ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు ఎదురుగాలి?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు ఎదురుగాలి?
ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలకు నిలయంగా, బాంబుల గడ్డగా పేరుపొందిన ఆళ్లగడ్డ కొన్నేళ్లుగా మారుతూ వచ్చింది. కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం అనేక మంది దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం ఇక్కడ మరోసారి చిరకాల ప్రత్యర్థులైన భూమా, గంగుల కుటుంబాలకు చెందిన వారసులు ఒకరితో ఒకరు తలపడుతుండటం.
టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రంగంలో ఉండగా, వైసీపీ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఆమెను ఢీకొంటున్నారు. అఖిలప్రియ భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల కుమార్తె కాగా, బిజేంద్రనాథ్ రెడ్డి గంగుల ప్రభాకరరెడ్డి కుమారుడు.
నిజానికి గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి వైసీపీ తరపున పోటీ పడిన శోభా నాగిరెడ్డి పోలింగ్ జరగడానికి ముందే రోడ్ యాక్షిడెంట్లో మృతి చెందారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. తర్వాత ఉప ఎన్నికలో టీడీపీ సహా ఏ పార్టీ తమ అభ్యర్థుల్ని నిలబెట్టకపోవడంతో అఖిలప్రియ వైసీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తండ్రి నాగిరెట్టితో పాటు ఆమె టీడీపీలో చేరారు. నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఆ కుటుంబానికి ప్రాముఖ్యం కల్పించాలనే ఉద్దేశంతో అఖిలప్రియను పర్యాటక మంత్రిగా నియమించారు చంద్రబాబు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆళ్లగడ్డకు తాను చేసిన అభివృద్ధి పనులు, ప్రజలతో మమేకమవ్వడం, తమ కుటుంబపై ప్రజలకున్న అభిమానం తనను ఈసారీ గెలిపిస్తాయని ఆమె నమ్ముతున్నారు. అయితే ఆమె గెలుపు ఈసారి అంత సునాయాసం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమెను బిజేంద్రనాథ్ రెడ్డి ఓడించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని వాళ్లంటున్నారు.
భూమా కుటుంబానికి ఉన్నట్లుగానే గంగుల కుటుంబానికీ ప్రజల్లో పట్టుంది. పైగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బలిజ సామాజిక వర్గీయులు ఈసారి అఖిలప్రియను ఆదరిస్తారా? అనే విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకూ భూమా కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్న వాళ్లలో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన చీలిక తెచ్చిందనేది ఒక వాస్తవం. జనసేన తరపున శూలం రామకృష్ణుడు బరిలో ఉన్నారు. బలిజ ఓటర్లలో ఆయన ఎంతమందిని ఆకర్షిస్తే, అంతమేర అఖిలప్రియ నష్టపోయే అవకాశం ఉంది. అంతే కాదు.. రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ గాలులు వీస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలప్రియ ఎలా నెగ్గుకొస్తారనేది ఆసక్తికరం.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు ఎదురుగాలి? | actioncutok.com
You may also like: