‘మహర్షి’ విడుదల మే 9కి మారింది!


'మహర్షి' విడుదల మే 9కి మారింది!

మహేశ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి రూపొందిస్తోన్న ‘మహర్షి’ సినిమా ఏప్రిల్ 25న కాకుండా మే 9న విడుదల కానున్నది. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు బుధవారం ప్రకటించారు. విడుదల తేదీలో మార్పు చోటు చేసుకోవడం ‘మహర్షి’కి ఇంది రెండోసారి.

మొదట ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నిర్మాతలు తర్వాత దాన్ని ఏప్రిల్ 25కి జరిపారు. ఇప్పుడు మరోసారి రెండు వారాలు వాయిదా వేసి మే 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదల తేదీకే..

ఇప్పటివరకు వంశీ పైడిపల్లి రూపొందించిన సినిమాల్లో ‘మహర్షి’ బెస్ట్ స్క్రిప్ట్ అని రాజు చెప్పారు. “సినిమా చాలా బాగా వచ్చిందని యూనిట్ అంతా ఉద్వేగంగా ఉన్నాం. రెండు పాటలు, కొన్ని మాంటేజ్ షాట్స్ మినహా షూటింగ్ దాదాపు పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ సమయానికి పూర్తవుతుందో లేదోననే భయం అందరిలో ఉంది.

అందుకే నిన్న మహేశ్‌తో కూర్చొని చర్చించి మే 9న రిలీజ్ చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నాం. సందర్భవశాతూ అశ్వనీదత్ గారికి మే 9 బాగా కలిసొచ్చింది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’ సినిమాలు ఆరోజే విడుదలయ్యాయి. మహేశ్ కెరీర్‌లోని బెస్ట్ ఫిలిమ్స్‌లో ‘మహర్షి’ ఒకటవుతుంది.

కెరీర్ మొత్తమ్మీదే బెస్ట్ ఫిల్మ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మా బేనర్‌లో సంక్రాంతికొక బ్లాక్‌బస్టర్ వచ్చేసింది. ఈ సమ్మర్‌లో ‘మహర్షి’తో ఇంకో బ్లాక్‌బస్టర్ రాబోతుందనుకుంటున్నాం. మే మొదటివారంలో ఎన్నికలు అయిపోయాక ఈ సినిమా వస్తుంది కాబ్ట్టి అందరూ ఈ సినిమాని చూసి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు” అని చెప్పారు రాజు.

పూజా హెగ్డే నాయికగా నటిస్తోన్న ఈ సినిమా సి. అశ్వనీదత్, దిల్ రాజు. పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.