రెండోసారి ‘ఖలేజా’ చూశారా?


రెండోసారి 'ఖలేజా' చూశారా?

రెండోసారి ‘ఖలేజా’ చూశారా?

కొన్ని సందర్భాల్లో సినిమా ఎందుకు హిట్టయిందో ఒక పట్టాన పాలుపోదు. కొన్ని సందర్భాల్లో సినిమా ఎందుకు ఫ్లాపయ్యిందో అర్థం కాదు. సినిమా విడుదలైన సమయమో, మానసికంగా ఒక స్థాయి పరిణతి చెందిన, లేదంటే అభిరుచి కలిగిన ప్రేక్షకులకు నచ్చిన సినిమా సాధారణ ప్రేక్షకులకు నచ్చదు.

అది వాళ్ల తప్పు ఎంత మాత్రమూ కాదు. ఆ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా దర్శకుడు ఆ సినిమాని మలచలేకపోవడం ఆ దర్శకుడి తప్పనుకుందామా! బహుశా అలాగే అనుకోవాలి.

కొన్ని సినిమాలను ఒకసారి చూస్తే చాలా బాగుందనిపిస్తుంది. రెండోసారి చూస్తే ఫర్వాలేదనిపిస్తుంది. మూడోసారి చూస్తే విసుగేస్తుంది. అంటే చూసే కొద్దీ ఆ సినిమా విలువ పడిపోతుందన్న మాట. కానీ కొన్ని సినిమాలు మొదటిసారి చూసినప్పుడు ఫర్వాలేదనిపించి, రెండోసారి చూసినప్పుడు బాగున్నాయనిపిస్తాయి. అలాంటి కోవకు చెందిన సినిమా ‘ఖలేజా’.

త్రివిక్రం డైరెక్ట్ చేసిన ‘ఖలేజా’లో మహేశ్ నటన ఆద్యంతమూ అలరిస్తుంది. మహేశ్ ఉన్నత స్థాయి అభినయాన్ని ప్రదర్శించిన సినిమాల్లో మొదటి వరుసలో నిలిచే సినిమా అది. ఆ సినిమాని రెండో సారి చూస్తే, మొదటి సారి చూసిన దానికంటే మరింత బాగుందనిపిస్తుంది.

‘ఖలేజా’ ఆశించిన రీతిలో ఆడలేదు. కానీ నటుడిగా మహేశ్‌ను కొత్తగా చూపించిన సినిమా. ఆ క్రెడిట్ డైరెక్టర్ త్రివిక్రందే. మహేశ్ డైలాగ్ డిక్షన్‌ను మనం అమితంగా ఆస్వాదిస్తాం. త్రివిక్రం కల్పించిన పలు సన్నివేశాలు ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయో! ముఖ్యంగా మహేశ్, అనుష్క మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు. ఆ సన్నివేశాల్లో మహేశ్ పలికే డైలాగ్స్ అమితంగా ఆకట్టుకుంటాయి.

రెండోసారి 'ఖలేజా' చూశారా?

‘ఖలేజా’లో రాజు పాత్రలో నటించిన మహేశ్ సీరియస్ సన్నివేశాల్ని సైతం జోవియల్‌గా మార్చేస్తాడు. క్యారెక్టరైజేషన్ పరంగా తెలుగులో అదొక కొత్త ప్రయోగం. అనుష్క చేసిన సుభాషిణి పాత్రను దురదృష్టవంతురాలిగా చిత్రీకరించి, ఆయా సన్నివేశాల్ని హిలేరియస్‌గా దర్శకుడు మార్చేశాడు. మొత్తంగా చూస్తే భిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో మహేశ్ ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లలో చెలరేగిపోయి చేశాడు.

‘ఖలేజా’ కచ్చితం గా మహేశ్ సినిమా. ‘ఖలేజా’ కచ్చితంగా త్రివిక్రం సినిమా కూడా! మరోసారి ‘ఖలేజా’ను చూడండి. నచ్చిందని మీరే చెప్తారు.

– సజ్జా వరుణ్

రెండోసారి ‘ఖలేజా’ చూశారా? | actioncutok.com

You may also like: