మన హీరోలు: వేణు ఇప్పుడెక్కడ?


మన హీరోలు: వేణు ఇప్పుడెక్కడ?

మన హీరోలు: వేణు ఇప్పుడెక్కడ?

వారసత్వం, గాడ్‌ఫాదర్ వంటి ప్లస్ పాయింట్లేమీ లేకపోయినా స్వయంకృషితో విజయాలు సాధిస్తూ ముందుకు నడిచే హీరోలు సినీ రంగంలో తక్కువ మందే ఉంటారు. అటువంటి వంటివారిలో ఒకడిగా నమ్మకం కలిగించిన హీరో వేణు. 1999లో ‘స్వయంవరం’తో హీరోగా తెరంగేట్రం చేసిన వేణు తొలి చిత్రంతోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఆరడుగులకు మించి ఎత్తున్న ఈ కొత్త కుర్రాడెవరా?.. అని ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమా తేరిపారచూసింది. అంతకు ముందు ‘ప్రార్థన’ అనే చిత్రానికి దర్శకత్వం వహించినా అంతగా పేరుపొందని కె. విజయభాస్కర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్ (లయ), కొత్త నిర్మాణ సంస్థ (ఎస్పీ ఎంటర్‌టైన్‌మెంట్స్) కాంబినేషన్‌లో వచ్చిన ‘స్వయంవరం’ విజయం సాధించడం ఓ విశేషమనే చెప్పాలి.

తొలి సినిమా సక్సెస్‌తో వీరు కె. దర్శకత్వంలో ‘మనసు పడ్డాను కానీ’ అనే సినిమాలో నటించే అవకాశం సంపాదించాడు వేణు. అందులో కె. విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రమ్యకృష్ణ వంటి హేమా హేమీలతో కలిసి నటించాడు. అయినా ఆ సినిమా ఫ్లాపయింది.

మన హీరోలు: వేణు ఇప్పుడెక్కడ?
‘చిరుననవ్వుతో’ ఊపందుకున్నాడు!

దాంతో మూడో చిత్రాన్ని తన స్నేహితులు ఏర్పాటుచేసిన ఎస్పీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పైనే చేశాడు. దానికి కొత్త దర్శకుడ్ని ఎంచుకున్నాడు. అతను జి. రాంప్రసాద్. వేణుకి స్నేహితుడు. ఇలా స్నేహితులు కలిసి చేసిన ఆ చిత్రమూ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ సక్సెసయ్యింది. ఆ చిత్రం ‘చిరునవ్వుతో’.

బాధల్లోనూ చిరునవ్వుని వదలని ఓ యువకుడి కథతో తయారైన ఈ సినిమా విభిన్నమైన కథనంతో నడిచి ప్రేక్షకుల్ని వినోదపర్చింది. మరదలితో పెళ్లి అవుతున్న సమయంలో ఆమె మరొకరితో లేచిపోవడంతో విచారకరంగా మొదలైన హీరో పాత్ర మధ్యలో ఓ యువతితో ప్రేమలో పడుతుంది. కానీ ఆమె అతడ్ని స్నేహితుడిగానే చూశానని చెప్తూ, అతడి ప్రేమని తిరస్కరించి మరో యువకుడితో పెళ్లికి సిద్ధపడుతుంది.

అటువంటప్పుడు కూడా గుండె నిబ్బరం కోల్పోకుండా, తన ముఖంలో నవ్వుని విడనాడకుండా ఆశావాదిగా గడిపి, చివరకు తను ప్రేమించిన యువతిని దక్కించుకున్న పాత్రలో వేణు పరిణతి చెందిన నటన ప్రదర్శించాడు.

‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’ చిత్రాలు రెండింటిలోనూ అతడి పాత్రలు ముక్కుసూటిగా వ్యవహరించేవే. మూడో సినిమా హిట్టవడంతో బయటి నిర్మాతలకు వేణుపై నమ్మకం కుదిరింది. ఒక్కో అవకాశమే రావడం మొదలైంది. అతడి కెరీర్ ఊపందుకున్నట్లే కనిపించింది. అగ్ర దర్శకుల్లో ఒకడిగా పేరుపొందిన ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు వేణు. అలా వచ్చిందే ‘వీడెక్కడి మొగుడండీ’ చిత్రం.

వేణు లాంటి నటుడికి సరిపోని కథతో వచ్చిన ఆ సినిమా అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద వైఫల్యం చెందింది. పెళ్లి చేసుకుంటే సంతానానంతరం భార్య చనిపోతుందని ఓ జ్యోతిష్కుడు చెప్పిన మాటల్ని వంటబట్టించుకొని, తన పెళ్లి సంబంధాల్ని తనే చెడగొట్టుకొనే పాత్రలో వేణు మెప్పించలేకపోయాడు. మొదటి రెండు చిత్రాల్లో కథ ప్లస్సయితే, మూడో సినిమాలో అదే మైనస్సయింది.

