ఆర్ ఆర్ ఆర్: ఒళ్లు జలదరింపజేసే పోరాట ఘట్టాలు!


ఆర్ ఆర్ ఆర్: ఒళ్లు జలదరింపజేసే పోరాట ఘట్టాలు!

ఆర్ ఆర్ ఆర్: ఒళ్లు జలదరింపజేసే పోరాట ఘట్టాలు!

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రూపొందుతోన్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కథాంశాన్ని దర్శకుడు యస్.యస్. రాజమౌళి వెల్లడించిన దగ్గర్నుంచి, అదివరకే ఆ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో మన్యం ప్రజల జీవితాల్ని అమితంగా ప్రభావితం చేసి, వాళ్లలో స్వాతంత్ర్యేచ్ఛను రగిలించిన ఇద్దరు పోరాట యోధుల పాత్రలతో కల్పిత కథను సృష్టించడం కత్తి మీద సాము వ్యవహారం.

అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీంగా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారనే విషయం తెలిసినప్పట్నుంచీ ఆ ఇద్దరు వీరులెవరనే విషయం తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తి చూపించారు.

ఆ విషయం అలా ఉంచితే ‘ఆర్ ఆర్ ఆర్’లో పోరాట సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయనే విషయం విశ్వసనీయంగా తెలిసింది. చాలా శ్రద్ధగా వాటిని రాజమౌళి డిజైన్ చేయిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లపై ఇద్దరు హీరోలు దాడులు చేసి, పోలీసులను చితగ్గొట్టి, అక్కడి తుపాకుల్ని ఎత్తుకుపోయే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

ఇప్పటికే రాంచరణ్‌పై ఒక భారీ పోరాట ఘట్టాన్ని రాజమౌళి చిత్రీకరించాడు. ఇందులో దాదాపు వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు పాల్గొన్నారు.

ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ, అటు రాంచరణ్ కానీ పాల్గోనే ప్రతి పోరాట సన్నివేశమూ ప్రేక్షకుల్ని ఉద్వేగానికి గురిచేసేలా ఉంటుందని అంతర్గత వర్గాల సంచారం. అన్నింటికీ మించి ఒక వంతెనపై వచ్చే పోరాట ఘట్టం సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు. ఈ ఫైట్‌లో ఇద్దరు హీరోలూ పాల్గొంటారనీ, బ్రిటిషర్లపై వారు పోరాడతారనీ విశ్వసనీయ సమాచారం.

ఆ సన్నివేశాల చిత్రీకరణకు భారీ బడ్జెట్‌ను నిర్మాత కేటాయించారు. ఆ ఫైట్ క్లైమాక్స్‌కు చెందినదా, సినిమా మధ్యలో వస్తుందా అనే విషయం మాత్రం వెల్లడి కాలేదు.

రాజమౌళి సినిమాల్లోని ప్రత్యేకత, క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో ముందే ప్రేక్షకులకు తెలిసిపోవడం. అయినప్పటికీ వాటిని ఉత్తేజభరితంగా, ఉద్వేగభరితంగా చిత్రీకరించడంలోనే ఆయన నేర్పు ఉంది. ఈ సినిమా కోసం విజయేంద్రప్రసాద్ కల్పించిన పతాక సన్నివేశాలు గగుర్పాటు కలిగించే రీతిలో ఉన్నాయంటున్నారు.

పేపర్‌పైనే అలా ఉన్నాయంటే, రాజమౌళి వాటిని తెరకెక్కించే తీరుతో అవి ఇంకెంత బలంగా ఉంటాయోనని యూనిట్ వర్గాలే ఉద్వేగానికి గురవుతున్నాయి. కె.కె. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ, ఎం.ఎం. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా వీటిలో కీలకం కానున్నాయి.

సినిమాలోని ఇంకో ప్రధాన ఆకర్షణ అజయ్ దేవ్‌గణ్ ఎపిసోడ్. ఆయనది ఈ సినిమాలో పూర్తి స్థాయి పాత్ర కాదు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఒక కీలక పాత్రను ఆయన చేస్తున్నాడు. ఆయనపై వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు.

ఆర్ ఆర్ ఆర్: ఒళ్లు జలదరింపజేసే పోరాట ఘట్టాలు! | actioncutok.com

You may also like: