‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ గొప్పేమిటి?


'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2' గొప్పేమిటి?

కొన్ని రోజులుగా ఊదరగొట్టిన ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ టీజర్ విడుదలైంది. 15 గంటల వ్యవధిలోనే (ఇది రాసే సమయానికి) 2.55 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. మీడియా వర్గాలు, సినీ వర్గాలు “ఆహా.. ఓహో..” అనీ, “అద్భుతం” అనీ పొగడ్తలతో ముంచెత్తుతూ వస్తున్నారు.

బాగానే ఉంది. అసలింతకీ టీజర్ ఏం చెబుతోంది? అద్భుతం అనదగ్గది అందులో ఏముంది? మార్చి 3 శ్రద్ధా కపూర్ పుట్టినరోజు. అందుకని ఈ టీజర్‌ను విడుదల చేశారు. దీనికి ‘చాప్టర్ 2’ అని ఎందుకు పెట్టారో మనకు తెలీదు. ఇదివరకు వచ్చిన టీజర్‌కు ‘షేడ్స్ ఆఫ్ సాహో’ అని పెట్టారు కాబట్టి, ఇది రెండో టీజర్ కాబట్టి ‘చాప్టర్ 2’ అని పెట్టారని సరిపెట్టుకుందాం.

మళ్లీ ప్రశ్నించుకుందాం. ఈ టీజర్ ఏం చెబుతోంది? ఇది ఒళ్లు గగుర్పాటు కలిగించే యాక్షన్ ఫిల్మ్ అని చెప్తోంది. అందులోనూ గన్స్‌తో చేసుకొనే ఫైట్స్ ఎక్కువ అని చెప్తోంది. కొన్ని యాక్షన్ సీన్స్ ఎలా తీశారో బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటుందో ఇందులో చూపించాడు దర్శకుడు.

'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2' గొప్పేమిటి?

60 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో హీరో ప్రభాస్ ఎతసేపు కనిపించాడు? పట్టుమని 10 సెకన్లు కూడా కనిపించలేదు. హీరోయిన్ శ్రద్ధ ఒక 10 సెకన్లు కనిపించింది. మిగతా 40 సెకన్లలో సినిమాలో యాక్షన్ సీన్స్ ఎంత లావిష్‌గా, ఎంత ఖరీదైన, అధునాతన వెపన్స్‌తో తీశారో చూపించేందుకు ఉపయోగించుకున్నారు. వాటి మధ్యలో ఒక సెకను కంటే తక్కువ వ్యవధిలో మనకు కొన్ని క్లూస్ ఇచ్చాడు డైరెక్టర్.

సెకనులో సగం సమయంలో చూపించిన ఒక సీన్‌లో ఒక స్త్రీ తల పైకెత్తి సీలింగ్ కేసి చూస్తోంది. ఆ స్త్రీ మందిరా బేడి. ఆమె ఏం చూస్తోంది? ఆ సీలింగ్‌లో రౌండుగా ఉన్న డిజైన్‌లో వందాలాది ఫొటోలు అతికించి ఉంటే.. వాటిని ఆమె చూస్తోంది. ఆ ఫొటోలేమిటి? సీలింగ్‌మీద అవెందుకున్నాయనేది ఒక ఆసక్తికరమైన అంశమనుకుందాం. మందిర పూర్తి స్థాయి నెగటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

ఇంకో రెప్పపాటు సమయంలో చూపించిన సీన్‌లో ‘వాజి పోలీస్’ డిపార్ట్‌మెంట్‌కు చెందిన హెలికాప్టర్ సెట్ మనకు కనిపిస్తుంది. కథలో ఈ డిపార్ట్‌మెంట్‌కు ప్రాముఖ్యం ఉన్నట్లు మనం గ్రహించవచ్చు. ఇంకో చోట ‘పోలీస్ డిపార్ట్‌మెంట్ క్రిమినల్ రికార్డ్’ ఫైల్ కనిపిస్తుంది. దానిపై ‘ఐబి బ్యాచ్ డిటైల్స్’ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ ‘ఐబి బాచ్’ అనేది విలన్ గ్యాంగ్ అని మనం ఊహించవచ్చు.

ఇవి తప్ప ఈ టీజర్ చెబ్తున్నదేమీ లేదు. ప్రభాస్, శ్రద్ధ కలిసి కనిపించలేదు. ఎవరికి వాళ్లు విడివిడిగా కనిపించారు. ప్రభాస్ ఫైట్ చేస్తూ కనిపిస్తే, శ్రద్ధ చేతిలో రివాల్వర్ పట్టుకొని కనిపించింది. రీల్‌ని గిర్రున తిప్పినట్లు కొన్ని షాట్స్‌ను గిర్రున తిప్పినట్లుగా ఈ టీజర్ ఉంది. ఇంతకు మించి చెప్పుకోడానికి ‘చాప్టర్ 2’లో ఇంకేమీ లేదు.

'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2' గొప్పేమిటి?