ఎన్నికల కోడ్: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 22న వచ్చేనా?


ఎన్నికల కోడ్: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మార్చి 22న వచ్చేనా?
లక్ష్మీస్ ఎన్టీఆర్

అసలు కథ అంటూ లక్ష్మీపార్వతి దృష్టి నుంచి చెప్పిన ఎన్టీఆర్ కథతో రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తుందా?.. ఇప్పుడు చాలామందిలో మెదులుతున్న ప్రశ్న ఇది.

అగస్త్య మంజుతో కలిసి వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కొంత కాలంగా వివాదాలు రేపుతూ, విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ అంటూ బాలకృష్ణ తీసిన ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టడంతో అందరి దృష్టీ సహజంగానే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పైకి మళ్లింది.

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టిన క్షణాల నుంచి జరిగిన పరిణామాలతో వర్మ తీసిన సినిమా కావడంతో సహజంగానే దీనికి రాజకీయ రంగు పులుముకుంది. ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు కావడం, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీయే అధికారంలో ఉండటం, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ సినిమా విడుదలకు ఎన్నికల కమిషన్ అంగీకరిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ప్రస్తుతం ఆ సినిమా సెన్సార్ పరిశీలనలో ఉంది. సెన్సార్ సర్టిఫికెట్ లభించినా, వర్మ ప్రకటించిన తేదీకి సినిమా విడుదలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా ప్రభావితం చేసే సినిమాల విడుదలకు ఎన్నికల కమిషన్ అంగీకరించే ప్రసక్తి ఉండదు.

ఎన్టీఆర్ తెలుగువారి జీవితాల్ని విశేషంగా ప్రభావితం చేసిన రాజకీయ నాయకుడు కాబట్టి ఆ సినిమా విడుదలను టీడీపీ అడ్డుకొనే అవకాశాలూ ఉన్నాయి. ఈ మేరకు ఆ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసే అవకాశామూ ఉంది. అంటే ఎన్నికలు పూర్తయ్యేలోగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలయ్యే అవకాశాలు స్వల్పమనే చెప్పాలి. సినిమా విడుదలకు ఎన్నికల కమిషన్ అంగీకరించకపోతే వర్మ ఏం చేస్తాడో చూడాలి.

ఎన్నికల కోడ్: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మార్చి 22న వచ్చేనా?
లక్ష్మీస్ ఎన్టీఆర్

ఎన్నికల కోడ్: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 22న వచ్చేనా? | actioncutok.com

Related articles: