‘మజిలీ’ రివ్యూ: 4 అడుగులు ముందుకి, 3 అడుగులు వెనక్కి


'మజిలీ' రివ్యూ: 4 అడుగులు ముందుకి, 3 అడుగులు వెనక్కి

‘మజిలీ’ రివ్యూ: 4 అడుగులు ముందుకి, 3 అడుగులు వెనక్కి

తారాగణం: నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు రమేశ్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, అతుల్ కులకర్ణి

దర్శకత్వం: శివ నిర్వాణ

విడుదల తేదీ: 5 ఏప్రిల్ 2019

పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన తొలి సినిమా కావడంతో సహజంగానే ‘మజిలీ’ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా పెళ్లయిన తారలు సినిమాల్లో జంటగా కనిపిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరనే అభిప్రాయం ఉంది. ‘నిన్ను కోరి’తో దర్శకుడిగా పరిచయమై ప్రతిభ ఉన్నవాడిగా గుర్తింపు పొందిన శివ నిర్వాణ ఆ ఇద్దర్నీ ఎలా చూపించాడు? సాధారణాభిప్రాయాన్ని తప్పని అతను నిరూపించగలిగాడా? చైతన్య, సమంత పాత్రలు ప్రేక్షకుల్ని మెప్పించేట్లు ఉన్నాయా?

కథ

వైజాగ్‌లోని జ్ఞానపురం అనే కాలనీలో ఉండే పూర్ణ (చైతన్య)కు తండ్రి (రావు రమేశ్) తప్ప తల్లి లేదు. సచిన్ టెండూల్కర్ వీరాభిమాని అయిన పూర్ణకు క్రికెట్ అంటే పిచ్చి. చదువులో అంతంత మాత్రంగా ఉంటూ ఐటిఐ ఎలెక్ట్రీషియన్ కోర్సు చదివే అతను లోకల్ క్రికెట్‌లో బాగా రాణిస్తాడు. వైజాగ్‌లో నేవీ ఆఫీసర్ (అతుల్ కులకర్ణి)గా పనిచేసే నార్త్ ఇండియన్ కూతురు అన్షు (దివ్యాంశ కౌశిక్)తో ప్రేమలో పడతాడు పూర్ణ. ఆమె కూడా అతడ్ని గాఢంగా ప్రేమిస్తుంది.

అప్పటికే ఆమెకు సమీప బంధువుతో పెళ్లి ఖాయమై ఉంటుంది. అహంతో తనకు టీంలో అవకాశమిచ్చిన కోచ్‌ను కాదని అసాంఘిక పనులు చేసే భూషణ్ (సుబ్బరాజు) మనుషులతో చేతులు కలిపిన పూర్ణ వాళ్లు చెప్పిన టీంకు ఆడుతూ చెడు అలవాట్లకు బానిస అవుతాడు. పూర్ణను అడ్డు పెట్టుకొని అన్షుపై అత్యాచారం చెయ్యాలని చూస్తాడు భూషణ్. అతడినీ, అతడి మనుషుల్నీ కొడతాడు పూర్ణ.

తర్వాత జరిగిన పరిణామాలు ప్రేమికులకు ప్రతికూలంగా పరిణమిస్తాయి. ఇద్దరూ ఒకరికొకరు దూరమవుతారు. అన్షును తీసుకొని ఆమె తల్లిదండ్రులు వైజాగ్ నుంచి వెళ్లిపోతారు. పిచ్చివాడిలా మారిన పూర్ణ తాగుడుకు పూర్తిగా బానిసవుతాడు. తండ్రి కోసం ఎదురింటమ్మాయి శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకుంటాడు.

కానీ మనసులో అన్షు ఉండటంతో శ్రావణిని దగ్గరకు రానీయకుండా ఆమెను హింసపెడుతుంటాడు. చివరకు పూర్ణ, శ్రావణి ఒక్కటయ్యారా? అన్షు ఏమయ్యింది? అనేది మిగతా కథ.

'మజిలీ' రివ్యూ: 4 అడుగులు ముందుకి, 3 అడుగులు వెనక్కి
కథనం

‘దేరీజ్ లవ్.. దేరీజ్ పెయిన్’ అనేది ఈ సినిమాకు ఉప శీర్షికగా పెట్టాడు దర్శకుడు. ప్రథమార్థాన్ని లవ్‌తోనూ, ద్వితీయార్థాన్ని పెయిన్‌తోనూ నింపేశాడు. అంటే మొదటి సగం చాలా వరకు ఆహ్లాదకరంగా నడిస్తే, రెండో సగం సీరియస్‌గా, బరువుగా నడుస్తుంది. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పుకుంటూ పోవడం దర్శకుడిలోని పరిణతిని తెలియజేస్తుంది.

శ్రావణి పాత్ర ఇంటర్వెల్‌కు ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పటిదాకా చాలా సహజంగా పాత్రల్ని పరిచయం చేస్తూ వచ్చిన దర్శకుడు శ్రావణి పరిచయ సన్నివేశంలో బిల్డప్ ఇవ్వడం అసహజంగా అనిపిస్తుంది. కథలో శ్రావణి పాత్ర అడుగు పెట్టిన క్షణం నుంచీ ఎక్కువ భాగం సన్నివేశాలు బరువుగా అనిపిస్తుంటాయి.

ఒకవైపు అన్షును మరిచిపోలేక పూర్ణ పడే వేదన, ఇంకోవైపు అతడి కారణంగా శ్రావణి పడే హింస, ఆవేదన కలిసి ప్రేక్షకుడ్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. మొదట్లోనే శ్రావణి పాత్రను పరిచయం చెయ్యకుండా, సెకండాఫ్‌లో పూర్ణను ఆమె యుక్త వయసు నుంచే ఇష్టపడుతూ వస్తుందనే విషయాన్ని చూపించడం బాగుంది.

బరువు సన్నివేశాల మధ్యలో శ్రావణి గతాన్ని గుర్తు చేసుకోవడం, ఆ సందర్భంగా వచ్చే ‘ప్రియతమా ప్రియతమా..’ సాంగ్ ఒకింత రిలీఫ్‌ను ఇస్తాయి. ఆ సన్నివేశాల్లో శివ దర్శకత్వ పరిణతి, అతడి ప్రతిభ వ్యక్తమవుతాయి.

పూర్ణ, అన్షు మధ్య ప్రణయం వృద్ధిచెందే తీరును దర్శకుడు చాలా బాగా చిత్రించాడు. ఆ ఇద్దరిపై వచ్చే సన్నివేశాలు ముచ్చటగా అనిపిస్తాయి. మధ్య తరగతి జీవుల ఇళ్లల్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఆ మనుషులు ఎలా ఉంటారు, వాళ్ల నడత ఎలా ఉంటుంది, వాళ్ల మధ్య బంధాలు ఎలా ఉంటాయి.. అనే విషయాలు ఇటీవలి కాలంలో మనం తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా చూస్తున్నాం.

వాటిలోనూ ‘మజిలీ’లో చూపించినంత గాఢంగా ఇప్పటివరకూ చూడలేదు. దారి తప్పుతున్న కొడుకును చూస్తూ ఒక మధ్యతరగతి తండ్రి ఎలాంటి వేదన పడతాడో రావు రమేశ్ పాత్రతో ఉన్నత స్థాయిలో చూపించాడు దర్శకుడు. ఆటల్లో ప్రతిభ చూపేవాళ్లను అవినీతితో బ్రోకర్లు ఎలా తప్పుదారి పట్టిస్తుంటారు, మ్యాచ్ ఫిక్సింగ్‌లు కింది స్థాయిలోనే ఎలా జరుగుతుంటాయో కూడా దర్శకుడు ‘మజిలీ’తో మన ముందు ప్రదర్శించాడు.

'మజిలీ' రివ్యూ: 4 అడుగులు ముందుకి, 3 అడుగులు వెనక్కి
తారల అభినయం

నటీనటులు ఎలా చేశారనే దానికంటే ముందు కథలోని పాత్రల్ని మలిచిన తీరుకు దర్శకుడ్ని అభినందించకుండా ఉండలేం. ప్రతి పాత్రకూ ఒక ప్రయోజనం ఉండేలా వాటిని తీర్చిదిద్దాడు. అందరూ తమ పాత్రల ఔచిత్యాన్ని గుర్తించి అందుకు తగ్గ నటన ప్రదర్శించారు. నాయకుడు, ఇద్దరు నాయికలు తమ అభినయంతో బాగా ఆకట్టుకున్నారు.

మొదట ప్రేమికుడిగా, తర్వాత తండ్రి కోసం పెళ్లి చేసుకుని, భార్యను దగ్గరకు రానీయని భర్తగా పూర్ణ పాత్రలో చైతన్య గొప్పగా రాణించాడు. ప్రేమికుడిగా పూర్ణ కనిపించినంత సేపూ ఆస్వాదించే మనం, అతడు శ్రావణితో ప్రవర్తించే తీరుకు మాత్రం చిరాకుపడతాం. అతడెప్పుడు శ్రావణి ప్రేమను అర్థం చేసుకొని, ఆమెను చేరదీస్తాడా.. అని ఎదురుచూస్తుంటాం.

ఈ సందర్భంలోనే ప్రేక్షకులకు కాస్త సహనం అవసరమవుతుంది. ప్రేయసిని దూరం చేసుకొని పూర్ణ అనుభవించే నొప్పి కంటే, భర్త నిర్దయ కారణంగా నొప్పి అనుభవించే శ్రావణి పాత్రతోనే ప్రేక్షకులు ఎక్కువ సహానుభూతి చెందుతారు. అంతలా శ్రావణి పాత్రలో ఇమిడిపోయింది సమంత.

ఇప్పటికే మనం సమంతలోని ఉన్నత స్థాయి నటిని చూసినా, ‘మజిలీ’ నిస్సందేహంగా నటిగా ఆమెలోని మరో కోణాన్ని బయటపెట్టిందనేది నిజం. పూర్ణ నిరాదరణకు మనసులోనే బాధననుభవిస్తూ, పైకి మామూలుగా కనిపించే శ్రావణిగా సమంత చాలా రోజుల పాటు మన హృదయాల్ని వెన్నాడుతుంది.

ఈ సినిమాతో ఒక చక్కని అమ్మాయి నటిగా మనముందుకొచ్చింది. అన్షు పాత్రలో దివ్యాంశ ముచ్చటగొలిపింది. చైతన్యకు చక్కని జోడీగా అలరించింది. కొన్ని సందర్భాల్లో పూర్ణ బ్యాలెన్స్ తప్పుతున్నా, అన్షు అతడికి కరెక్ట్ చెయ్యడం, ఆ రకంగా ఆమె పాత్రను తీర్చిదిద్దడం దర్శకుడిపై గౌరవాన్ని పెంచింది.

సినిమాలో చెప్పుకోదగ్గ మరో పాత్ర పూర్ణ తండ్రిగా రావు రమేశ్ పోషించిన పాత్ర. కళ్ల ముందే కొడుకు పాడవుతుంటే, ఒకవైపు మందలిస్తూనే, ఇంకోవైపు అంతకంటే ఇంకేం చెయ్యాలో పాలుపోని తండ్రిగా, నిస్సహాయుడైన మధ్యరతగతి మనిషిగా రావు రమేశ్ అత్యున్నత స్థాయి నటనను ప్రదర్శించాడు. కోట శ్రీనివాసరావు తర్వాత ఆ స్థాయి నటుడిగా రమేశ్ మనకు కనిపిస్తాడు.

శ్రావణి తండ్రి పాత్రలో పోసాని నటనను తక్కువ చెయ్యలేం. మొదట్నుంచీ పూర్ణ ప్రవర్తన, అతడి అలవాట్లను ప్రత్యక్షంగా చూస్తూ, అతడికి చీదరించుకొనే అతను చివరకు తన కూతురు శ్రావణినే అతడికిచ్చి పెళ్లి చేయాల్సిరావడం, పెళ్లయ్యాక కూతురు పడే అవస్థలు చూడాల్సి రావడంతో కలిగే ఫ్రస్ట్రేషన్‌ను పోషాని సమర్థవంతంగా చూపించాడు.

పూర్ణ సన్నిహిత మిత్రుడిగా కనిపించిన నటుడు కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. సుబ్బరాజు, అతుల్ కులకర్ణి పాత్రోచితంగా నటించారు. అన్షు కూతురిగా కనిపించిన బాలనటి సైతం చక్కని నటన ప్రదర్శించింది.

'మజిలీ' రివ్యూ: 4 అడుగులు ముందుకి, 3 అడుగులు వెనక్కి
సాంకేతిక అంశాలు

సాంకేతిక అంశాల్లో దర్శకత్వం తర్వాత చెప్పుకోవాల్సింది నేపథ్య సంగీతాన్ని. పాటలకు గోపీసుందర్ స్వరాలు కూర్చినా, సన్నివేశాలకు మ్యూజిక్ ఇచ్చింది తమన్. బ్యాగ్రౌండ్ స్కోర్ వల్లే దర్శకుడు కల్పించిన సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్‌లోని మూడ్‌ను కేరీ చేసింది మ్యూజిక్కే. పాటలకు గోపీసుందర్ వినసొంపైన స్వరాల్ని అందించాడు. ‘ఏడెత్తు మల్లెలు’, ‘ప్రియతమా ప్రియతమా’ పాటలు బాగా ఆకట్టుకున్నాయి.

విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ చాలావరకు దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగానే ఉంది. సమంత పరిచయ సన్నివేశంలో మాత్రం ఆర్భాటం చూపించింది. ఇందులో దర్శకుడి బాధ్యతా ఉంది. దర్శకుడు స్వయంగా రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. యువకుడైనా బరువైన సన్నివేశాల్లో సందర్భానికి తగ్గట్లు గాఢత నిండిన మాటలు రాశాడు. ఎడిటర్ ప్రావీణ్ పూడి సెకండాఫ్‌లో తన కత్తెరకు మరికొంత పని కల్పించి ఉంటే బాగుండేది.

చివరి మాట

ప్రేమతో గిలిగింతలు పెట్టి, ఆ వెంటనే భగ్నప్రేమతో గుండెల్ని మెలిపెట్టే బాధాకర ‘మజిలీ’. చూడకపోతే నష్టమేం లేదు కానీ చూశాక ఒక చక్కని సినిమా చూసిన అనుభూతి చెందుతారు.

– బుద్ధి యజ్ఞమూర్తి

‘మజిలీ’ రివ్యూ: 4 అడుగులు ముందుకి, 3 అడుగులు వెనక్కి | actioncutok.com

You may also like: