విశ్లేషణ: మళ్లీ మోదీ?.. కనిపించని రాహుల్ హవా!


విశ్లేషణ: మళ్లీ మోదీ?.. కనిపించని రాహుల్ హవా!

విశ్లేషణ: మళ్లీ మోదీ?.. కనిపించని రాహుల్ హవా!

అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఆదివారంతో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పలు పేరుపొందిన సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ 300కు పైగా సీట్లను గెలిచి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చి చెబుతున్నాయి. కాంగ్రెస్ సహా బీజేపీ యేతర పార్టీలు బీజేపీని ఏమాత్రం నిలువరించలేకపోయాయనీ, ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీ పట్టాభిషేకం కాకుండా అడ్డుకోలేకపోయాయనీ అవి సూచిస్తున్నాయి.

2014లో కేవలం 44 సీట్లను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్స్ పార్టీ ఈ సారి ఎన్నికల్లో కొద్దిగా మాత్రమే మెరుగు పడిందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. వాటి అంచనాలే నిజమై, కాంగ్రెస్‌కు 100 లోపే సీట్లు దక్కితే, భారత రాజకీయల్లో మేరునగం వంటి గొప్ప పార్టీకి వరుసగా రెండోసారి ఓటమి ఖాయమైతే, ఆ పార్టీ నాయకత్వం నుంచి దిగిపోవాల్సిందిగా రాహుల్ గాంధీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ విశ్లేషణలు వచ్చాయి. విదేశీ మీడియా కూడా రాహుల్‌కు వత్తాసు పలికింది. కానీ వాస్తవంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సరైనవైతే, అధికారానికి రాహుల్ ఇంకా సుదూరంగానే ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి మహా అయితే 120 సీట్లు రావచ్చు. ఆ పార్టీలు ఆశిస్తున్న దానితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లో  కాంగ్రెస్, దాని మిత్రప్రక్షాలు తమ సీట్లను బీజేపీకో, దాని మిత్రపక్షాలకో తమ సీట్లను సమర్పించుకుంటున్నాయి.

దేశంలో అత్యధిక లోక్‌సభ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీ, దీని మిత్రపక్షాలకు 50 లోపు సీట్లే రావచ్చు. 2014లో అవి గెలిచిన 73 సీట్ల కంటే ఇవి బాగా తక్కువ. కానీ ఆ లోటుని అవి ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో రాష్ట్రాల్లో పూడ్చుకోబోతున్నాయి.

ఇక మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తమ మునుపటి సీట్లను కాపాడుకోబోతున్నాయి. బిహార్‌లోనూ అవి మెరుగైన ఫలితాల్ని సాధించనున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ నిజమైతే, ప్రాతీయ పార్టీల హవా నడుస్తున్న చోట్ల కూడా ఈసారి బీజేపీ తన ముద్రను వేయనున్నది. మమతా బెనర్జీ ఎంత తీవ్రంగా పోరు చేసినా, ప్రచారంలో హింస చెలరేగినా, బెంగాల్లో బీజేపీ ఊహించిన దానికి మించి సీట్లను సాధించనున్నది. అలాగే ఒడిశాకు తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభావాన్ని తట్టుకొని బీజేపీ కొన్ని సీట్లను కైవసం చేసుకోబోతోంది.

హిందూత్వ, వికాస్ అనే సందేశాలతో ముందుకెళ్లిన బీజేపీ భారత రాజకీయ ముఖచిత్రంలో సాధారణమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఛేదించిందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్, ఉజ్వల, జన్ ధన్ పథకాలను విపక్షాలు ఎంతగా విమర్శించినా, క్షేత్ర స్థాయిలో వాటి ప్రభావం ఉన్నదని స్పష్టమవుతోంది.

విశ్లేషణ: మళ్లీ మోదీ?.. కనిపించని రాహుల్ హవా!

ప్రత్యర్థుల్ని బీజేపీ వెనక్కి నెట్టేసిన ఇంకో అంశం.. సందేశం! తాము అధికారంలోకి వస్తే ‘న్యాయ్’ పథకాన్ని ప్రవేశ పెడతామని రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. అయితే ‘న్యాయ్’కు మించి ఆయన రాఫెల్ డీల్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం బీజేపీకి కలిసొచ్చిందనీ, క్షేత్ర స్థాయిలో రాఫెల్ ప్రభావమేమీ లేదనీ ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి.

మహాకూటమికి తగ్గ వాతావరణాన్ని సృష్టించడంలో కాంగ్రెస్ విఫలమైంది. తమిళనాడు, బిహార్, జార్ఖండ్, ఒడిశాలలో పొత్తులు పెట్టుకోగలిగిన ఆ పార్టీ, మిగతా చోట్ల ఆ పని చెయ్యడంలో సఫలం కాలేదు. బెంగాల్లో బీజేపీతో తలపడటానికి మమతా బెనర్జీతో కలవడం ఆ పార్టీకి చేతకాలేదు.

ఎగ్జిట్ పోల్స్

అన్ని సంస్థలు       బీజేపీ +      కాంగ్రెస్ +    ఇతరులు

టైమ్స్ నౌ          306                132              104

జన్ కీ బాత్          305                124               113

ఏబీపీ-నీల్సన్       267                127               148

న్యూస్ 18            336                  82               124

సగటు                 303                116                122