మార్చి 5 నుంచి సెట్స్‌పై ‘డిస్కో రాజా’ సందడి!


మార్చి 5 నుంచి సెట్స్‌పై 'డిస్కో రాజా' సందడి!

రవితేజ హీరోగా నటించనున్న కొత్త సినిమా ‘డిస్కో రాజా’ టైటిల్ లోగోను ఆయన పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న ఆవిష్కరించాక, మళ్లీ ఇంత దాకా ఆ సినిమా గురించి ఎలాంటి సమాచారమూ లేకపోవడంతో రకరకాల వదంతులు వ్యాపించాయి. ఒక సందర్భంలో అయితే ఆ సినిమా ఆగిపోయిందనే ప్రచారమూ జరిగింది.

అయితే ఆ ప్రచారానికి నిర్మాతలు ముగింపు పలుకుతున్నారు. మంగళవారం (మార్చి 5) నుంచి ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మొదలవనున్నది. విఐ ఆనంద్ డైరెక్ట్ చేసే ఈ సైన్స్‌ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌లో పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ నాయికలుగా నటిస్తున్నారు. మరో నాయిక ఎంపిక జరగాల్సి ఉంది.

1980ల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని వినిపిస్తోంది. రవితేజ ద్విపాత్రల్లో కనిపించనున్నాడు. బాబీసింహా ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడుగా నటిస్తున్నాడు. హైద‌రాబాద్ తో పాటు గోవా, చెన్నై, ల‌డాఖ్, మ‌నాలీలోతో పాటు నార్త్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఈ సినిమాను చిత్రీక‌రించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి సంభాషణలు రాస్తుండగా, తమన్ స్వరాలు కూరుస్తున్నాడు.