తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు


తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు
Mahesh Babu

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

‘మహర్షి’ సినిమాతో మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మహేశ్. సినిమా సినిమాకీ అంచనాలు పెంచుకుంటూ వస్తోన్న ఈ సూపర్ స్టార్ నటుడిగానూ ఎప్పటికప్పుడు విమర్శకుల్ని మెప్పిస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో తండ్రిని మించిన నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే సినిమా సినిమాకీ ఎక్కువ విరామం తీసుకుంటూ రావడమే అతని అభిమానుల్ని అసంతృప్తికి గురిచేసే అంశం.

బాక్సాఫీస్ వద్ద ‘మహర్షి’ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు నటుడిగా ఈ సినిమా అతడ్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుందనేది వాళ్ల నమ్మకం. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ ఫలితాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మహేశ్‌లోని ప్రతిభావంతుడైన నటుడ్ని చూడాలనుకుంటే అతడు నటించిన వాటిలో అభిమానులు వేటిని తప్పకుండా చూడాలి?

మురారి (2001)

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

గ్లామర్‌తో మొదట్లో ఆకట్టుకున్న మహేశ్, నటుడిగా బాగా ఆకట్టుకున్న తొలి సినిమా ఏదంటే ‘మురారి’ పేరే చెప్పాలి. టైటిల్ రోల్‌లో మహేశ్ కనిపించిన తీరు, ఆ పాత్రలో అతడు ప్రదర్శించిన చిలిపితనం, చురుకుదనం, భావోద్వేగ సన్నివేశాల్లో ప్రదర్శించిన హావభావాలు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశాయి.

సోనాలీ బెంద్రేతో అతడి జోడీ అభిమానుల్ని అమితంగా అలరించింది. నిజంగా ఒక కొత్త మహేశ్‌ని ఈ సినిమాలో చూశారు ప్రేక్షకులు. తొలిసారి మహేశ్‌ని అతడి కేరెక్టర్ డామినేట్ చేసిన సందర్భం ఇది.

ఒక్కడు (2003)

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

నటుడిగా మహేశ్‌లోని భిన్న కోణాన్ని వెలికి తీసిన సినిమా.. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ‘ఒక్కడు’. అజయ్ పాత్రలో డైలాగ్స్ కంటే కళ్ల మీదే ఎక్కువగా ఆధారపడి నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు మహేశ్. అతని కళ్లలోని ఇంటెన్సిటీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.

సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసుకెళ్లగలనని ఈ సినిమాతో మహేశ్ నిరూపించాడు. ప్రకాశ్‌రాజ్ వంటి ఉన్నత స్థాయి ప్రతినాయకుడికి తగిన నాయకుడని ప్రశంసలు పొందాడు.  తొలిసారి ప్రకాశ్‌రాజ్‌తో అతను తలపడిన సన్నివేశం కానీ, భూమికను తన ఇంటికి రహస్యంగా తీసుకుపోయినప్పటి సన్నివేశాల్లో కానీ, చార్మినార్‌పై కూర్చొని భూమికతో మాట్లాడే సన్నివేశం కానీ, పతాక సన్నివేశాలు కానీ నటుడిగా మహేశ్ ఎలా ఎదిగాడో చెప్తాయి.

నిజం (2003)

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘నిజం’ ఆశించిన రీతిలో ఆడలేదు. కానీ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని కేవలం మహేశ్ నటన కోసం చూడాలి. అప్పటివరకూ కనిపించిన మహేశ్ వేరు, ఈ సినిమాలో సీతారాంగా కనిపించిన మహేశ్ వేరు. సినిమా చూసిన వాళ్లంతా “మహేశ్.. ఏం చేశాడబ్బా!” అని అనుకోకుండా ఉండలేరు. నటుడిగా ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాడు మహేశ్.

తల్లి ప్రోద్బలంతో తండ్రి చావుకు కారణమైన వాళ్లపై ప్రతీకారం తీర్చుకొనే కొడుకుగా మహేశ్ ప్రదర్శించిన అభినయం నటుడిగా అతడు సాధించిన పరిణతికి నిదర్శనం. అందుకే సీతారాం పాత్రలో ప్రదర్శించిన అభినయంతో ఉత్తమ నటుడిగా మహేశ్ నంది అవార్డుని అందుకోవడం ఆశ్చర్యం కలిగించదు.

అతడు (2005)

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన మహేశ్ సినిమాల్లో ‘అతడు’ ఒకటి. విడుదలై పదహారేళ్లయినా ఇప్పటికీ ఈ సినిమా గురించి తరచూ మాట్లాడుకుంటూనే ఉంటారు. రెండు భిన్న పార్శ్వాలున్న పాత్రలో మహేశ్ ఒదిగిన తీరు ముచ్చటేస్తుంది. ప్రొఫెషనల్ కిల్లర్ నందుగా, ఒక అందమైన కుటుంబంలో పార్థు అనే సభ్యుడిగా మహేశ్ ప్రతిభావంతమైన అభినయాన్ని ప్రదర్శించాడు.

పార్థుగా ఉన్నప్పుడు నాయిక పూరి (త్రిష)తో రొమాన్స్‌ను ఎంత చక్కగా పండించాడో, దుండగులతో తలపడేప్పుడు రౌద్రాన్ని అంతే చక్కగా ప్రదర్శించాడు. స్వతహాగా కిల్లర్ అవడంతో పార్థు కుటుంబం చూపించే ప్రేమానురాగాలు తట్టుకోలేక, తప్పు చేస్తున్నానేమోననే అపరాధ భావన పీడించే సన్నివేశాల్లో ఉన్నత స్థాయి నటనను ప్రదర్శించాడు.

పోకిరి (2006)

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

అదివరకటి బాక్సాఫీస్ రికార్డుల్ని తుడిచిపెట్టిన ‘పోకిరి’తో మహేశ్ అగ్ర కథానాయకుడి స్థాయిని అందుకున్నాడు. బాక్సాఫీస్ విజయం అలా ఉంచినా అభినయపరంగానూ మహేశ్‌ను భిన్న కోణంలో చూపించిన సినిమా ‘పోకిరి’. “ఎవడు కొడితే మైండ్ బ్లాకవుతుందో ఆడే పండుగాడు” అనే ఐకనిక్ డైలాగ్‌తో మహేశ్ అందరి మనసుల్నీ దోచేశాడు.

మొదట పండు అనే క్రిమినల్‌గా కనిపించి, తర్వాత కృష్ణమనోహర్ అనే పోలీసాఫీసర్‌గా నిజ రూపంలోకి వచ్చే పాత్రలో మహేశ్ ప్రదర్శించిన నటన అద్వితీయం. మహేశ్ చెప్పిన డైలాగ్స్‌కైతే ఒకటే ఈలలు, చప్పట్లు! నటనతో, డైలాగ్ డిక్షన్‌తో అదరగొట్టేశాడు మహేశ్. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మహేశ్ ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. అందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే.

ఖలేజా (2010)

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

త్రివిక్రం డైరెక్ట్ చేసిన ‘ఖలేజా’ సినిమా థియేటర్లలో ఎందుకు ఆడలేదనేది చాలామందికి అంతు చిక్కని ప్రశ్న. ఎక్కడా బోర్ కొట్టించకుండా, ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా పరుగులెత్తే సినిమా ఆడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఆ విషయం అలా ఉంచితే, ‘ఖలేజా’లో తన పాత్రతో, నటనతో అందర్నీ అమితాశ్చర్యానికి గురి చేశాడు మహేశ్.

సాధారణంగా చిన్న చిన్న డైలాగులతో ఇంప్రెస్ చేసే అతను, వాటికి పూర్తి భిన్నంగా లొడ లొడా మాట్లాడుతూ, అమితమైన ఎనర్జీని ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటాడు. అదివరకెన్నడూ మహేశ్ ఇంత లౌడ్‌గా, ఇంత విలక్షణంగా మాట్లాడింది లేదు. అందుకే ‘ఖలేజా’లో చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రతో సరికొత్తగా ఆవిష్కృతమయ్యాడు మహేశ్. కేవలం మహేశ్ నటన చూడ్డం కోసమే చాలామంది ఈ సినిమాని ఇప్పటికీ ఆసక్తిగా చూస్తుంటారనేది వాస్తవం.

దూకుడు (2011)

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

మహేశ్ ఇమేజ్‌ని, అతని మార్కెట్ స్టామినాని బాగా పెంచిన సినిమా ‘దూకుడు’. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ‘ఒక్కడు’ తర్వాత అజయ్ అనే పేరున్న పాత్రలో అనితరసాధ్యంగా రాణించాడు మహేశ్. వృత్తి రీత్యా పోలీసాఫీసర్ అయినా, తండ్రి (ప్రకాశ్ రాజ్) కోసం ఎమ్మెల్యేగా నటిస్తూ వచ్చే పాత్రలో మహేశ్ ప్రదర్శించిన నటన ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసల్ని అమితంగా చూరగొంది.

భావోద్వేగభరిత సన్నివేశాల్లో మహేశ్ హావభావాలు అతడెందుకు సూపర్ స్టార్‌గా ఎదిగాడో తెలియజేస్తాయి. బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాల్లో మహేశ్ కామిక్ టైమింగ్ ఎక్సలెంట్. సమంత కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాల్లో అతడిలోని రొమాంటిక్ యాంగిల్ అలరిస్తుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

మరొక టాప్ హీరోతో కలిసి మహేశ్ చేసిన తొలి సినిమాగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రికార్డుల్లోకి ఎక్కింది. వెంకటేశ్, మహేశ్.. ఇద్దరూ తమ ఇమేజ్‌కి భిన్నమైన పాత్రలు చెయ్యడం ఈ సినిమాలోని విశేషం. వెంకటేశ్ తమ్ముడిగా మహేశ్ నటన యువత హృదయాన్ని దోచుకుంది. అల్లరితనం, చిలిపితనం మేళవించిన పాత్రలో మహేశ్ ముచ్చటగొల్పాడు.

‘మురారి’ తర్వాత హీరోయిన్‌తో ఎక్కువగా అతడు రొమాన్స్ చేసింది ఈ సినిమాలోనే. చిన్నోడిగా తొలిసారి గోదావరి యాసతో మాట్లాడి అలరించాడు మహేశ్. వెంకటేశ్ కాంబినేషన్ సీన్లలో అతడు ప్రదర్శించిన అభినయం కానీ, సమంతతో చేసిన రొమాన్స్ కానీ, బామ్మతో చేసిన అల్లరి కానీ చాలా కాలం గుర్తుండిపోయాయి.

1.. నేనొక్కడినే (2014)

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

నటుడిగా మహేశ్‌కు మంచి పేరు తెచ్చిన సినిమాల్లో తప్పకుండా ఉండే సినిమా సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘1.. నేనొక్కడినే’. అతడు నటించిన తొలి థ్రిల్లర్ ఇది. పైగా సైకలాజికల్ థ్రిల్లర్. తల్లిదండ్రుల్ని హత్య చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకొనే గౌతం కేరెక్టర్‌లో మహేశ్ నటన చూసి తీరాలి.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరిగా ఆడకపోయుండవచ్చు కానీ, మహేశ్ నటన చూడ్డం కోసమైనా ఈ సినిమా చూడాల్సిందే. ‘నేనొక్కడినే’ చూశాక అతని నటనకు అబ్బురపడకుండా ఉండలేం. ఒక మానసిక సమస్యతో సతమతమయ్యే ఈ తరహా కేరెక్టర్ చెయ్యడం మహేశ్‌కు ఇదే తొలిసారి. ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రవర్తించే పాత్రలో అతను చెలరేగిపోయాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ సీన్లు మహేశ్ నటనను మరింతగా వెలికి తీశాయి.

శ్రీమంతుడు (2015)

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

మహేశ్ సినిమాల్లో మునుపటి బాక్సాఫీస్ రికార్డుల్ని అధిగమించిన సినిమా ‘శ్రీమంతుడు’. కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా కేవలం రికార్డుల్ని కొల్లగొట్టడం మాత్రమే కాకుండా, ప్రజల హృదయాలపై గట్టి ముద్రను వేసింది. ఒక సామాజిక ప్రయోజనాన్నీ సాధించింది. పర్యావరణ రీత్యా మోటారు వాహనాల కంటే సైకిల్ ఎంతో ప్రయోజనకారి అంటూ మహేశ్ సైకిల్ తొక్కుతూ కనిపించడంతో సైకిళ్లకు ఎక్కడా లేని గిరాకీ పుట్టుకొచ్చింది.

అంతే కాదు, ఉన్నవాళ్లు అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేయడమనే కాన్సెప్టునూ మహేశ్ ద్వారా ఎలివేట్ చేశాడు డైరెక్టర్. హీరో హర్ష కేరెక్టర్‌లో మహేశ్ జీవించిన విధానం ఈ సినిమాని అత్యధిక ప్రేక్షకులు అభిమానించేలా చేసింది. విమర్శకుల మనసుల్ని గెలుచుకొనేలా చేసింది.

సినిమానంతా తనకు అలవాటైన రీతిలో తన భుజాల మీద మోసుకెళ్లాడు మహేశ్. నటుడిగా ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎదిగాడు. అతని కెరీర్‌లోని ఉత్తమ చిత్రాల్ని లెక్కించేప్పుడు తప్పకుండా ఉండే సినిమా ‘శ్రీమంతుడు’.

భరత్ అనే నేను (2018)

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు

ఇప్పటివరకూ తను పోషించిన పాత్రల్లో భరత్‌గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానని స్వయంగా మహేశ్ చెప్పుకొన్నాడు. అతని మాటల్ని అలా ఉంచితే కొరటాల శివ రూపొందించిన ‘భరత్ అనే నేను’లో మహేశ్ చేసిన భరత్ పాత్ర ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. మహేశ్ సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమాలో భరత్ రోల్‌లో మహేశ్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ఆ పాత్రలో ఒదిగిపోయాడు.

ఏ కేరెక్టర్‌నైనా ఇంటెన్సిటీతో చేయడం అలవాటు చేసుకున్న మహేశ్‌కి భరత్ పాత్ర పోషణ పెద్ద కష్టం కాదు. మీడియా సమావేశం సన్నివేశంలో అతను మాట్లాడే తీరు, ప్రదర్శించిన హావభావాలు అతడిలోని ఉన్నత స్థాయి నటుడ్ని మరోసారి మనకు పరిచయం చేస్తాయి. సినిమా సినిమాకీ పాత్రల విషయంలో, సబ్జెక్ట్ విషయంలో కొత్తదనం చూపిస్తూ వస్తున్న మహేశ్.. ఎక్కడా కృత్రిమత్వం అనిపించకుండా ముఖ్యమంత్రి పాత్రను నమ్మదగ్గ రీతిలో పోషించాడు.

– వనమాలి

తప్పకుండా చూడాల్సిన 11 మహేశ్ సినిమాలు | actioncutok.com

You may also like: