మానసికంగా వేధిస్తున్నారంటున్న టాలీవుడ్ తార!


మానసికంగా వేధిస్తున్నారంటున్న టాలీవుడ్ తార!
Poonam Kaur

మానసికంగా వేధిస్తున్నారంటున్న టాలీవుడ్ తార!

సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో తన గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం నటి పూనమ్ కౌర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది పనిగట్టుకొని తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే రీతిలో అసత్యాలను, వదంతులను వ్యాప్తి చేస్తున్నారని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. యూట్యూబ్ చానళ్లలో, సోషల్ మీడియా వేదికలపై తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆమె వాపోయారు.

తనపై అభ్యంతరకర రీతిలో వీడియోలు సర్క్యులేట్ చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆమె చెప్పారు. అందుకు బాధ్యులైన వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేశారు.

పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రంపై పూనమ్ కౌర్ తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా కొద్ది కాలం నుంచి ఒక వీడియో యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై విరివిగా కనిపిస్తోంది. ఈ వీడియో క్లిప్‌ను వివాదాస్పద తార శ్రీరెడ్డి కూడా షేర్ చేశారు.

అయితే తన పేరిట ప్రచారంలోకి వచ్చిన ఆ వీడియోలను అభూత కల్పనలుగా పూనమ్ కొట్టివేశారు. వాటివల్ల రెండేళ్ల నుంచి తాను మానసిక వేదనను అనుభవిస్తున్నానని ఆమె తెలిపారు. ఆ ప్రచారనికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే పోలీసులకు ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు.

కాగా గతంలో పవన్ కల్యాణ్, త్రివిక్రంలపై ట్విట్టర్ వేదికగా పూనమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటివల్ల దుమారం చెలరేగడంతో కొంత కాలం నుంచి మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మానసికంగా వేధిస్తున్నారంటున్న టాలీవుడ్ తార! | actioncutok.com

You may also like: