‘చిత్రలహరి’ రివ్యూ: 3 అడుగులు ముందుకి, 2 అడుగులు వెనక్కి


'చిత్రలహరి' రివ్యూ: 3 అడుగులు ముందుకి, 2 అడుగులు వెనక్కి

‘చిత్రలహరి’ రివ్యూ: 3 అడుగులు ముందుకి, 2 అడుగులు వెనక్కి

తారాగణం: సాయిధరం తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్, సునీల్, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, జయప్రకాశ్

దర్శకత్వం: కిశోర్ తిరుమల

విడుదల తేది: 2019 ఏప్రిల్ 12

ఆరు ఫ్లాపుల తర్వాత సాయిధరం తేజ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘చిత్రలహరి’. చిన్నతనం నుంచి వైఫల్యాలతో సహవాసం చేస్తూ పెరిగిన ఒక యువకుడు జీవితంలో, ప్రేమలో ఎదురైన వైఫల్యాలతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం అతనికి ఏమిచ్చిందనే అంశాన్ని తెలియజేస్తూ దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఆద్యంతం ఒక వ్యక్తిత్వ వికాస పాఠంలా అనిపించే ఈ సినిమాలో ఏముందో చూస్తే…

కథ

విజయ్ కృష్ణ (సాయిధరం తేజ్)కు తల్లి లేదు. అన్నీ తానే అయ్యి పెంచుతాడు తండ్రి (పోసాని కృష్ణమురళి). చిన్నతనం నుంచి ఏదో ఒక కొత్త వస్తువు కనిపెట్టాలనే తపన చూపించే విజయ్‌కు ప్రతిసారీ వైఫల్యమే ఎదురవుతుంటుంది. తండ్రే అతడికి అండగా నిలుస్తుంటాడు. ప్రేమలో అయినా విజయం సాధించాననుకొని ఆనందించే లోపలే తనకన్నీ అబద్ధాలు చెబుతున్నావంటూ బ్రేకప్ చెబుతుంది లహరి (కల్యాణి ప్రియదర్శన్).

పట్టుదలతో యాక్సిడెంట్ అలర్ట్ డివైస్‌ను ఒకదాన్ని కనిపెడతాడు విజయ్. అయితే ఆ ప్రాజెక్టుకూ అవాంతరాల్ని ఎదుర్కొంటాడు. స్వేచ్ఛ (నివేదా పేతురాజ్) సాయంతో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందనుకొనేంతలోనే దానికి ఎదురుదెబ్బ తగులుతుంది.

విజయానికి అన్ని దారులూ మూసుకుపోయాయని అనిపించినవేళ తన ప్రాణాల్ని పణంగా పెట్టి అతడొక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం అతడ్ని ఏ తీరానికి చేర్చింది? చివరాఖరికైనా అతడు ప్రేమలో విజయం పొందాడా? అనే ప్రశ్నలకు పతాక సన్నివేశాల్లో జవాబు లభిస్తుంది.

'చిత్రలహరి' రివ్యూ: 3 అడుగులు ముందుకి, 2 అడుగులు వెనక్కి
కథనం

జీవితంలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా ఆశను విడవకూడదనీ, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదో ఒక నాటికి విజయం లభిస్తుందని ‘చిత్రలహరి’ కథతో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు కిశోర్ తిరుమల. ఇది జీవితంలో ఎప్పుడూ అపజయం ఎదుర్కొంటూ వచ్చే విజయ్ అనే ఇంజినీర్ కథ. విజయ్ ఏ ఇంజినీరో మనకు స్పష్టంగా చెప్పలేదు కథకుడు. అతడు చేసే పనుల్ని బట్టి ఎలెక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదువుకున్న వాడనే అభిప్రాయానికి రావచ్చు.

అతడి జీవన ప్రయాణంలో ఎదురయ్యే పాత్రలు, అతడి చుట్టూ ఉండే పాత్రల్ని దర్శకుడు సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. ప్రధానంగా కనిపించే ప్రతి పాత్రకూ ఒక ప్రయోజనం కనిపించడం దర్శకుడి సమర్థతకి నిదర్శనం. బార్‌లోని కుర్రాడు “ఏం కావాలో చెప్పన్నా” అని విజయ్‌ని అడిగితే “ఒక ప్లేట్ సక్సెస్ తీసుకురా” అని చెప్పడం విజయ్ పాత్ర మనస్తత్వానికి అద్దం పట్టే సన్నివేశం. ఆ మనస్తత్వాన్ని చివరికంటా సెటిల్డ్‌గా తీసుకుపోయాడు దర్శకుడు.

రెండు గంటల నిడివి సినిమాలో ప్రథమార్థంలో మెరుపులేమీ కనిపించవు. కొన్ని సంభాషణలు మాత్రం ఆకట్టుకుంటాయి. హీరోకి సునీల్‌తో పరిచయ సన్నివేశాలు, ఆ ఇద్దరూ ‘గ్లాస్‌మేట్స్’గా మారే సన్నివేశాలు బాగున్నాయి. హీరో హీరోయిన్ల మధ్య పరిచయం ప్రణయంగా మారే సన్నివేశాలు ఆకర్షణీయంగా లేవు. ఇంటర్వెల్‌లో విజయ్‌కు లహరి బ్రేకప్ చెప్పేప్పుడు విజయ్ చెప్పిన డైలాగ్ హృదయాన్ని తాకుతుంది.

సినిమాకి ఊపిరి పోసింది ద్వితీయార్థమే. విజయ్ వైఫల్యాల పరంపరలో తండ్రి అతడికి ధైర్యం చెప్పే, అతడి పక్షం వహించే సన్నివేశాలు వాస్తవికంగా గోచరిస్తాయి. విజయ్ పాత్రతో యువకులూ, తండ్రి పాత్రతో పెద్దలూ సహానుభూతి చెందుతారు. ఫెయిల్యూర్స్ నుంచి ఎప్పుడు విజయ్ బయటపడతాడా, అతడికి విజయం ఎప్పుడు లభిస్తుందా అని ప్రేక్షకుడు అనుకొనేలా చేయగలిగాడు దర్శకుడు. అలా ప్రేక్షకుడు అనుకోకపోతే దర్శకుడు ఫెయిలైనట్లు.

ఫస్టాఫ్‌లో సునీల్, సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ కేరెక్టర్లు రిలీఫ్‌నిస్తాయి. ఆ రెండు పాత్రల్ని సందర్భానుసారం చక్కగా వినియోగించుకున్నాడు దర్శకుడు. కథ ముంబైకి మారాక అంతదాకా నెమ్మదిగా నడిచిన కథలో ఊపు వచ్చింది. తను కనిపెట్టిన పరికరాన్ని తనమీదే విజయ్ ప్రయోగించుకోవడం పతాక సన్నివేశాలకు కావాల్సిన మసాలాని జోడించినట్లయింది.

ఇద్దరు హీరోయిన్లు ఉన్నా ఇది ముక్కోణ కథ కాకపోవడం సరైన ఎత్తుగడ. ముక్కోణ ప్రేమకథగా మలచినట్లయితే రోటీన్ స్టఫ్‌లా సినిమా మారిపొయ్యేది. కథ కోర్టు సన్నివేశంతో మొదలై, కోర్టు సన్నివేశాలతోటే ముగియడం సరైన కథన రీతిలో భాగమే.

'చిత్రలహరి' రివ్యూ: 3 అడుగులు ముందుకి, 2 అడుగులు వెనక్కి
తారల అభినయం

కథానాయకుడు విజయ్ కృష్ణ పాత్రలో సాయిధరం తేజ్ రాణించాడు. నిజ జీవితంలో గత ఆరు సినిమాలుగా విజయం దక్కని లూజర్ అయిన అతను తెరపై లూజర్‌గా నమ్మదగ్గ రీతిలో కనిపించాడు. జీవితంలో వైఫల్యం ఎదురైన ప్రతిసారీ మొహంలో అతడు ప్రదర్శించిన దైన్యం మనకు సానుభూతి కలిగిస్తుంది. ఫుల్ బియర్డ్ లుక్ కూడా దానికి దోహదం చేసింది.

హీరోయిన్లలో స్వేచ్ఛగా నివేదా పేతురాజ్ హావభావల ప్రదర్శన ఉత్తమ స్థాయిలో ఉంది. ఒక వ్యక్తి ఎలాంటివాడో ప్రత్యక్షంగా చూడకుండానే అంచనా కట్టడం తప్పని ఆమె పాత్ర ద్వారా దర్శకుడు తెలియజేశాడు. మొండితనం, నిర్లక్ష్యం, దాష్టీకం నిండిన ఆ పాత్రను అమె చక్కగా పోషించింది.

కల్యాణి చేసిన లహరి పాత్రలో పాసివ్‌నెస్ ఎక్కువ. సొంత వ్యక్తిత్వాన్ని నమ్ముకోకుండా ఇతరుల మాటలమీద ఆధారపడే పాత్ర కావటాన ఆమెతో సహానుభూతి చెందేవాళ్లు తక్కువ. కల్యాణి బదులు ఎవరు చేసినా ఆ పాత్ర పెద్దగా ఆకట్టుకోదు.

సునీల్, వెన్నెల కిశోర్ తమ పాత్రల్ని సునాయాసంగా చేసేశారు. హీరోకి ‘గ్లాస్‌మేట్’గా సునీల్ ఆకట్టుకుంటే, ముంబైలో హీరోకు ఆశ్రయమిచ్చే పాత్రలో వెన్నెల కిశోర్ తనదైన శైలిలో అలరించాడు.

నటనపరంగా పోసానికి ఎక్కువ మార్కులు లభిస్తాయి. కొడుకు పరాజయాలతో కుంగిపోకుండా ధైర్యం చెప్పే పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు. ప్రతి సందర్భంలోనూ అండగా నిలుస్తూ వచ్చిన ఆయన చివరలో కొడుకును వదిలేసి వెళ్లడం ఆ పాత్ర ఔచిత్యానికి భంగం కలిగించే విషయం. ఈ విషయంలో దర్శకుడ్ని వేలెత్తి చూపాల్సిందే.

సాంకేతిక నిపుణుల పనితనం

దర్శకుడికి మిగతా సాంకేతిక నిపుణులు చాలావరకు మంచి తోడ్పాటునే ఇచ్చారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం ఎప్పటిలా అలరించింది. పాటలు చెవులకు ఇంపుగా ఉన్నాయి. ‘గ్లాస్‌మేట్స్’, ‘పరుగు పరుగు’ పాటలు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. సన్నివేశాలకు తగ్గట్లు నేపథ్య సంగీతం అమరింది.

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ‘చిత్రలహరి’కి ఒక ఆకర్షణ తీసుకొచ్చింది. అనేక సందర్భాల్లో కెమెరా పనితనం ప్రస్ఫుటం. హీరో పాత్రను కెమెరా అనుసరించిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం.

కిశోర్‌లోని మాటల రచయిత ఆకట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో చిన్న చిన్న మాటలే పెద్ద ప్రభావాన్ని చూపించే విధంగా ఉన్నాయి. దేశంలోని గొప్ప ఎడిటర్లలో ఒకరైన ఎ. శ్రీకరప్రసాద్ తనకు సాధ్యమైన రీతిలో చిత్రాన్ని ఆకర్షవంతంగా చేయడానికి ప్రయత్నించారు.

'చిత్రలహరి' రివ్యూ: 3 అడుగులు ముందుకి, 2 అడుగులు వెనక్కి
చివరి మాట

వైఫల్యాలతో సతమతమయ్యేవాళ్లకు ఊరటనిచ్చి, వాళ్లను కార్యోన్ముఖుల్ని చెయ్యడానికి పనికి వచ్చే వ్యక్తిత్వ వికాస పాఠం. సాయిధరం తేజ్‌కు వ్యక్తిగతంగానూ కనెక్టయ్యే సినిమా.

– బుద్ధి యజ్ఞమూర్తి

‘చిత్రలహరి’ రివ్యూ: 3 అడుగులు ముందుకి, 2 అడుగులు వెనక్కి | actioncutok.com

You may also like: