మరోసారి ‘అర్జున్‌రెడ్డి’ జోడీ?


మరోసారి 'అర్జున్‌రెడ్డి' జోడీ?
Shalini Pandey and Vijay Deverakonda

‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో స్టార్ హీరోగా రూపాంతరం చెందాడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్‌రెడ్డి’ హిందీలో రీమేక్ అవుతుండటంతో ఆ సినిమా పేరు, తద్వారా అందులోని హీరోగా విజయ్ ఉత్తరాది వారికీ బాగా తెలిశాడు. ఇక తెలుగులోనే కాకుండా దక్షిణాది మొత్తానికీ తన మార్కెట్‌ను విస్తరింపజేసే లక్ష్యంతో అతను ముందుకెళ్తున్నాడు.

‘నోటా’తో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన అతడు, ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో కన్నడ, మలయాళ ప్రేక్షకులకూ పరిచయం కాబోతున్నాడు. ఆ సినిమా నాలుగు దక్షిణాది భాషల్లోనూ విడుదలవుతోంది.

కాగా ‘కాకా ముట్టై’ రచయిత ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో సినిమా చేసేందుకు అతను అంగీకరించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందే ఈ సినిమాలో బైక్ రేసర్‌గా విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాయికగా షాలినీ పాండేను ఎంపిక చేశారు. విజయ్‌తో నటించిన ‘అర్జున్‌రెడ్డి’తోటే షాలిని నాయికగా పరిచయమైంది. అందులో ఆ ఇద్దరి జోడీ ప్రేక్షకుల్ని అమితంగా అలరించింది. ఇటీవల వచ్చిన ‘118’ సినిమాలోనూ కల్యాణ్‌రాం జోడీగా ఆకట్టుకుంది షాలిని.

వాస్తవానికి ఇంతకుముందు ఆనంద్ అన్నామలై సినిమాలో నాయికగా కె.యు. మోహనన్ (‘మహర్షి’ సినిమాటోగ్రాఫర్) కుమార్తె మాళవిక పేరు వినిపించింది. ఇప్పుడు షాలిని పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రావచ్చు.