అక్కడ ఏ హీరో దొరకట్లేదు.. ఇక్కడ బాలయ్య దొరికేశాడు!


అక్కడ ఏ హీరో దొరకట్లేదు.. ఇక్కడ బాలయ్య దొరికేశాడు!
KS Ravikumar

అక్కడ ఏ హీరో దొరకట్లేదు.. ఇక్కడ బాలయ్య దొరికేశాడు!

కె.ఎస్. రవికుమార్ అంటే నిన్నటి దాకా తమిళంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరు. రజనీకాంత్, కమల్ హాసన్, శరత్‌కుమార్, అజిత్, సూర్య, అర్జున్, శింబు, మాధవన్ వంటి హీరోలను డైరెక్ట్ చేశాడు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ‘నరసింహా’ (పడయప్పా), ‘దశావతారం’ వంటి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు అమితంగా ఆదరించారు.

తెలుగులోనూ తొలిగా చిరంజీవితో ‘స్నేహం కోసం’ రూపొందించిన ఆయన ఆ తర్వాత నాగార్జునతో ‘బావ నచ్చాడు’, రాజశేఖర్‌తో ‘విలన్’ సినిమాలు తీశాడు.

రజనీకాంత్‌తో ఆయన రూపొందిన ‘లింగా’ (2014) డిజాస్టరై, డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడ్డాక తమిళంలోని పెద్ద హీరోలెవరూ రవికుమార్ డైరెక్షన్‌లో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో ఆయన సుదీప్ హీరోగా కన్నడ, తమిళ భాషల్లో ఒక సినిమా చేశాడు.

ఆ తర్వాత ఆయన దృష్టి తెలుగు హీరోలపై పడింది. తనకు బాగా తెలిసిన సి. కల్యాణ్ ద్వారా బాలకృష్ణను కలిసి మొత్తానికి ‘జై సింహా’ (2018) రూపొందించాడు. అది ఓ మాదిరి విజయాన్ని సాధించింది. దాని తర్వాత కూడా ఏ తమిళ హీరోలు ఆయన వంక చూడలేదు. ఇప్పుడు మరోసారి బాలకృష్ణను ఒప్పించాడు రవికుమార్. ‘జై సింహా’ని నిర్మించిన సి. కల్యాణ్ ఈ సినిమానీ నిర్మిస్తున్నాడు.

నిజానికి ఇప్పుడు బోయపాటి డైరెక్షన్‌లో బాలయ్య సినిమా చెయ్యాలి. జూన్‌లో ఆ సినిమా మొదలు పెట్టాలని కూడా అనుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా ఆ స్థానంలో రవికుమార్ సినిమా వచ్చి చేరింది. దాంతో బోయపాటితో బాలయ్య చెయ్యాలనుకున్న సినిమా ఇంకో రెండు నెలలు వెనక్కి జరిగింది. అంటే పరిస్థితులు అనుకూలిస్తే బోయపాటితో బాలయ్య చేసే సినిమా ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లనుంది.

మొత్తానికి తమ హీరోలు పట్టించుకోని కె.ఎస్. రవికుమార్‌తో బాలయ్య వరుసగా సినిమాలు ఒప్పుకోవడం కోలీవుడ్ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అక్కడ ఏ హీరో దొరకట్లేదు.. ఇక్కడ బాలయ్య దొరికేశాడు! | actioncutok.com

You may also like: