విజయవాడలో వర్మకు హోటళ్ల వెన్నుపోటు! నడిరోడ్డుపైనే ప్రెస్మీటు!

విజయవాడలో వర్మకు హోటళ్ల వెన్నుపోటు! నడిరోడ్డుపైనే ప్రెస్మీటు!
తెలుగు సినిమా గతిని మార్చిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తడాఖా ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించినట్లు కనిపించడం లేదు. ఆయనకూ, ఆయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర బృందానికీ విజయవాడలో బస చేయడానికీ, మీడియా సమావేశం పెట్టుకోడానికీ హోటళ్లు దొరక్కుండా చేస్తోందంట. ఈ మాట ఆయనే చెప్పారు.
“విజయవాడలోని హోటళ్లకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ బృందానికి వసతి ఇవ్వకుండా వార్నింగులు వెళ్లాయి. మొదట హోటల్ నోవాటెల్ను కేన్సిల్ చేశారు. ఇప్పుడు హోటల్ ఐలాపురంను కూడా. అడ్వాన్సులు చెల్లించాక ఇది జరిగింది. ఆలస్యం చెయ్యడానికి అధికారాన్ని దుర్వినియోగం చేయగలరేమో కానీ, నిజాన్ని ఎవరూ ఆపలేరనే విషయం అధికారంలో ఉన్నవాళ్లు అర్థం చేసుకోవాలి” అని తన ట్విట్టర్ పేజీ ద్వారా ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు ఆర్జీవీ.
ఆంధ్రప్రదేశ్లో మే 1న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయించారు. దీనిపై ఈరోజు (ఏప్రిల్ 28) విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ప్రెస్మీట్ పెడుతున్నట్లు వర్మ ప్రకటించారు.
ఆ తర్వాత కొన్ని గంటలకు (ఏప్రిల్ 27 అర్ధరాత్రి) “లక్ష్మీస్ ఎన్ టి ఆర్ సినిమా ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్ణయించాం. కానీ ఆ హోటల్ వాళ్లు ఎవరో వార్ణింగ్ ఇవ్వటం మూలాన భయంతో కేన్సిల్ చేసేశారు. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోటళ్లు, క్లబ్బుల మేనేజిమెంట్లు, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు” అని ట్వీట్ చేశారు వర్మ.
ఆ వెంటనే “నేను పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నా. మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమైన అభిమానులకి, నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొనటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం” అని పిలుపునిచ్చారు.
తర్వాత ఈరోజు ఉదయం “పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఈరోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు నడి రోడ్డు మీద ప్రెస్ మీట్” అని ప్రకటించారు వర్మ.
విజయవాడలో వర్మకు హోటళ్ల వెన్నుపోటు! నడిరోడ్డుపైనే ప్రెస్మీటు!| actioncutok.com
Trending now:
- ‘అవెంజర్స్’తో ‘జెర్సీ’కి గట్టి దెబ్బ!
- తిరుపతిలో పోలీసు నిఘా పెంచారు!
- ఈ అల్లు వారబ్బాయి ‘క్రాసోవర్ స్టార్’!
- మే 1న ‘మహర్షి’ వేడుక