దసరాకే ‘సైరా’!


దసరాకే 'సైరా'!

దసరాకే ‘సైరా’!

చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘సైరా.. నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. తొలినాటి స్వాతంత్ర్య సమరయోధునిగా, బ్రిటిషువాళ్లపై తిరుగుబాటు చేసిన వీరునిగా కీర్తిపొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా తయారవుతున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా ప్రధాన పాత్రధారులు.

కాగా ‘సైరా’ ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో గందరగోళం నెలకొని ఉంది. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారని ఒకసారీ, విజయదశమికి వస్తుందని ఇంకోసారీ, అసలు ఈ ఏడాది రాదు, 2020 సంక్రాంతికి విడుదల చేస్తారని మరోసారీ సోషల్ మీడియాలో ప్రచారమవుతూ వస్తోంది.

నిర్మాత రాంచరణ్ కానీ, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కానీ ఇప్పటివరకూ సినిమా విడుదల విషయంలో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘సైరా’ ఈ ఏడాదే విడుదలవుతుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే రజనీకాంత్ సినిమా ‘దర్బార్’ను 2020 పొంగల్‌కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అందువల్ల ‘సైరా’ను అప్పుడు విడుదల చెయ్యాలనుకుంటే తమిళ వెర్షన్‌కు థియేటర్లు దొరకని స్థితి నెలకొంటుంది. తమిళ వెర్షన్‌కు క్రేజ్ తీసుకు రావడం కోసమే ఈ సినిమాలో విజయ్ సేతుపతిని తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో సంక్రాంతికి ‘సైరా’ విడుదల ఉండదని తేలుతోంది. అంతకంటే ముందుగా విడుదల చెయ్యడానికి వీలుగా సినిమాకి సంబంధించిన అన్ని పనులూ త్వరగా పూర్తి చెయ్యడానికి దర్శక నిర్మాతలు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమాకు దసరా సీజన్ కంటే మంచి సీజన్ ఉండదనీ, అందుకే ఆ సీజన్‌లోనే సినిమాని విడుదల చెయ్యాలనీ రాంచరణ్ భావిస్తున్నాడు.

చిరంజీవి సైతం దసరాకే సినిమాని విడుదల చెయ్యాలని పట్టుదలతో ఉన్నట్లు అంతర్గత వర్గాలు తెలిపాయి.

దసరాకే ‘సైరా’! | actioncutok.com

Trending now: