతం వంశీ. కానీ తొలి సినిమాతో అతను దెబ్బతినగా, బన్నీకి ఆ సినిమా చేదు అనుభవాన్నిచ్చింది.

అదే తరహాలో ఇప్పుడు మహేశ్ వద్దన స్క్రిప్టును బన్నీ ఓకే చేశాడనీ, మునుపటి అనుభవమే దీనికీ రిపీట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రతిసారీ ఒకే రకమైన అనుభవం ఎదురవుతుందని చెప్పలేం.

ఒక హీరోకు నప్పని కథ మరో హీరోకు నప్పవచ్చు. ఒకరికి నచ్చని కథ ఇంకొకరికి నచ్చవచ్చు. సినిమా విజయంలో కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుందనేది నిజం. బన్నీని ఎలా చూపించాలో సుకుమార్‌కు బాగా తెలుసు. ‘ఆర్య’తో బన్నీని స్టార్‌ను చేసింది సుకుమారే.

‘ఆర్య 2’ సినిమా ఆంధ్ర, రాయలసీమ ఏరియాల్లో బాగా ఆడి, తెలంగాణలో ఆడకపోవడానికి కారణం థియేటర్ల సమ్మెలనేది నిజం. ఇప్పుడు మరోసారి బన్నీని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిన సుకుమార్ దాన్ని సద్వినియోగం చేసుకుంటాడని చెప్పవచ్చు.

పైగా మునుపటి సినిమా ‘రంగస్థలం’ను చూస్తే, డైరెక్టర్‌గా సుకుమార్‌లో వచ్చిన మరింత పరిణతిని మనం చూడవచ్చు. అందువల్ల వక్కంతం వంశీ విషయంలో జరిగిందే సుకుమార్ విషయంలోనూ జరుగుతుందనే భయాలు పెట్టుకోనక్కరలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.