‘తలైవి’గా కంగన రాక వెనకున్నది ఆయనేనా?


'తలైవి'గా కంగన రాక వెనకున్నది ఆయనేనా?
Kangana Ranaut
‘తలైవి’గా కంగన రాక వెనకున్నది ఆయనేనా?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత అధికారిక బయోపిక్ ‘తలైవి’గా రూపొందనున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేసే ఈ సినిమాని విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయలలిత పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఎంతో ఆసక్తిని రేపగా, అనూహ్యంగా నిర్మాతలు కంగనా రనౌత్ పేరును ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

జయలలిత పాత్రలోకి కంగన రావడం నిజంగానే అనూహ్యమని చెప్పాలి. నిజానికి ఆ పాత్రకు విద్యాబాలన్, నయనతార పేర్లు బలంగా వినిపించాయి. రూప పరంగా చూసినప్పుడు విద్యా బాలన్ అయ్యితే కరెక్టుగా ఉంటుందనే అభిప్రాయమూ వినిపించింది. చిత్రంగా ఆ ఇద్దరూ కాకుండా కంగన ఎంపిక కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఆమె ఎంపిక వెనుక రచయిత వి. విజయేంద్రప్రసాద్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కంగన టైటిల్ రోల్ చేసిన ‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సి’కి కథ, స్క్రీన్‌ప్లేలను సమకూర్చింది విజయేంద్రప్రసాదే. ఆ సినిమా రూపకల్పన విషయంలో డైరెక్టర్ క్రిష్‌తో కంగనకు అభిప్రాయభేదాలు తలెత్తినప్పుడు ఆయన కంగనకు మద్దతుగా నిలిచారు.

ఆ సినిమాకు పని చేస్తున్నప్పట్నుంచీ విజయేంద్రప్రసాద్‌ను కంగన గురువుగా, ఆత్మీయునిగా భావిస్తూ వస్తోంది. తన సొంత బయోపిక్‌కు విజయేంద్రప్రసాద్ రచన చేస్తున్నారనీ, దాన్ని తానే డైరెక్ట్ చేస్తాననీ కంగన ప్రకటించడం ప్రస్తావనార్హం. ఈ నేపథ్యంలో ‘తలైవి’గా కంగన రావడం విజయేంద్రప్రసాద్ రికమండేషన్ అనే భావన టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘తలైవి’కి విజయేంద్రప్రసాద్ రచన చేస్తుండటం ఇక్కడ గమనార్హం.

నిర్మాతలకు, దర్శకునికి కంగన పేరును విజయేంద్రప్రసాద్ సూచించారనీ, కంగన ఈ ప్రాజెక్టులోకి వస్తే వాణిజ్యపరంగా కూడా క్రేజ్ వస్తుందనే అభిప్రాయంతో వాళ్లు సరే అన్నారనీ వినిపిస్తోంది. కంగన సైతం సంతోషంగా ఈ ఆఫర్‌ను అంగీకరించింది. ఈ పాత్ర పోషణకు ఆమెకు భారీ పారితోషికం అందుతున్నట్లు సమాచారం.

'తలైవి'గా కంగన రాక వెనకున్నది ఆయనేనా?
Jayalalitha (file photo)

‘తలైవి’గా కంగన రాక వెనకున్నది ఆయనేనా? | actioncutok.com

You may also like: