ఆర్ఆర్ఆర్: బ్రిటిష్ యువతి ప్రేమలో జూనియర్ ఎన్టీఆర్?


ఆర్ఆర్ఆర్: బ్రిటిష్ యువతి ప్రేమలో జూనియర్ ఎన్టీఆర్?

షాకవకండి. ఇది రియల్ స్టోరీలో కాదు, రీల్ స్టోరీలో. యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్ర్య పూర్వ కాలం నేపథ్యంలో నడిచే కల్పిత కథగా ఈ సినిమాని రాజమౌళి రూపొందిస్తున్నాడు. ఇందులో చరణ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రోల్ చేస్తుండగా, చిన్న ఎన్టీఆర్ దొంగగా కనిపించనున్నాడు.

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్రిటిష్ యువతితో రొమాన్స్ చేస్తాడని తెలుస్తోంది. అందుకే ఆ పాత్రకు ఒక అమెరికన్ తారను ఎంచుకున్నట్లు వినిపిస్తోంది. అందిన సమాచారం నిజమే అయితే, ఇప్పటికే ఆమె ఈ సినిమాకు సంతకం చేసింది. ఆ నటి పేరు మాత్రం వెల్లడికాలేదు.

మరోవైపు చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పేరు చాలా కాలం నుంచి వినిపిస్తున్నా, ఇప్పటికీ ఆమె సంతకం చేయకపోవడం గమనార్హం. పారితోషికమే ఆలస్యానికి కారణమంటున్నారు. ఇప్పటికి రెండు షెడ్యూళ్లు పూర్తయినా సెట్స్‌పైకి హీరోయిన్లు అడుగుపెట్టకపోవడం విచిత్రమే.

కోల్‌కతాలో జరగనున్న మూడో షెడ్యూల్లో హీరోయిన్ల సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. ఈ నెలాఖరులోగా హీరోయిన్లు ఎవరనేది తేలడం ఖాయం. 2020 ఆరంభంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రానున్నది.