బెజవాడలో హైడ్రామా! వర్మను నిర్బంధించిన పోలీసులు!

బెజవాడలో హైడ్రామా! వర్మను నిర్బంధించిన పోలీసులు!
బెజవాడలో రామ్‌గోపాల్‌వర్మ గొడవ తారా స్థాయికి చేరింది. గత కొంత కాలంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయబోతున్నానంటూ ప్రకటనలు చేస్తున్న వర్మ ఎట్టకేలకు మే 1న విడుదల చేస్తున్నానంటూ ప్రకటించాడు. ఇక్కడి నుంచే అసలు డ్రామా మొదలైంది. బెజవాడలో సాయంత్రం 4 గంటలకు నోవాటెల్ హోటల్లో ప్రెస్‌మీట్ పెట్టాలని అంతా సిద్ధం చేశారు.
అయితే హోటల్ వర్గాలు చివరి నిమిషంలో వర్మకు ఝలకిచ్చారు. తమ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కుదరదని తేల్చి చెప్పడంతో వర్మ వేదికను హోటల్ ఐలాపురంకు మార్చాడు. అక్కడా అదే స్థితి ఎదురైంది. దాంతో బెజవాడ నడిబొడ్డున నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెట్టనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
ఇది ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. దీంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసు యంత్రాంగం ఎయిర్‌పోర్ట్‌లోనే వర్మను అరెస్ట్ చేసి ఎయిర్ పోర్ట్ గదిలోనే నిర్బంధించడం ఆసక్తికరంగా మారింది.
దీనిపై వర్మ మళ్లీ ట్వీట్ చేశాడు. ఓ వీడియోను కూగా పోస్ట్ చేశాడు. “నేను పోలీస్ కస్టడీలో వున్నాను. నిజం చెప్పడమే నేను చేసిన నేరంగా నన్ను పోలీసు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదు. ప్రెస్ మీట్ కోసం వెళుతున్న మమ్మల్ని బలవంతంగా కార్ల్లోనించి దింపి వాళ్ల వాహనాల్లో ఎక్కించుకుని పోలీసులు బలవంతంగా ఎయిర్ పోర్ట్ గదుల్లో బందీ చేశారు. విజయవాడకు నేను రావడానికి, అక్కడ ఎలాంటి ప్రెస్ మీట్లు నిర్వహించడానికి వీల్లేదని చెబుతున్నారు. ఇలా పోలీసులు ఎందుకు చేశారన్నది నాకేమీ అర్థం కావడం లేదు. శాంతిభద్రతల్ని పరిరక్షించే పోలీసులంటే నాకు గౌరవం వుంది. నేను, నా నిర్మాత పోలీసులని కారణం ఏంటని ఎంత అడిగినా సమాధానం చెప్పడం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్లు మీకు అందిస్తూనే వుంటాను” అంటూ వర్మ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెజవాడలో హైడ్రామా! వర్మను నిర్బంధించిన పోలీసులు! | actioncutok.com
Trending now: