బాలీవుడ్‌తో పోలిస్తే చైనీస్ సినిమా వెనుకబడి ఉంది: చైనా నేషనల్ ఫిల్మ్ బ్యూరో డైరెక్టర్


బాలీవుడ్‌తో పోలిస్తే చైనీస్ సినిమా వెనుకబడి ఉంది: చైనా నేషనల్ ఫిల్మ్ బ్యూరో డైరెక్టర్
A still from a Chinese film

అమెరికా తరహాలో 2035 నాటికల్లా తమ దేశాన్ని ‘బలమైన సినీ శక్తి’ (స్ట్రాంగ్ ఫిల్మ్ పవర్)గా మార్చాలని సినీ దర్శకనిర్మాతలకు చైనా పిలుపునిచ్చింది. చైనా సాఫ్ట్ పవర్‌ను పెంచడంలో భాగంగా ఏడాదికి నిర్మించే వంద సినిమాల్లో ఒక్కొక్కటి 100 మిలియన్ ఆర్ఎంబీ (15 మిలియన్ అమెరికన్ డాలర్లు)లను ఆర్జించే విధంగా రూపొందించాలనీ కోరింది

బీజింగ్‌లో తొలిసారి ఏర్పాటుచేసిన జాతీయస్థాయి ఇండస్ట్రీ సింపోజియంలో ఈ లక్ష్యాల్ని సెంట్రల్ ప్రాపగాండా డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డిప్యుటీ డైరెక్టర్, నేషనల్ ఫిల్మ్ బ్యూరో డైరెక్టర్ అయిన్ వాంగ్ జియావోహుయ్ నిర్దేశించారు. ఈ సింపోజియానికి చైనా ప్రభుత్వాధికారులు, సినీ అధ్యయనకర్తలు, ప్రధాన సినిమా నిర్మాణ సంస్థల ప్రతినిధులు, వివిధ సినీ సంఘాలవాళ్లు హాజరయ్యారు. చైనా చిత్రపరిశ్రమ భవిష్యత్ వృద్ధిని ఈ సింపోజియంలో నిర్దేశించారు.

అధికార కమ్యూనిస్ట్ పార్టీ వాణిని వినిపించే పీపుల్స్ డైలీ దినపత్రిక ప్రకారం ఈ సదస్సులో చెన్ కైగే, ఝాంగ్ యిమౌ, నింగ్ హావో, గువాన్ హు, హువాంగ్ జియాంగ్జిన్ వంటి డైరెక్టర్లు, ఝాంగ్ జియి, వు జింగ్, చెన్ డావోమింగ్ వంటి నటులు పాల్గొన్నారు.

2018లో చైనా మార్కెట్‌లో అమెరికన్ సినిమాలు 2.8 బిలియన్ డాలర్లను వసూలు చేస్తే, అమెరికన్ మార్కెట్‌లో చైనీస్ సినిమాలు కేవలం కొన్ని పదుల మిలియన్ డాలర్లను మాత్రమే ఆర్జించాయని వాంగ్ చెప్పారు. స్థానిక మార్కెట్ రీత్యా చైనా ఇప్పటికే ‘పెద్ద సినీ శక్తి’గా అవతరించిందనీ, ఇది అమెరికా తరహాలో 2035 నాటికి ‘బలమైన సినీ శక్తి’గా మారాల్సిన అవసరం ఉందనీ ఆయన పిలుపునిచ్చారు.

“చైనీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో నాణ్యత ఒకటి. హాలీవుడ్, బాలీవుడ్‌లతో పోలిస్తే కథలను చెప్పే సామర్థ్యంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం” అని వాంగ్ అన్నారు.