మా మధ్య రొమాన్స్ తక్కువ, ఫైటింగ్ ఎక్కువ!


మా మధ్య రోమాన్స్ తక్కువ, ఫైటింగ్ ఎక్కువ!
Naga Chaitanya

“నిజ జీవితంలో సమంతకూ, నాకూ  మధ్య ఉండే అనుబంధానికీ, మేం నడుచుకొనే తీరుకీ.. ‘మజిలీ’లో మేం చేసిన పాత్రలు పూర్తి భిన్నం. ఎలాంటి పోలికలూ కనిపించవు. సినిమాలో మా మధ్య మాటలు చాలా తక్కువ. రోమాన్స్ తక్కువ, ఫైటింగ్ ఎక్కువ. నిజ జీవితంలో మేం పూర్తిగా భిన్నం” అని చెప్పారు నాగచైతన్య.

సమంతతో కలిసి ఆయన నటించిన సినిమా ‘మజిలీ’. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల మధ్యకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించీ, సమంత గురించీ చైతన్య చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…

‘మజిలీ’ చెయ్యడం చాలా సంతృప్తినిస్తోంది. ఈ సినిమా ఎంచుకున్నప్పుడు చిన్న భయం వేసింది. ఎందుకంటే ఇది చాలా రియలిస్టిక్, చాలా హానెస్ట్ మూవీ. ఎక్కడా సినిమాస్టిక్ లిబర్టీస్ తీసుకోకుండా చెప్పిన కథ. దాంతో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా, లేదా అనే భయం ఉండింది. కానీ టీజర్, ట్రైలర్ రిలీజయ్యాక చాలా ఫ్రెష్‌గా ఫీలవుతున్నారు. హానెస్ట్‌గా ఉందంటున్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది.

ట్రైలర్ ఏ మూడ్‌లో ఉందో సినిమా కూడా అదే మూడ్‌లో ఉంటుంది. వాళ్లకు ట్రైలర్ నచ్చిందంటే సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నా. లైఫ్‌లో ప్రయాణిస్తూ ఒకచోట ఆగితే దాన్ని మజిలీ అంటాం. అలాగే పూర్ణ జీవితంలోని ఒక మజిలీ ఈ సినిమా.

‘నిన్ను కోరి’ చూసి శివతో చెయ్యాలనుకున్నా

ఒక నటుడిగా నాకు నిజాయితీ ఉన్న కథలంటే ఇష్టం. ‘నిన్ను కోరి’ చూశాక అందులోని రియలిస్టిక్ అప్రోచ్ నాకు బాగా నచ్చింది. అందులో క్లైమాక్స్ అసాధారణంగా ఉంటుంది. తెలుగు సినిమా పద్ధతి ప్రకారం చూస్తే, హీరో హీరోయిన్లు కలిసిపోవాలి. కానీ సహజంగా అనిపించేట్లు క్లైమాక్స్ తీసి మెప్పించాడు శివ. ప్రేక్షకులు కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు.

ఆ అప్రోచ్ చూశాక శివతో సినిమా చెయ్యాలనిపించింది. నాకు లవ్ స్టోరీలంటే ఇష్టం. రియలిస్టిక్ లవ్ స్టోరీలంటే ఇంకా బాగా ఇష్టం. శివను సంప్రదించాక అతను ఈ కథ చెప్పాడు. బాగా నచ్చేసింది. కథ మీద అతనికున్న క్లారిటీ చూసి దీన్ని చెయ్యాలనుకున్నా. నా పద్ధతిలోనే శివ అప్రోచ్ కూడా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చింది.

ఇది ఛాలెంజింగ్ రోల్

రెండు ఛాయలున్న పాత్రలో కనిపిస్తా. ‘ప్రేమం’లో యంగర్ లుక్ చేశాను. కానీ పెళ్లి తర్వాత అనే షేడ్‌ని నేనిప్పటివరకూ ప్రయత్నించలేదు. ‘మనం’లో చిన్న ఎపిసోడ్ ఉండింది కానీ ఇందులో ఉన్నంత గాఢంగా చెయ్యలేదు. ఇది ఛాలెంజింగ్. ప్రేక్షకులు నన్నొక కొత్త శైలిలో చూడబోతున్నారని నమ్ముతున్నా. కాబట్టి యంగర్ షేడ్ కంటే పెళ్లి తర్వాతి షేడ్ నన్ను మరింత ఉద్వేగానికి గురి చేసింది.

మా మధ్య రోమాన్స్ తక్కువ, ఫైటింగ్ ఎక్కువ!
క్రికెట్ నాలెడ్జ్ జీరో

‘మజిలీ’కి ముందు నాకు క్రికెట్ నాలెడ్జ్ జీరో. క్రికెట్ అస్సలు ఆడను. షూటింగ్‌కి ముందు నాలుగు నెలలు క్రికెట్ ప్రాక్టీస్ చేశా. ఒక రంజీ ప్లేయర్ దగ్గర కోచింగ్ తీసుకొని, కొన్ని మ్యాచ్‌లు ఆడి, క్రికెటర్ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకొని, క్రికెట్ అంటే బాగా ఇష్టమున్న అఖిల్‌తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నా. నాలుగు నెలల తర్వాత నేనూ బాగానే క్రికెట్ ఆడగలిగే స్టేజికి వచ్చా.

ప్రతి గృహిణీ శ్రావణితో కనెక్టవుతుంది

కథ ప్రకారం దివ్యాంశ నార్త్ ఇండియాకు చెందిన ఒక నేవీ ఆఫీసర్ అమ్మాయి. వాళ్లు వైజాగ్‌లో సెటిల్ అవుతారు. ఆమె చేసిన కేరెక్టర్ తెలుగు తెరకు కొత్త అనే చెప్పాలి. లవ్ స్టోరీలో ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసిన అమ్మాయయితే ఒక ఇంప్రెషన్ ఉంటుందని, కొత్తమ్మాయయితే ఫ్రెష్‌గా ఉంటుందనీ, ఒక ఇన్నోసెన్స్ ఉంటుందని ఆమెను తీసుకున్నాడు శివ.

సినిమా చూశాక శ్రావణి పాత్ర ప్రతి ఇంటిలో అలా గుర్తుండిపోతుంది. సమంతది అంతగా కనెక్టయ్యే కేరెక్టర్. చాలా వాస్తవికంగా ఉండే పాత్ర. ఇంటికి తనే బలం. వెరీ లవ్‌లీ కేరెక్టర్. ప్రతి గృహిణీ తనలో శ్రావణిని చూసుకుంటుంది. నిజ జీవితం విషయానికి వస్తే మేం ఒకరికొకరం సమాన బలంగా ఉంటాం. అవసరమైన ప్రతిసారీ ఒకరికొకరం సపోర్ట్‌గా ఉంటాం. అనుబంధం అంటే అలాగే కదా ఉండాలి!

ఇలాంటి క్షణాలు మళ్లీ ఎప్పుడొస్తాయో!

సమంతతో పెళ్లి తర్వాత త్వరగానే నటించే అవకాశం వచ్చింది. ఇది చాలా స్పెషల్. మళ్లీ ఇలాంటి క్షణాలు ఎప్పుడొస్తాయో తెలీదు. పెళ్లి తర్వాత ఎలాంటి పాత్రలు చెయ్యాలనుకున్నామో శివ సరిగ్గా అలాంటి పాత్రలే మాకిచ్చాడు. ఈ పాత్ర చేస్తే మంచి పేరొస్తుందనే నమ్మకమైతే ఉండింది. ‘మజిలీ’ లాంటి ఇంకో ఫ్రెష్ స్టోరీ దొరికితే మళ్లీ ఇద్దరం కలిసి చేస్తాం.

ఒక అరేంజ్డ్ మ్యారేజ్‌లో రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? భార్యాభర్తలిద్దరూ ఎలా సర్దుకుపోతారు? ఇద్దరి మధ్యా ఏదో తెలీని దూరం ఉంటుంది. ఆ దూరాన్ని ఎలా అధిగమిస్తారు? ఇటీవలి కాలంలో ఎవరూ తెలుగు సిని మాలో చెప్పలేదు. మేమిద్దరం చేస్తే ఫ్రెష్‌గా ఉంటుందని చేశాం. చాలా హానెస్ట్‌గా, రియలిస్టిగ్గా శివ తీశాడు. ‘మనం’ తర్వాత నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా ‘మజిలీ’.

మా మధ్య రోమాన్స్ తక్కువ, ఫైటింగ్ ఎక్కువ!
ఆ డైలాగ్ నాకు వర్తించదు

ఒక పాయింట్ ఆఫ్ టైంలో పూర్ణ నిజంగా వెధవే. అందుకే “వెధవలకెప్పుడూ మంచి భార్యలే దొరుకుతారు” అనే డైలాగ్ పెట్టారు. అది సినిమా వరకే. నిజ జీవితంలో నాకది వర్తించదు.

ఒకరికొకరం మిస్సవట్లేదు

ఇద్దరమూ వారానికి ఒకరోజు సెలవు తీసుకోవాలని మేం ఒక నిబంధనలా పెట్టుకున్నాం. ఆ రోజంతా ఇద్దరం కలిసి గడపాలని నిర్ణయించుకున్నాం. లైఫ్‌లో ఆ బ్యాలెన్స్ చాలా ముఖ్యం. సాధారణంగా ప్రతి రోజూ సాయంత్రం ఆరు తర్వాత ఇంట్లోనే ఉంటాం. షూటింగ్స్ సాయంత్రం ఆరుకల్లా పూర్తి చేసుకొని వచ్చేస్తాం. కలిసి జిం చేస్తాం. డిన్నర్ కలిసి చేస్తాం. అందువల్ల షూటింగ్స్ ఉన్నప్పుడు కూడా మేం ఒకరికొకరం మిస్సవట్లేదు.

పెళ్లి అనేది ఓపెన్ డిస్కషన్

పెళ్లి తర్వాత కలిసి నటిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? ఎలాంటి స్టోరీ చెయ్యాలి? లాంటి భయాలు ఉంటాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత వచ్చిన కామెంట్స్ చూసి సంతోషంగా అనిపించింది. మమ్మల్ని అంగీకరించినందుకు ప్రేక్షకులకు థాంక్స్.

నా దృష్టిలో పెళ్లి అనేది ఓపెన్ డిస్కషన్. ఏదైనా సమస్య అనుకుంటే ఓపెన్‌గా మాట్లాడి పరిష్కరించుకోవాలి. అలా కాకుండా లోపల దాచుకుంటే అది తర్వాత ఫ్రస్ట్రేషన్‌లా తయారవుతుంది. మొదట్లోనే ఓపేన్‌గా ఉంటే ఎలాంటి సమస్యలూ రావని నేననుకుంటాను. నిజాయితీ అనేది ఏ అనుబంధాన్నయినా సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తుంది.

మా మధ్య రోమాన్స్ తక్కువ, ఫైటింగ్ ఎక్కువ!
ఇప్పటికైతే వెంకీ మామే!

ప్రసుతం ‘వెంకీ మామ’ చేస్తున్నా. వెంకటేశ్ మామతో చేస్తున్నా. ఇప్పటికే షెడ్యూల్ మొదలైంది. బాబీ డైరెక్టర్. రెండు మూడు నెలల్లో ఆ సినిమా అయిపోతుంది. కంప్లీట్ ఎంటర్‌టైనర్. చాలా బాగా వస్తోంది. ఫుల్ ఫన్. ఇప్పటివరకు కొత్తగా వేరే సినిమాకేమీ సంతకం చెయ్యలేదు.

– సజ్జా వరుణ్

మా మధ్య రొమాన్స్ తక్కువ, ఫైటింగ్ ఎక్కువ! | actioncutok.com