బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న ‘మహానటి’ తార!


బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న 'మహానటి' తార!

‘మహానటి’ సినిమాతో నాయిక ప్రధాన చిత్రాలతోనూ రాణించగలనని నిరూపించిన కీర్తీ సురేశ్ త్వరలో మరో నాయిక ప్రధాన చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఆ సినిమాతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుండటం విశేషం. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌కు చెందిన బాలీవుడ్ డైరెక్టర్ నగేశ్ కుకునూర్ రూపొందించనున్నాడు.

తొలి చిత్రం ‘హైదరాబాద్ బ్లూస్’ (1998)తోటే డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్న నగేశ్ తర్వాత కాలంలో ‘రాక్‌ఫోర్డ్’, ‘బాలీవుడ్ కాలింగ్’, ‘3 దీవారే’, ‘హైదరాబాద్ బ్లూస్ 2’, ‘ఇక్బాల్’, ‘డోర్’, ‘లక్ష్మి’, ‘ధనక్’ వంటి చిత్రాలు రూపొందించాడు. మూడేళ్ల విరామంతో ఇప్పుడు కీర్తి ప్రధాన పాత్రధారిగా సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు.

కీర్తికి తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఏక కాలంలో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు తెలుగు చిత్రసీమకు చెందిన ఒక పేరున్న నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోనున్నట్లు సమాచారం.