ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: చీరాలలో సై అంటే సై!


ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: చీరాలలో సై అంటే సై!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: చీరాలలో సై అంటే సై!

ప్రకాశం జిల్లా మొత్తమ్మీద చీరాల అసెంబ్లీ నియోజక వర్గంపైనే అందరి చూపూ నిలుస్తోంది. జిల్లాలోనే శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగిన ఆమంచి కృష్ణమోహన్ ఈసారీ విజయ కేతనం ఎగరవేస్తారా? లేక తొలిసారి ఎదురుదెబ్బ తింటారా?.. అనేది ఆసక్తికర విషయంగా మారింది.

తెలంగాణ విడిపోయాక అందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ద్వేషించడంతో ఆ పార్టీని వీడిన ఆమంచి టీడీపీ లేదా వైసీపీలో చేరాలని యత్నించారు కానీ రెండు పార్టీలూ ఆయనను దూరం పెట్టాయి. దాంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి పోతుల సునీతను ఓడించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది.

చీరాల నియోజకవర్గంలో ప్రజల్లో ఆయనకు ఎంత పట్టువుందో అందరికీ తెలిసింది. చంద్రబాబుకు సన్నిహితుడైన ఒక పత్రికాధిపతి సహకారంతో కృష్ణమోహన్ టీడీపీలో చేరారు. అయినప్పటికీ పార్టీలో ఆయనకు ప్రాధాన్యం లభించలేదు.

ఈసారి టీడీపీ తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఊహించిన కృష్ణమోహన్ వైసీపీలో చేరారు. బలమైన అభ్యర్థుల కోసం చూస్తున్న జగన్ సైతం ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, అనుకున్నట్లే పార్టీ టికెట్ ఆయనకు ఇచ్చారు. కృష్ణమోహన్‌ను ఢీకొనాలంటే అర్థబలం, అంగబలం.. రెండూ ఉన్న నాయకుడు కావాలనే ఉద్దేశంతో కరణం బలరామకృష్ణమూర్తిని రంగంలోకి దించారు చంద్రబాబు.

ఒకప్పుడు ప్రకాశం జిల్లా టైగర్‌గా పేరుపడిన బలరాంకు చీరాల ప్రాంత ప్రజలతో సుదీర్ఘ కాలం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. కృష్ణమోహన్‌కు సరైన ప్రత్యర్థి బలరాం అనే మాట నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది. చీరాల టికెట్ లభించగానే ఆయన ఆమంచి పప్పులు తన దగ్గర ఉడకవని ప్రకటించారు.

చీరాల ప్రాంతంలో అన్ని వ్యవస్థల్నీ తన చెప్పు చేతల్లో ఉంచుకొని ఆడిస్తున్నారనే ముద్ర కృష్ణమోహన్‌పై ఉంది. ఇది ఆయనకు ప్రతికూలాంశమైనా, కొన్ని వర్గాల్లో ఆయనకున్న పట్టు ఇప్పటికీ చెక్కు చెదరలేదని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమంచి కోటను బలరాం బద్దలు కొట్టగలరా? అనే సంశయం వ్యక్తమవుతోంది. బలరాం మాత్రం ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన తరపున కుమారుడు వెంకటేశ్‌తో పాటు, ఇద్దరు కుమార్తెలూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.

జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న కృష్ణమోహన్ వర్సెస్ బలరాం పోరులో విజయం ఎవరిదనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: చీరాలలో సై అంటే సై! | actioncutok.com

You may also like: