ఏపీ ప్రజలారా.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను పట్టించుకోండి!


ఏపీ ప్రజలారా.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను పట్టించుకోండి!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రూపొందించాడు రాంగోపాల్ వర్మ. ఎన్నికల ముందు ఆ సినిమా విడుదలైతే, చంద్రబాబు ఏ విధంగా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాడో జనం చూసి, టీడీపీకి చీకొట్టి, వైసీపీకి మూకుమ్మడిగా ఓట్లు వేస్తారని ఆయన భావించారు. కానీ ఎన్నికల కమిషన్ ఆ సినిమాని ఏపీలో తప్ప ఇంకెక్కడైనా రిలీజ్ చేసుకొమ్మని చెప్పింది.

దాంతో తెలంగాణలో, యు.ఎస్.లో, కొన్ని ఇతర ప్రాంతాల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను మార్చి 29న విడుదల చేశారు. హైదరాబాద్‌లో కొన్ని షోలు హౌస్‌ఫుల్ అవడం మినహా మిగతా ఏరియాల్లో ఆ సినిమాని జనం వర్మ ఊహించిన రీతిలో ఆదరించలేదు. యు.ఎస్.లోనూ ప్రేక్షకులు పట్టించుకోలేదు.

ఆ సినిమా చూసి జనం పెద్దగా స్పందించలేదు. ఎవరూ ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎంత ఘోరంగా వంచించాడనో, అమ్మో.. ఎట్లా వెన్నుపోటు పోడిచాడనో కంటతడి పెట్టలేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను కేవలం ఒక సినిమాగానే చూశారు. వర్మ చేసిన హంగామాతో ఆ సినిమాపై ఎవరికీ సాఫ్ట్ కార్నర్ లేకుండా పోయింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిశాయి. మే 1న అక్కడ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను విడుదల చెయ్యడానికి వర్మ అండ్ కో నిశ్చయించారు. మరి భారీ ప్రచారం రావాలి కదా! ప్రెస్ మీట్ పెట్టుకోడానికి బెజవాడ హోటళ్లు రెండు నిరాకరించడంతో, తన సహజ ధోరణిలో రోడ్డు మీదే ప్రెస్ మీట్ పెడతానన్నాడు వర్మ.

ఏపీ పోలీసులు వర్మ చర్యను అడ్డుకున్నారు. బెజవాడలో దిగిన ఆయన్ని సిటీలోకి వెళ్లకుండా విమానాశ్రయానికే పరిమితం చేసి, హైదరాబాద్ పంపేశారు. ధర్నాలు, నిరసనలు వంటివేవీ చెయ్యకుండా ఎంచక్కా హైదరాబాద్ వచ్చి, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి “ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?” అని ఆక్రోశించాడు వర్మ.

రేపు, మే 1న ఆయన సినిమా ఏపీలో విడుదలవుతోంది. చిత్రంగా ఆ సినిమా కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అసలు వర్మను కానీ, ఆయన సినిమాని కానీ వాళ్లు సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు.

ఒకవేళ ఆ సినిమా కోసం వాళ్లు వేయికళ్లతో ఎదురుచూస్తూ ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచాడో తెలుసుకోడానికి ఆత్రంగా ఉంటే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏపీలో కలెక్షన్ల సునామీ సృష్టించాలి. ఒక్క రోజు ఆగితే ఆ సంబరమేంటో తేలుతుంది.

  • వనమాలి

ఏపీ ప్రజలారా.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను పట్టించుకోండి! | actioncutok.com

Trending now: