‘బ్లాక్‌బస్టర్’ సాంగ్ చేస్తూ గాయపడ్డాడు!


'బ్లాక్‌బస్టర్' సాంగ్ చేస్తూ గాయపడ్డాడు!

అల్లు అర్జున్ లాంటి సూపర్బ్ డాన్సరే ‘జులాయి’లో ఒక పాట తీస్తున్నప్పుడు గాయపడ్డాడు. అతనే కాదు, సాంగ్స్ తీసేప్పుడు క్లిష్టమైన స్టెప్స్ వెయ్యలేక డాన్సర్లు గాయపడుతుంటారు. తెలుగువాడైన తమిళ చిత్రాల కథానాయకుడు విశాల్ చెప్పుకోదగ్గ డాన్సర్ ఏమీ కాదు.

అయినప్పటికీ తన సినిమాల్లో మాస్ సాంగ్స్‌తో అలరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అదే తరహాలో ‘టెంపర్’ రీమేక్ ‘అయోగ్య’లో ఒక సాంగ్ చేస్తూ గాయపడ్డాడు విశాల్. ఒక కాలి మడమతో పాటు, మోచేతికీ దెబ్బలు తగిలాయి.

గమనించదగ్గ అంశమేమంటే, అల్లు అర్జున్ పాట రీమేక్‌లో అతడికి ఈ దెబ్బలు తగలడం! అర్జున్ నటించగా సూపర్ హిట్టయిన ‘సరైనోడు’ సినిమాలో ‘బ్లాక్‌బస్టర్ బ్లాక్‌బస్టరే’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. అదే పాటను ‘అయోగ్య’లో ఉపయోగిస్తున్నారు.

ఆ పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఒక క్లిష్టమైన స్టెప్ వేస్తూ జారిపడటంతో అతడికి దెబ్బలు తగిలాయి. దాంతో యూని షూటింగ్ ఆపేసింది. విశాల్ దెబ్బల నుంచి కోలుకున్న తర్వాతే ఆ పాటను పూర్తి చేయనున్నారు.

కాగా ఇటీవల విడుదల చేసిన ‘అయోగ్య’ ట్రైలర్ చూస్తే, ‘టెంపర్’ను మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నట్లు అర్థమైపోతోంది. సీన్లన్నీ తెలుగు సినిమాలో ఉన్న సీన్ల మాదిరిగానే కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీకి విశాల్ ఎంతవరకు సరితూగాడో సినిమా విడుదలయ్యాక గానీ తెలీదు.

ఈ సినిమాని నూతన దర్శకుడు వెంకట్ మోహన్ రూపొందిస్తున్నాడు. విశాల్ జోడీగా రాశీ ఖన్నా నటిస్తోంది. రణ్‌వీర్ సింగ్ చేసిన హిందీ రీమేక్ ‘సింబా’ సూపర్ హిట్టవడంతో ఇప్పుడందరి కళ్లూ ‘అయోగ్య’పై నిలుస్తున్నాయి. ఏప్రిల్ 19న ఈ సినిమాని విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

You may also like: