హీరో చనిపోతే సినిమా ఆడదా?


హీరో చనిపోతే సినిమా ఆడదా?

హీరో చనిపోతే సినిమా ఆడదా?

“హీరో చనిపోతే తెలుగు ప్రేక్షకులు తట్టుకోలేరు.. ఆ సినిమాని వాళ్లు తిప్పికొడతారు.” అనేది సాధారణాభిప్రాయం. ఒకప్పుడు నిజంగానే హీరో చనిపోయిన సినిమాల్ని చూసేందుకు ప్రేక్షకులు, ముఖ్యంగా వాళ్ల అభిమానులే విముఖత చూపించేవాళ్లు. టాప్ హీరోల సినిమాలకు ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఉండేవి. అలా అని హీరో చనిపోయిన ప్రతి సినిమానీ ప్రేక్షకులు నిరాదరించారని చెప్పడం తప్పవుతుంది.

‘దేవదాసు’ సహా కొన్ని సినిమాల్ని వాళ్లు అమితంగా ఆదరించిన సందర్భాలున్నాయి. అవి మరీ పాతరోజులు కావచ్చు. సరే.. ఇదంతా చెప్పడం ఎందుకంటే.. ‘జెర్సీ’ గురించి చెప్పడానికే. ఈ సినిమాలో హీరో కేరెక్టర్ అయిన అర్జున్ (నాని) చనిపోయినట్లు మొదట్లొనే మనకు అర్థమవుతుంది, అతని కొడుకు ఫోన్‌లో మాట్లాడిన మాటల వల్ల.

సినిమా అంతా ఫ్లాష్‌బ్యాక్‌లో నడిచి, చివరలో వర్తమానానికి వచ్చి, అర్జున్ ఎలా చనిపోయాడో తెలియజేస్తుంది. కాకపోతే అర్జున్ చనిపోవడాన్ని మనకు దృశ్య రూపంలో దర్శకుడు చూపించడు. మాటల్లోనే తెలియజేస్తాడు. అర్జున్ చనిపోయాడనే విషయం పక్కాగా తెలిసినప్పుడు గుండెలు తడవుతాయి.

అర్జున్ పాత్ర చిత్రణ, ఆ పాత్రలో నాని నటన ‘జెర్సీ’ని ఒక క్లాసిక్ ఫిలింగా తయారుచేశాయి. అర్జున్ చనిపోయినట్లు మొదట్లోనే చూచాయగా తెలిసినా ప్రేక్షకుడేమీ ఇబ్బంది పడలేదు. అదేమీ సినిమాకు ప్రతికూలకంగా అనిపించలేదు. అది దర్శకుడి ఘనత.

గతంలో ‘ఈగ’ సినిమాలోనూ చనిపోయే పాత్ర చేశాడు నాని. అందులో అతడు కనిపించేది కొద్దిసేపే అయినా హీరో అతడే. అది కూడా ఘన విజయం సాధించింది.

ఈ మధ్య కాలంలో హీరో పాత్రలు చనిపోయినా సినిమాలు ఆడుతున్నాయి. ప్రేక్షకులు హీరోలని కాకుండా కథల్నీ, పాత్రల్నీ అభిమానిస్తున్నారనడానికి ఇది నిదర్శనం.

‘బాహుబలి’లో అమరేంద్ర బాహుబలి పాత్ర చనిపోతుంది. అతని వెన్నులో కట్టప్ప కత్తి దించడాన్ని మొదటి సినిమా క్లైమాక్స్‌లో చూపించి, రెండో భాగంలో అతడెలా చనిపోయాడో చూపించాడు దర్శకుడు రాజమౌళి. అయినా ఆ సినిమా బ్రహ్మాండంగా రికార్డులు బద్దలయ్యేలా ఆడింది. ఆ పాత్ర చేసిన ప్రభాస్ టాలీవుడ్ హీరో స్థాయి నుంచి ఇండియన్ హీరో స్థాయికి ఎదిగాడు.

క్రిష్ రూపొందించిన ‘కంచె’ సినిమాలో హరిబాబు అనే సైనికుడిగా వరుణ్ తేజ్ నటించాడు. హరిబాబు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందుతాడు. అయినా ఆ పాత్ర, ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించాయి. నటుడిగా వరుణ్‌కు ఆ సినిమా ఎంత మంచి పేరు తెచ్చిందో తెలిసిందే.

ఇక ఇటీవలే వచ్చి చిన్న సినిమాల్లో బ్లాక్‌బస్టర్ హిట్టయిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో హీరోయినే విలన్‌గా మారి హీరో శివ పాత్ర చావుకు కారణమవుతుంది. శివ పాత్ర చనిపోయినా సినిమా విజయాన్ని అదేమీ అడ్డుకోలేకపోయింది. ఆ పాత్ర చేసిన కార్తికేయ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు.

కాబట్టి హీరో చనిపోతే సినీమా కూడా చచ్చిపోతుందనే రోజులు పోయాయి. కథ వాస్తవికంగా, పాత్ర బలంగా ఉంటే హీరో చనిపోయినా జనం ఆదరిస్తారనడానికి ఈ ఉదాహరణలు చాలు.

– సజ్జా వరుణ్

హీరో చనిపోతే సినిమా ఆడదా? | actioncutok.com