‘మర్యాద రామన్న’ ఫేమస్ సాంగ్ వెనకున్న ఇంటరెస్టింగ్ స్టోరీ!


'మర్యాద రామన్న' ఫేమస్ సాంగ్ వెనకున్న ఇంటరెస్టింగ్ స్టోరీ!
‘మర్యాద రామన్న’ ఫేమస్ సాంగ్ వెనకున్న ఇంటరెస్టింగ్ స్టోరీ!

మన సినిమాల్లో సందర్భ శుద్ధి లేకుండా పాటలు రావడం సర్వ సాధారణం. పాట వినసొంపుగా, కంటికింపుగా ఉంటే థియేటర్లో కూర్చుంటాం. లేదంటే టాయిలెట్‌కు వెళ్లడానికో, సిగరెట్ తాగడానికో అదే సరైన సమయమని భావించే లేచేస్తాం. సందర్భానికి తగ్గట్లు పాట వస్తే లేవబుద్ధి కాదు. లేస్తే కథలో ఏదైనా మిస్సవుతామేమోననే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు కూడా లేవాలనిపించిందంటే అది పాట తప్పే. ఆ పాట మనకు నచ్చలేదన్న మాటే.

ఒక్కోసారి పాటే కథలో ఉత్కంఠను తీసుకొస్తుంది. యస్.యస్. రాజమౌళి రూపొందించిన ‘మర్యాద రామన్న’ సినిమాలోని “ఎన్నేండ్లకు పెద పెద పండగ వచ్చే.. వాకిండ్లకు మావాకులు గుచ్చె..” పాట సరిగ్గా అలాంటి పాటే. ఆ పాట ఉండే రెండున్నర నిమిషాలు మనం ఏదో జరగబోతోందనే ఉత్కంఠను, హీరో సునీల్‌కు ఏమవుతుందోననే ఆందోళననూ ఫీలవుతాం.

'మర్యాద రామన్న' ఫేమస్ సాంగ్ వెనకున్న ఇంటరెస్టింగ్ స్టోరీ!
Chaitanya Prasad

సినిమాలో ఆ పాటకున్న విలువ ప్రత్యేకమైందనే చెప్పాలి. అంత బాగా ఆ పాట రాసిన కవి చైతన్య ప్రసాద్ కాగా, ఆ పాటకు బాణీలు కట్టింది ఆ చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి. రాయలాసీమ మాండలికంలో దాన్ని రాశారు గోదావరి తీర ప్రాంతానికి చెందిన చైతన్య ప్రసాద్.

ఆ పాట వెనుక ఒక కథ ఉంది. అదివరకే ‘మర్యాద రామన్న’లోనే ‘రాయె రాయె రాయె రాయె సలోని’ పాట రాశారు చైతన్య ప్రసాద్. ఒకసారి కీరవాణి ఫోన్‌చేసి ఆయనను ప్రసాద్ ల్యాబ్స్‌కు రమ్మన్నారు. కొన్ని విజువల్స్‌తో ఒక ట్యూన్ వినిపించి దానికి బిట్ సాంగ్ కావాలన్నారు.

ఆ పాట వింటున్నప్పుడు ఏదో ఘోరం జరగబోతుందన్న అభిప్రాయం కలగాలే కానీ, విషయాన్ని సూటిగా చెప్పకూడదని షరతు పెట్టారు కీరవాణి. ప్రసాద్ ల్యాబ్స్‌లోనే తనకిచ్చిన గదిలో కూర్చొని ఎలాగో కష్టపడి మొదటి రెండు లైన్లు రాశారు చైతన్య ప్రసాద్. “ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే.. వాకిండ్లకు మావాకులు గుచ్చె..” అనేవి ఆ రెండు లైన్లు. అవి కీరవాణికీ, రాజమౌళికీ నచ్చాయి.

'మర్యాద రామన్న' ఫేమస్ సాంగ్ వెనకున్న ఇంటరెస్టింగ్ స్టోరీ!

మూడో లైను ఆయనకు స్ఫురించలేదు. తంటాలు పడి కొన్ని రకాలుగా రాసి తీసుకెళ్తే రాజమౌళికి నచ్చలేదు. మరుసటి రోజు వరకు గడువు అడిగారు చైతన్య ప్రసాద్. ఆ రాత్రి ఒక యాభై రకాలుగా రాశారు. మర్నాడు వాటన్నింటినీ పరిశీలించిన రాజమౌళికి ఒక లైన్ బాగా నచ్చేసింది. అదే.. “అమ్మోరికి ఆకలి గురుతొచ్చే.. ఓయ..”

దాని తర్వాత రెండో పాదానికి పెద్ద కష్ట పడలేదు చైతన్య ప్రసాద్. “కోట్లిస్తది కోడిని కోసిస్తే.. మేళ్లిస్తది మేకను బలియిస్తే.. పోలమ్మకు పొట్టేలును యేస్తే.. ఓయ..” అంటూ ఆ పాదం రాసేశారు.

మొదట అనుకున్నది ఇంతవరకే. అంటే బిట్ సాంగ్ అన్న మాట. దాన్ని రికార్డింగ్ కూడా చేసేశారు. ఆ తర్వాత దాన్ని పొడిగిస్తే సన్నివేశంలో ఉత్కంఠ మరింత పెరుగుతుందని రాజమౌళికి తోచింది. కీరవాణికి చెప్పారు. ఆయన నుంచి మళ్లీ చైతన్య ప్రసాద్‌కు ఫోన్. ఆ సాంగ్‌ కంటిన్యూ చేయమని చెప్పారు. కొన్ని విజువల్స్ కూడా చూపించారు.

హీరో సునీల్ ప్రమాదంలో చిక్కుకున్నాడనీ, దాన్నుంచి అతను తప్పించుకోవడం అసాధ్యమనే అభిప్రాయం కలిగేలా ఆ లైన్లు ఉండాలని కీరవాణి చెప్పారు. చైతన్య ప్రసాద్ కలం వడిగా, వేగంగా సాగింది.. “అమ్మోరికి అవ్వాలని మేత.. ఏనాడో రాసేసిన రాత.. వెలుగుండదు రేతిరి గడిసాకా.. ఓయ..” అంటూ మూడో పాదం వచ్చేసింది.

'మర్యాద రామన్న' ఫేమస్ సాంగ్ వెనకున్న ఇంటరెస్టింగ్ స్టోరీ!

కలం ఇప్పుడు కత్తిలా మారింది.. “సుట్టూతా కసి కత్తుల కోట.. ఏ దారీ కనిపించని సోట.. కునుకుండదు కంటికి ఏ పూటా.. ఓయ..” అనే నాలుగో పాదాన్ని కసకసా రాసేసింది. ఇక హీరో పని అయిపోయినట్లేననే ఫీలింగ్ ప్రేక్షకుడికి రావాలి. అందుకని, “దండాలమ దండాలమ తల్లా.. నీ యేటను తెచ్చేస్తాం తల్లా.. కోబలి అని కొట్టేస్తాం తల్లా.. ఓయ!” అనే ఐదో పాదంతో పాటను పూర్తి చేశారు చైతన్య ప్రసాద్.

సినిమాలో ఈ పాట గొప్పగా కథలో ఇమిడిపోయింది. సందర్భాన్ని వేడెక్కించింది. బిట్ సాంగ్ నుంచి పూర్తి పాటగా మారి ఆకట్టుకుంది. చిత్రంగా ఈ పాట ఆడియోలో లేదు. సినిమాలో మాత్రమే ఉంది. ఎందుకంటే ఆడియో విడుదల అయిపోయిన తర్వాతే ఈ పాట రావడం.

అయినప్పటికీ ఈ సినిమా చూస్తున్నప్పుడల్లా, ఆ పాట వచ్చినప్పుడు మనలో ఉత్కంఠ అలాగే కొత్తగా ఉండటం విశేషం. అది ఆ పాట గొప్పదనం.

‘మర్యాద రామన్న’ ఫేమస్ సాంగ్ వెనకున్న ఇంటరెస్టింగ్ స్టోరీ! | actioncutok.com

You may also like: