Luka Chuppi Review: 4 Ups and 2 Downs


Luka Chuppi Review: 4 Ups and 2 Downs
Luka Chuppi Poster

తారాగణం: కార్తీక్ ఆర్యన్, కృతి సనన్, అపరశక్తి ఖురానా, పంకజ్ త్రిపాఠి, అతుల్ శ్రీవాస్తవ, వినయ్ పాఠక్

దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్

విడుదల తేదీ: 1 మార్చి, 2009

కథ

మధురలోని ఒక కేబుల్ న్యూస్ చానల్ లో రిపోర్టర్ కమ్ యాంకర్ గా పనిచేస్తుంటాడు గుడ్డూ శుక్లా ( కార్తీక్ ఆర్యన్). అతని స్నేహితుడు అబ్బాస్ ( అపరశక్తి ఖురానా) కూడా అక్కడే కెమెరామన్ గా పనిచేస్తుంటాడు. రష్మీ త్రివేది ( కృతి సనన్) ఒక రాజకీయ నాయకుడి ( వినయ్ పాఠక్) కూతురు.

రష్మీ తండ్రి పార్టీ మోరల్ పోలీసింగ్ చేస్తుంటుంది. ఆయనకు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే మాటంటేనే ఏహ్యభావం. తండ్రికి కూతురు పూర్తి విరుద్ధం. ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్స్ చేసిన ఆమెవన్నీ పురోగామి భావాలే.

గుడ్డూ పనిచేసే చానల్లో ఇంటర్న్షిప్ కోసం చేరుతుంది రష్మి. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. పెళ్లి చేసుకుందామని అతడూ, కాదు.. ముందు కొంత కాలం కలిసి గడిపాక అప్పుడు చూద్దామని ఆమే వాదించుకుంటారు.

నెల రోజుల పాటు గ్వాలియర్ లో పనిచేసే అవకాశం రావడంతో అక్కడకు వెళ్తారు. పెళ్లయిన జంటగా అక్కడి వాళ్లని నమ్మించడానికి నుదుటన సిందూరం పెట్టుకొని, మెడలో మంగళసూత్రం వేసుకుంటుంది రష్మి.

అయితే గుడ్డూ అన్న బావమరిది బాబూలాల్ వాళ్లను అనుమానిస్తాడు. ఇది గ్రహించిన జంట తాము పెళ్లి చేసుకున్నట్లు తమ కుటుంబాలను నమ్మిస్తుంది. పరిస్థితులు అంతకంతకూ క్లిష్టంగా మారుతుండటంతో నిజంగానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు రష్మి, గుడ్డూ. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.

కథనం

సింగిల్ లైన్ కథని డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్, రైటర్ రోహన్ శంకర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా తయారుచేశారు. సందర్భం కుదిరినప్పుడల్లా నవ్వించిన వాళ్లు, కొన్ని సామాజిక సందేశాల్నీ అందించారు. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవిస్తున్నప్పుడు ఎలాంటి అసౌకర్యానికీ గురవని గుడ్డూ, రష్మి.. ఎప్పుడైతే తమ కుటుంబాలు తమ జీవితంలోకి వచ్చాయో అప్పట్నుంచీ ఇబ్బంది పడుతూ వచ్చారని చూపించడం సామాజిక వాస్తవికతని చిత్రించడమే.

లివ్-ఇన్-రిలేషన్‌షిప్‌లో ప్రేమికులిద్దరి మధ్యా చెప్పుకోదగ్గ ఘర్షణ ఏమీ జరగదు. ప్రతి విషయాన్నీ వాళ్లు పరస్పరం సర్దుబాటు చేసుకుంటూ వస్తారు. గుడ్డూ కుటుంబం రష్మి విషయంలో అభ్యుదయకరంగా వ్యవహరిస్తుంది. కోడలిని వాళ్లు ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనో కూర్చోమని చెప్పారు. ఉద్యోగం చేసుకొమ్మని ప్రోత్సహిస్తారు. అయితే పెద్ద కోడలి విషయంలో వాళ్లు తద్భిన్నంగా వ్యవహరించడం మనుషుల ప్రవర్తనలోని ద్వంద్వనీతిని పట్టిస్తుంది.

రష్మి తండ్రి రంగులు మార్చే రాజకీయ నాయకుడికి ప్రతినిధిగా కనిపిస్తాడు. మరిన్ని ఓట్లు వస్తాయంటే వెంటనే ముఖం మార్చేసి అభ్యుదయవాదైపోతాడు. అయితే చివరలో నిజంగానే అతడు మారతాడు. పెళ్లయ్యాక ఒక్కసారి కూడా బయటివాళ్లకు ముఖం చూపించకుండా పరదా వెనుక ఉండిపోయిన భార్యను తొలిసారిగా ముఖం మీది ముసుగును తీసెయ్యమని చెప్పడం ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే అంశం.

Luka Chuppi Review: 4 Ups and 2 Downs
Luka Chuppi Still
దర్శకత్వం, సంగీతం

మరాఠీ సినిమాల దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ‘లుకా చుప్పీ’తో ఎంతో ఆత్మవిశ్వాసంగా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. పైకి చిన్న చిన్న అంశాలు గానే కనిపించినా పరిశీలిస్తే దర్శకుడు వాటి ద్వారా సామాజికాంశాలను స్పృశించాడనీ, మూఢనమ్మకాల్నీ, దురాచారాల్నీ ప్రశ్నిస్తున్నాడనీ అర్థమవుతుంది. ఆ విషయాల్ని సీరియస్ టోన్‌లో చెప్పకుండా లైట్ హార్టెడ్‌గా చెప్పడంలో అతడి చాతుర్యమూ వెల్లడవుతుంది.

ప్రేక్షకులు బాగా ఆస్వాదించే అంశం డైలాగ్స్. ఒక దాని తర్వాత ఒకటిగా అనేక సన్నివేశాల్లోని సంభాషణలు మన ముఖాలపై నవ్వును మొలిపిస్తూనే ఉంటాయ్.

సినిమా మొత్తమ్మీద ఐదు పాటలుంటే ఒక్క పాటా ఒరిజినల్ కాకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి 90’ల నాటి హిందీ హిట్స్‌తో పాటు పంజాబీ సాంగ్స్‌ని సందర్భానుసారం సమయోచితంగా ఉపయోగించుకున్నారు. ఈ పాటలన్నీ వినసొంపుగా ఉండేవే. ఈ రిక్రియేషన్ సాంగ్స్‌కు తనిష్క్ బాగ్చి, వైట్ నాయిస్, అభిజిత్ వఘాని మ్యూజిక్ ఇవ్వగా, కేతన్ సోధా రీరికార్డింగ్ అందించాడు. కేతన్ ఇచ్చిన మ్యూజిక్ సన్నివేశాలకు బలాన్నిచ్చింది.

తారల అభినయం

‘1.. నేనొక్కడినే’, ‘దోచెయ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచితురాలైన కృతి సనన్‌లోని స్పాంటేనియస్ యాక్ట్రెస్ ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. రష్మీ త్రివేది పాత్రతో కామెడీని సైతం పండించగలనని దర్శకులకు సంకేతాలు పంపింది. హీరో గుడ్డూ పాత్రలో కార్తీక్ ఆర్యన్ సునాయాసంగా ఒదిగిపోయాడు. కచ్చితమైన టైమింగ్ అతడి నటనలో ముచ్చటగొలిపే అంశం. ‘ప్యార్ కా పంచనామా’తో వెలుగులోకి వచ్చిన కార్తీక్‌ను ‘లుకా చుప్పీ’ మరో మెట్టు పైకెక్కించినట్లే.

‘దూసుకెళ్తా’, ‘కాలా’ సినిమాలతో మనకు పరిచితుడైన పంకజ్ త్రిపాఠి నటన కోసం ఈ సినిమాని చూడొచ్చంటే అతిశయోక్తి కాదు. సెక్స్ అంటే పడిచచ్చిపోయే పాత్రలో వినోదాన్ని పంచాడు. పరిధులు దాటకుండా తనకిచ్చిన ప్రతి సన్నివేశాన్నీ అహ్లాదభరితంగా మార్చేశాడు. అపరశక్తి కూడా తన వంతు వినోదాన్ని అందించాడు.

అతుల్ శ్తీవాస్తవ, వినయ్ పాఠక్, మిగతా పాత్రధారులు తమ పరిధుల మేరకు అభినయాన్ని ప్రదర్శించారు.

చివరి మాట

వల్గారిటీ లేని శుభ్రమైన కామెడీని ఎంజాయ్ చేయాలనుకోనేవాళ్లు ‘లుకా చుప్పీ’ని చూడొచ్చు.

– వనమాలి