వెల్లడైంది: ‘టెంపర్’ తమిళ రీమేక్ ‘అయోగ్య’ ఎప్పుడొస్తున్నదంటే..


వెల్లడైంది: 'టెంపర్' తమిళ రీమేక్ 'అయోగ్య' ఎప్పుడొస్తున్నదంటే..

విశాల్ హీరోగా నటిస్తోన్న ‘అయోగ్య’ సినిమా విడుదల తేదీ ఖరారయింది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన హిట్ ఫిల్మ్ ‘టెంపర్’కు ఇది రీమేక్. ఎ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా నాయిక.

ఏప్రిల్ 19న చిత్రాన్ని విడుదల చేయాలని సంకల్పించినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజీ ద్వారా విశాల్ వెల్లడించాడు. అంతే కాదు, ఈ సినిమా థియేటర్ హక్కుల్ని స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్‌టైనర్ పొందినట్లు కూడా తెలిపాడు.

తెలుగు నిర్మాత ఠాగూర్ మధుతో కలిసి విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. పార్తీబన్, కె.ఎస్. రవికుమార్, సోనియా అగర్వాల్, సచ్చు, వంశీ, పూజ ఇతర పాత్రధారులు.

ఒక స్పెషల్ సాంగ్ ద్వారా శ్రద్ధా దాస్ ఈ సినిమాతో తమిళ చిత్రసీమకు పరిచయమవుతోంది. వాస్తవానికి ఆ పాటను మొదట సన్నీ లియోన్‌తో తియ్యాలనుకొని, చివరకు శ్రద్ధా దాస్‌ను తీసుకున్నారు.

ఈ సినిమాలో కర్ణ అనే పోలీస్ ఆఫీసర్‌గా విశాల్ కనిపించనున్నాడు. తన పేరుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తిగా అతను నటిస్తున్నాడు.

కాగా ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ సాధించింది. అందులో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా, సారా అలీఖాన్ అతని జోడీగా కనిపించింది.