పవన్ గెలిచేదెక్కడ? ఓడేదెక్కడ?


పవన్ గెలిచేదెక్కడ? ఓడేదెక్కడ?
Pawan Kalyan

పవన్ గెలిచేదెక్కడ? ఓడేదెక్కడ?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంలో ఎవరి ఊహాగానాలు వాళ్లకు ఉన్నాయి. మరోసారి తామే అధికారంలోకి వస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్లు నమ్ముతుంటే, ఈసారి ముఖ్యమంత్రి తానేనని వైసీపీ అధినేత వైఎస్ జంగన్మోహనరెడ్డి గట్టిగా చెబుతున్నారు. తొలిగా ఈ ఎన్నికల్లో అడుగుపెట్టిన జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరికీ భ్రమలు లేవు.. ఆఖరుకి ఆ పార్టీ సేనాని పవన్ కల్యాణ్‌కి కూడా.

ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పది సీట్లు సాధిస్తే గొప్ప అని విశ్లేషకులు అంటున్నారు. ఈ సంఖ్య ఒకప్పుడు చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో సాధించిన 18 సీట్ల కంటే తక్కువ కావడం గమనార్హం.

ఆ విషయం అలా ఉంచితే పవన్ కల్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. ఒకటి – భీమవరం, రెండు – గాజువాక. ఈ రెండింటిలోనూ ఆయన విజయ పతాకాన్ని ఎగుర వేస్తారని జనసేన నమ్ముతోంది. కానీ ఆయన ఒక సీట్లోనే గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భీమవరంలో ఆయన గెలిచే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయనేది వాళ్ల మాట. భీమవరంలో టీడీపీ అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు, వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ మధ్య ప్రధాన పోటీ ఉందనీ, పవన్ కల్యాణ్ మూడో స్థానానికి పరిమితమవుతారనీ అనేవాళ్లూ ఎక్కువే ఉన్నారు.

ఇందుకు భిన్నమైన స్థితి గాజువాకలో కనిపిస్తోంది. అక్కడ పవన్ సునాయాసంగా విజయం సాధిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మళ్లీ గెలిచే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వాళ్లే గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఆయన మూడో స్థానానికి పడిపోతారని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్‌కు వైసీపీ అభ్యర్థి టి. నాగిరెడ్డి ప్రధాన పోటీదారుగా వాళ్లు పేర్కొంటున్నారు.

ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ కళ్లన్నీ పవన్ కల్యాణ్ మీదే ఉన్నాయి. పదేళ్ల క్రితం చిరంజీవి ఎదుర్కొన్న అనుభవాన్నే ఇప్పుడు ఆయన తమ్ముడు ఎదుర్కోనున్నాడనే అభిప్రాయం చిత్రసీమలో వ్యక్తమవుతోంది. అన్ని ఊహాగానాలకూ తెరపడి వాస్తవ చిత్రం ఆవిష్కృతమవడానికి మే 23 వరకూ ఆగాల్సిందే.

పవన్ గెలిచేదెక్కడ? ఓడేదెక్కడ? \ actioncutok.com

You may also like: