‘మేజర్’గా నటించడం గౌరవమే కానీ..: మహేశ్


'మేజర్'గా నటించడం గౌరవమే కానీ..: మహేశ్
మహేశ్

అడివి శేష్ టైటిల్ పాత్రధారిగా మహేశ్‌కు చెందిన నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మేజర్’ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కేరెక్టర్‌ను శేష్ పోషించనున్నాడు.

కాగా తనకు ఆ కేరెక్టర్ పోషించే అవకాశం వస్తే గౌరవంగా భావిస్తానని మహేశ్ చెప్పాడు. అదే సమయంలో ఆ పాత్రకు అడివి శేష్ కరెక్టుగా సరిపోతాడని కూడా చెప్పాడు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ ఈ విషయం చెప్పాడు.

నిర్మాతగా మారాలని ఎందుకనిపించిందనే ప్రశ్నకు “చెప్పాలంటే నేను యాక్టివ్ ప్రొడ్యూసర్‌ను కాను. మా నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సమర్థవంతమైన ఒక బృందం నిర్వహిస్తోంది. నాకు సినిమాతో పాటు, సినిమాకు సంబంధించిన అన్ని అంశాలూ ఇష్టం. కొన్ని కథలను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాటన్నింటిలోనూ నేనుండలేను కదా” అని తెలిపాడు.

“మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను చేయడం మీకిష్టం లేదా?” అనడిగితే, “అది చేసే అవకాశం వస్తే గౌరవంగా భావిస్తాను. ‘మేజర్’ అనేది మన నేషనల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్. చాలా కాలం నుంచి ఆయన కథతో అడివి శేష్ ప్రయాణిస్తున్నాడు. ఆ పాత్రకు అతను పూర్తిగా సరిపోతాడు. ఆ సినిమాలో అడివిని చూసేందుకు ఎదురుచూస్తున్నా” అని తెలిపాడు మహేశ్.

‘మేజర్’ సినిమాని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సోనీ పిక్చర్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్ నిర్మిస్తున్నాయి. 2020లో ఈ సినిమా విడుదలవుతుంది.