ఆ తర్వాత వచ్చిన ‘ప్రియనేస్తమా’, ‘దుర్గ’ చిత్రాలు ఫ్లాప్ కావడంతో వేణు కెరీర్‌కు ఆటంకం కలిగింది. కథలు ఎంచుకోవడంలో చేసిన పొరబాట్ల వల్ల ఎట్లాంటి స్థితి ఎదురవుతుందో అతడికి తెలిసివచ్చింది.

ఊపిరిపోసిన ‘హనుమాన్ జంక్షన్’

2001 ఆఖర్లో వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’ సినిమా వేణు కెరీర్‌కు మళ్లీ ఊపిరిపోసింది. ఆ సినిమాలో అతడు ప్రధాన హీరో కాకపోయినా, అతడు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని బాగా నవ్వించాయి. నటన విషయంలోనూ మెరుగయ్యాడనే పేరు తెచ్చుకున్నాడు.

దాని తర్వాత ‘మళ్లీ మళ్లీ చూడాలి’ విడుదలైంది. అది చాలా ఆలస్యంగా విడుదలవడంతో ముందుగానే బ్యాడ్ టాక్  మూటగట్టుకుంది. విడుదలయ్యాక అది స్థిరపడింది.

2003 మొదట్లో వచ్చిన ‘పెళ్లాం ఊరెళితే’ చిత్ర ఘన విజయం అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ చిత్రంలో అతడు కనపర్చిన నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలూ లభించాయి.

చలాకీ పాత్రలో చురుగ్గా, సునాయాసంగా నటించి మెప్పించిన తర్వాత తన కెరీర్‌పై ఒక అవగాహణకు వచ్చినట్లు కనిపించాడు వేణు. అలాగని సక్సెస్ తెచ్చిన ఇమేజిని క్యాష్ చేసుకొనే ఉద్దేశం అతడికి లేదు. ఎక్కువ కాలం హీరోగా నిలబడేందుకు కృషి చేస్తూ, వచ్చిన ప్రతి అవకాశాన్నీ అంగీకరించకుండా ఆచితూచి అడుగులు వేయాలనుకున్నాడు.

మన హీరోలు: వేణు ఇప్పుడెక్కడ?

అందుకనే తిరిగి ఎస్పీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లోనే జి. రాంప్రసాద్ దర్శకత్వంలో ‘కల్యాణరాముడు’ చిత్రాన్ని చేశాడు.మలయాళంలో మంచి విజయం సాధించిన ‘కల్యాణరామన్’ సినిమా దీనికి ఆధారం. ఇందులో ప్రభుదేవా సెకండ్ హీరోగా నటించాడు. ఈ సినిమా విజయం సాధించడంతో వేణుకు మళ్లీ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.

చివరాఖరి హిట్ ‘గోపి గోపిక గోదావరి’

అయితే సోలో హీరోగా మరో విజయం లభించడానికి అతడికి ఆరేళ్ల కాలం పట్టింది. వంశీ డైరెక్ట్ చేయగా కమలినీ ముఖర్జీ జోడీగా చేసిన ‘గోపి గోపిక గోదావరి’ (2009)తోటే అతడు సక్సెస్ చవిచూశాడు.

ఈ మధ్య కాలంలో ‘పెళ్లాంతో పనేంటి’, ‘చెప్పవే చిరుగాలి’, ‘సదా మీ సేవలో’, ‘ఇల్లాలు ప్రియురాలు’, ‘బహుమతి’, ‘దీపావళి’ సినిమాలు చేసి పరాజయాలు చవిచూశాడు. ఇతర హీరోలతో కలిసి చేసిన ‘ఖుషి ఖుషీగా’, ‘అల్లరే అల్లరి’, ‘యమగోల మళ్లీ మొదలైంది’ సినిమాలు ఫర్వాలేదనిపించాయి.

‘గోపి గోపిక గోదావరి’ తర్వాత అతడి కెరీర్ నిజానికి గాడిలో పాడాలి. కానీ అనూహ్యంగా ఆ సినిమా తర్వాత అతడు చేసింది మూడంటే మూడు సినిమాలు. వాటిలో హీరోగా చేసిన ‘మాయగాడు’, ‘రామాచారి’ (2013) సినిమాలు బాక్సాఫీస్ వద్ద కుదేలయ్యాయి. ఆ రెండింటి మధ్యలో ‘దమ్ము’లో జూనియర్ ఎన్టీఆర్ బావగా సైడ్ కేరెక్టర్‌లో కనిపించడం అతడి కెరీర్ స్థితికి అద్దంపట్టింది.

‘రామాచారి’ వచ్చి ఆరేళ్లవుతోంది. వేణు మళ్లీ మరే సినిమాలోనూ కనిపించలేదు. వ్యాపార రంగంలో స్థిరపడి కెరీర్‌ను ఆ దిశగా మళ్లించాడు. సినీరంగంలో హీరోగా వెలగాలని ఆశించి వచ్చేవాళ్లకు వేణు కెరీర్ ఒక పాఠమని చెప్పుకోవాలి.

– బుద్ధి యజ్ఞమూర్తి

మన హీరోలు: వేణు ఇప్పుడెక్కడ? | actioncutok.com