‘సైరా’ ఓవర్సీస్ రైట్స్ అంత రేటా!


'సైరా' ఓవర్సీస్ రైట్స్ అంత రేటా!

భారత తొలి స్వాతంత్ర్య సమరయోధునిగా చరిత్ర చెబ్తోన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. విజయదశమికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఓవర్సీస్ హక్కుల విషయంలో నిర్మాతలు చెప్తోన్న ధర డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు చూపిస్తోందని ఇంటర్నెట్‌లో ప్రచారం జరుగుతోంది. ఓవర్సీస్ హక్కుల నిమిత్తం నిర్మాతలు రూ. 40 కోట్లు డిమాండ్ చేస్తున్నారనేది ఆ ప్రచార సారాంశం. ఆ రేటుకు డిస్ట్రిబ్యూటర్లు వెనుకంజ వేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఎందుకంటే ఇప్పటివరకూ ఓవర్సీస్‌లో నాన్-బాహుబలి రికార్డ్ 2.5 మిలియన్ డాలర్లే. అంటే, రూ. 17.75 కోట్లు. ఇది రాంచరణ్ ‘రంగస్థలం’ పేరిట ఉంది. రాజమౌళి-ప్రభాస్ సినిమా ‘బాహుబలి 2’ 10 మిలియన్ డాలర్లను ఆర్జించి, ఏ తెలుగు సినిమాకూ అందనంత దూరంలో నిలిచింది. ఇప్పటి లెక్కల ప్రకారం అది రూ. 71 కోట్లు.

‘బాహుబలి’ని దృష్టిలో పెట్టుకొని రేటు చెప్పడం సరికాదని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. అయితే ‘సైరా’ కూడా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణమవుతున్న సినిమా అనీ, అంత ధర చెప్పడంలో తప్పేమీ లేదని వాదించేవాళ్లూ ఉన్నారు. ఏదేమైనా ఈ ప్రచారం నిజమేనా? లేక కేవలం వదంతి మాత్రమేనా? అనే విషయం వెల్లడి కాలేదు. ఈ విషయంలో ‘సైరా’ వర్గాలు గోప్యతను పాటిస్తున్నాయి.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాంచరణ్ నిర్మిస్తోన్న ‘సైరా’లో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, రవికిషన్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.