ఏఏ 19: త్రివిక్రమ్ ఒరిజినల్ స్టోరీనా? కాపీ కథా?


ఏఏ 19: త్రివిక్రమ్ ఒరిజినల్ స్టోరీనా? కాపీ కథా?
Trivikram

ఏఏ 19: త్రివిక్రమ్ ఒరిజినల్ స్టోరీనా? కాపీ కథా?

త్రివిక్రమ్ అంటే మాటల మాంత్రికుడు అంటారు ఆయన్ని అభిమానించేవాళ్లు. తెలుగు సినిమాల్లో సింగిల్ లైనర్స్‌ను ఒక ట్రెండ్‌గా మార్చిన ఘనత ఆయనదే. డైరెక్టర్‌గానూ ఆయన సూపర్ సక్సెసయ్యాడు.

ఇవాళ టాలీవుడ్‌లోని అగ్ర దర్శకుల్లో ఒకడిగా రాణిస్తున్నాడు. అయితే ఆయన ఏ సినిమా తీసినా అది ఏదో ఒక విదేశీ సినిమా నకలనో, లేదా ఆ సినిమాల మూలం తీసుకొని తెలుగు వాతావరణానికి తగ్గట్లుగా మార్చి తీస్తున్నాడనో ప్రచారమవుతూ రావడం చూస్తున్నాం.

ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 19వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బుధవారమే (ఏప్రిల్ 24) దాని రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా అయినా ఒరిజినల్ స్టోరీయేనా, లేక ఏ హాలీవుడ్డో, లేక మరేదైనా విదేశీ సినిమా స్ఫూర్తితో తీస్తున్నదా అనే చర్చ సినీ ప్రియుల్లో నడుస్తోంది.

త్రివిక్రమ్ మునుపటి సినిమా ‘అరవింద సమేత’ ఏ విదేశీ సినిమాకు కాపీ కథ అనే పేరు రాలేదు కానీ, తెలుగులోనే వచ్చిన అనేక ఫ్యాక్షన్ సినిమాల స్ఫూర్తితో ఆ సినిమా తీశాడన్నారు. అయితే రాయలసీమలో ఫ్యాక్షన్ కక్షలు ముగిసిపోయి ప్రశాంత వాతావరణం నెలకొంటున్న కాలంలో కన్న కొడుకునే నిర్దాక్షిణ్యంగా బసిరెడ్డి (జగపతిబాబు) చంపడమనే దారుణ హింసాత్మక సన్నివేశాలు చూపించడం వివాదాస్పదమైంది.

గతంలో ఆయన తీసిన ‘అతడు’ సినిమా సిల్వెస్టర్ స్టాలోన్ సినిమా ‘అసాసిన్స్’కు కాపీ అన్నారు. ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల కథలు హాలీవుడ్ సినిమా ‘లార్గో వించ్’ స్ఫూర్తితో రాసినవని చెప్పుకున్నారు. ‘అ ఆ’ అయితే యద్దనపూడి సులోచనారాణి నవల ‘మీనా’ ఆధారంగా తీసినా, విడుదలయ్యేదాకా ఆ విషయం బయట పెట్టలేదు. కనీసం టైటిల్ క్రెడిట్స్‌లో ఆమె పేరు వెయ్యకుండా అగౌరవపరిచారనే విమర్శలు మూటగట్టుకున్నాడు త్రివిక్రమ్.

అల్లు అర్జున్‌తోటే ఆయన తీసిన మునుపటి సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’లోని కొన్ని సీన్లు బాలీవుడ్ ఫిల్మ్ ‘తర రమ్ పమ్’కు దాదాపు నకలుగా ఉన్నాయని విమర్శకులు తేల్చేశారు. ఈ నేపథ్యంలో తాజా సినిమా కథ అయినా ఆయన సొంతదేనా, ఇతర సినిమాల నుంచి కాపీ చేసి రాసిందా అని ఫిలింనగర్ జనాలు చర్చించుకుంటున్నారు. చూద్దాం.. ఈ సినిమా అయినా కాపీక్యాట్ కాదని ఆశిద్దాం.

  • వనమాలి

ఏఏ 19: త్రివిక్రమ్ ఒరిజినల్ స్టోరీనా? కాపీ కథా? | actioncutok.com

You may also like: