‘కల్కి’ విజృంభణ ఖాయమేనా?


'కల్కి' విజృంభణ ఖాయమేనా?

‘కల్కి’ విజృంభణ ఖాయమేనా?

డాక్టర్ రాజశేఖర్ పేరు తలచుకోగానే ‘ఆహుతి’, ‘అంకుశం’ చిత్రాలు జ్ఞాపకం వస్తాయి. యాంగ్రీ యంగ్‌మేన్‌గా ఆ సినిమాలతో రాజశేఖర్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అయితే చాలా కాలంగా ఆయన నుంచి ఆ తరహా సినిమా రాలేదన్నది నిజం. హీరోగా ఆయన కెరీర్ ముగిసినట్లేననే వ్యాఖ్యలూ వింటూ వస్తున్నాం.

అయితే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొనే రోజు వస్తున్నట్లే కనిపిస్తోంది ‘కల్కి’ టీజర్ చూస్తుంటే. ‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని టీజర్ స్పష్టం చేస్తోంది. ఒక్క రోజులోనే ఈ టీజర్ యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సాధించింది. రాజశేఖర్ ప్రస్తుత ఫాంను దృష్టిలో ఉంచుకుంటే ఇది చాలా ఎక్కువే.

టీజర్ చూస్తుంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విజన్, అతని టాలెంట్ స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒక చెరువులో అనేకమంది విగత జీవులుగా కనిపిస్తుండటం ఏదో పెద్ద దారుణం జరిగిందనీ, అరాచకశక్తులు ఈ ఘోరానికి ఒడిగట్టాయనీ తెలుస్తోంది. ఆ దుష్టశక్తుల్ని అంతమొందించే ‘కల్కి’గా టీజర్ చివరలో రాజశేఖర్ ప్రత్యక్షమయ్యారు.

గండ్రగొడ్డలితో వాళ్లను ఆయన దునుమాడే సన్నివేశాలు రోమాల్ని నిక్కబొడుచుకొనేలా చేస్తాయని యూనిట్ సభ్యులు చెబ్తున్నారు.

టీజర్‌లో ప్రధాన దుష్టశక్తిగా బాలీవుడ్ నటుడు అశుతోష్ రాణా కనిపిస్తున్నాడు. హీరోయిన్ అదా శర్మతో పాటు రాహుల్ రామకృష్ణ, నాజర్, జయప్రకాశ్, సిద్ధు జొన్నలగడ్డ, శత్రు, పూజిత పొన్నాడ ఆసక్తికర పాత్రల్లో కనిపించనున్నారనే అభిప్రాయం కలుగుతోంది.

టెక్నికల్ బృందం పనితనం ఉన్నత స్థాయిలో ఉండబోతోందని కూడా టీజర్ తెలియజేస్తోంది. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ, శ్రావణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం, నాగేంద్ర కళా దర్శకత్వం సూపర్బ్ అనిపిస్తున్నాయి. సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శివాని, శివాత్మిక సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

చూస్తుంటే ఈ సినిమాతో మన ముందు ఒకప్పటి రాజశేఖర్ ప్రత్యక్షమవడం ఖాయమనే అభిప్రాయం కలుగుతోంది.

‘కల్కి’ విజృంభణ ఖాయమేనా? | actioncutok.com

You may also like: