ఆర్ ఆర్ ఆర్: తప్పని తేలిన 7 వదంతులు


ఆర్ ఆర్ ఆర్: తప్పని తేలిన 7 వదంతులు

ఆర్ ఆర్ ఆర్: తప్పని తేలిన 7 వదంతులు

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తెలుగులో అత్యంత భారీ బడ్జెట్‌తో తీస్తున్న సినిమాల్లో ఒకటి. స్వాతంత్ర్య పూర్వ కాలం నేపథ్యంతో రూపొందిస్తోన్న కల్పిత కథ. ఇందులో అజయ్ దేవ్‌గణ్, అలియా భట్, సముద్రకని లాంటి పేరుపొందిన నటులు నటిస్తున్నారు.

2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి నిర్మాత డీవీవీ దానయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పట్నుంచీ దానిపై అనేకానేక వదంతులు, ప్రచారాలూ చలామణిలోకి వచ్చాయి. అవేమిటో, వాటిలో నిజమెంతో చూద్దాం.

టైటిల్ ‘రామ రావణ రాజ్యం’

‘ఆర్ ఆర్ ఆర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్‌ను రాజమౌళి ప్రారంభించాడు. అప్పట్నుంచీ ‘ఆర్ ఆర్ ఆర్’ అంటే ‘రామ రావణ రాజ్యం’ అంటూ ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు టైటిల్ ఖరారు కాలేదని రాజమౌళి స్పష్టం చేశాడు.

‘ఆర్ ఆర్ ఆర్’ అనే కామన్ టైటిల్ అన్ని భషల్లోనూ ఉంటుందనీ, ఒక్కో భాషలో ఒక్కో కొనసాగింపు టైటీ ఉంటుందనీ ఆయన చెప్పాడు. ఉదాహరణకు తెలుగులో మొదట ‘ఆర్ ఆర్ ఆర్’ అని మొదలై, తర్వాత దాన్ని వివరించే కొనసాగింపు ఉంటుంది. అది ‘రామ రావణ రాజ్యం’ అయ్యే అవకాశాలు లేవు.

తొలి షెడ్యూల్ నాటికి స్క్రిప్ట్ పూర్తి కాలేదు

పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయకుండానే రాజమౌళి తొలి షెడ్యూల్ షూటింగ్ జరిపాడనీ, రెండో షెడ్యూల్ మొదలు పెట్టే ముందు మాత్రమే పక్కా స్క్రిప్ట్ సిద్ధమయ్యిందనీ వదంతులు వచ్చాయి. అందులో నిజం లేదు. పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేసిన తర్వాతనే తొలి షెడ్యూల్ మొదలైంది. అసలు షూటింగ్ లేటవడానికి కారణం స్క్రిప్టును పూర్తిగా సిద్ధం చేయడానికి ఎక్కువ కాలం పట్టడమేనని రాజమౌళి తెలిపాడు.

బ్రిటిష్ పోలీసాఫీసర్‌గా రాంచరణ్

రాంచరణ్ ఈ సినిమాలో రాముడి తరహా బుద్ధిమంతుడి పాత్రను చేస్తున్నాడనీ, అతను బ్రిటిష్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తాడనీ ప్రచారంలోకి వచ్చింది. కొంతమందైతే ఏకంగా అతను మూడు భిన్న ఛాయలున్న పాత్ర పోషిస్తున్నాడన్నారు. వాటిలో ఒకటి పోలీసాఫీసర్ రోల్ అయితే, ఇంకొకటి నెగటివ్ ఛాయలుండే మాస్ లీడర్ రోల్ అనీ, మరొకటి స్వాతంత్ర్య సమరయోధుడనీ ప్రచారం చేశారు.

వీటిలో స్వాతంత్ర్య సమరయోధుడనే పాయింట్ ఒక్కటే మ్యాచ్ అవుతుంది. చరణ్ పాత్రలో నెగటివ్ ఛాయలేమీ ఉండవు. పైగా అతను ఈ సినిమాలో చేస్తోంది అల్లూరి సీతారామరాజు పాత్ర. అయితే అది చరిత్రలో కనిపించే సీతారామరాజు కథ కాదు. ఆ పాత్ర మీద అల్లిన కల్పిత కథ.

జూనియర్ ఎన్టీఆర్ బందిపోటు/దొంగ పాత్ర చేస్తున్నాడు

‘ఆర్ ఆర్ ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ రావణుడి తరహా నెగటివ్ రోల్ చేస్తున్నాడని కొంతమందీ, అతను బందిపోటు/దొంగగా చేస్తున్నాడని ఇంకొంతమందీ ప్రచారంలోకి తెచ్చారు. ఈ రెండూ కరెక్ట్ కాదు. గొరిల్లా పోరాట వీరుడు, గోండుల స్వాతంత్ర్యం కోసం కడదాకా నిజాం పైనా, బ్రిటిషర్లపైనా కడదాకా పోరు సల్పిన కొమరం భీం పాత్రను చేస్తున్నాడు చిన్న ఎన్టీఆర్. అంటే అతను చేస్తోంది రావణ తరహా పాత్ర కాదనేది స్పష్టం.

ఇద్దరు హీరోల మధ్య గొడవలుంటాయి

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలు మొదట్లో కలహించుకుంటాయనీ, వాళ్ల మధ్య భీకర యుద్ధం జరుగుతుందనీ, చివరకు కలిసిపోయి బ్రిటిషర్లపై పోరాటం చేస్తారనీ ప్రచారంలోకి వచ్చింది. అందులో చివరి భాగం మాత్రమే నిజం. ఆ ఇద్దరూ మొదట కొట్టుకుంటారనే దాంట్లో నిజం లేదు.

చరిత్రలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలుసుకున్నట్లు చరిత్రలో ఎక్కడా రికార్డ్ కాలేదు. కానీ ఇద్దరూ ఒకే కాలంలో తమ యవ్వనంలో ఇల్లొదిలి తెలీని ప్రాంతాలకు వెళ్లారు. వచ్చాక బ్రిటిషర్లపై పోరాడారు. ఈ పాయింట్‌నే తీసుకొని ఇల్లొదిలి వెళ్లిన వాళ్లిద్దరూ కలుసుకొని ఉంటే ఏం జరిగి ఉండేదని ఊహిస్తూ రాసిన కల్పిత కథ ఈ సినిమా అని రాజమౌళి వివరించాడు.

మూడో షెడ్యూల్ కోల్‌కతాలో జరుగుతుంది

రెండో షెడ్యూల్ పూర్తయ్యాక, మూడో షెడ్యూల్ కోల్‌కతాలో 40 రోజుల పాటు జరుగుతుందని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అది తప్పని నిర్మాత దానయ్య మాటల వల్ల స్పష్టమైంది. ఈ నెలాఖరు నుంచి పూణే, అహ్మదాబాద్‌లలో 30 రోజుల పాటు మూడో షెడ్యూల్ జరుగుతుందని ఆయన చెప్పాడు.

2020 వేసవిలో రిలీజవుతుంది

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ డిసెంబర్ లోగా పూర్తవుతుందనీ, 2020 మొదట్లో కానీ, వేసవిలో కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనీ విరివిగా ప్రచారంలోకి వచ్చింది. కానీ వేసవి తర్వాతనే 2020 జూలై 30న సినిమాని విడుదల చేస్తామని నిర్మాత దానయ్య ప్రకటించాడు.

– వనమాలి

ఆర్ ఆర్ ఆర్: తప్పని తేలిన 7 వదంతులు | actioncutok.com