వరుసగా రెండో హిట్ కొడతాడా?


వరుసగా రెండో హిట్ కొడతాడా?

వరుసగా రెండో హిట్ కొడతాడా?

కెరీర్ మొత్తమ్మీద డైరెక్టర్ తేజ ఒకే సందర్భంలో రెండు వరుస హిట్లు కొట్టాడు. ఆ సినిమాలు ‘నువ్వు నేను’, ‘జయం’. వీటిలో ‘నువ్వు నేను’ (2001) సినిమా ఉదయ్ కిరణ్‌తో తేజకు రెండో సినిమా. తేజ తొలి సినిమా ‘చిత్రం’ హీరో అతడే. ‘నువ్వు నేను’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

దాని తర్వాత నితిన్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘జయం’ (2002) తీసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు తేజ. అందులో “వెళ్లవయ్యా వెళ్లూ” అంటూ సదా చెప్పిన డైలాగ్ చాలా కాలం దాకా జనం నోళ్లలో నానింది.

అప్పట్నుంచి తేజను హిట్లు మొఖం చాటేశాయి. ‘నిజం’ (2003) నుంచి మొదలుకొని, ‘హోరా హోరి’ (2015) వరకు మొత్తం 10 సినిమాలు రూపొందించాడు తేజ. ఒక్క హిట్టూ దక్కలేదు. రానా, కాజల్ అగర్వాల్ జోడీగా తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) సినిమాతో ఎట్టకేలకు గెలుపు రుచిని మళ్లీ చూశాడు తేజ.

ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ‘సీత’ను రూపొందించాడు. నాయిక చుట్టూ తిరిగే ఈ కథకు నాయికగా ‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగు ప్రేక్షకులకు తనే పరిచయం చేసిన, మునుపటి సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’లో నాయికగా నటించిన కాజల్‌నే తీసుకున్నాడు. హీరో రోల్‌ను బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేయించాడు.

నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కావాలి. కానీ 26న ‘అవెంజర్స్: ఎండ్ గేం’ వస్తుండటంతో థియేటర్ల సమస్య ఎదురవుతుందని భావించి, విడుదలను మే 24కు వాయిదా వేశారు. తేజకు ‘సీత’ ఒక పరీక్ష. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విజయం గాలివాటుకు వచ్చింది కాదని తెలపాలంటే ‘సీత’ హిట్టవ్వాలి.

అందుకే అన్ని జాగ్రత్తలతో ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన కెరీర్‌లో రెండోసారి వరుస రెండు హిట్ల ఫీట్‌ను తేజ సాధిస్తాడా? నెల రోజుల్లో ఈ విషయం తేలిపోనున్నది.

వరుసగా రెండో హిట్ కొడతాడా? | actioncutok.com

You may also like: