‘దబాంగ్’ సెట్లో శివలింగం.. సల్మాన్ వివరణ!


'దబాంగ్' సెట్లో శివలింగం.. సల్మాన్ వివరణ!

‘దబాంగ్’ సెట్లో శివలింగం.. సల్మాన్ వివరణ!

గురువారం ‘దబాంగ్ 3’ సెట్స్‌పై చెక్క పలకలతో కప్పి ఉంచిన శివలింగం, దాని ముందు ఉన్న నంది విగ్రహం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలోకి రావడం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా డైరెక్ట్ చేస్తోన్న ‘దబాంగ్ 3’ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని మహేశ్వరంలో జరుగుతోంది.

అక్కడి నర్మదా నదీ తీరంలో వేసిన సెట్లో ఉంచిన శివలింగం, నంది విగ్రహాల ఫొటోలు బయటకు రావడం మధ్యప్రదేశ్ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. శివలింగాన్ని అలా చెక్కల కింద ఉంచడం హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడమేననీ, ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలనీ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

దీనిని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. పరమత సహనం ఉండాలని సల్మాన్ ఖాన్ ఎప్పుడూ చెబుతుంటారనీ, బీజేపీ కావాలని మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందనీ, వాళ్లది సంకుచిత మనస్తత్వమనీ మధ్యప్రదేశ్ క్రీడలు, యువజన సంక్షేమ శాఖామంత్రి జితు పట్వారి విమర్శించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం మహేశ్వరంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసిన సల్మాన్ ఖాన్ వివరణ ఇచ్చాడు. శివలింగాన్ని సురక్షితంగా ఉంచడం కోసమే చెక్క పలకల కింద దాన్ని ఉంచామనీ, షూటింగ్ సమయంలో దాని పవిత్రతను కాపాడుతున్నామనీ చెప్పాడు. తర్వాత ఆ చెక్కల్ని తీసేశామని తెలిపాడు.

‘దబాంగ్ 3’ షూటింగ్ గత సోమవారమే మొదలైంది. ఇందులో పోలీస్ ఇన్‌స్పెక్టర్ చుల్‌బుల్ పాండేగా సల్మాన్ నటిస్తుండగా, అతని భార్య రజ్జో కేరెక్టర్‌ను సోనాక్షి సిన్హా చేస్తోంది.

‘దబాంగ్’ సెట్లో శివలింగం.. సల్మాన్ వివరణ! | actioncutok.com

You may also like: