సినిమాలెందుకు హిట్టవుతాయి?: జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజికి ‘ఆది’ (ముగింపు భాగం)


సినిమాలెందుకు హిట్టవుతాయి?: జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజికి 'ఆది' (ముగింపు భాగం)

సీన్ 1

ఎన్నడో చిన్నతనంలో వొదిలేసిన ఊళ్లోకి చాలా కాలం తర్వాత అడుగుపెట్ట్టాడు ఆదికేశవరెడ్డి ఉరఫ్ ఆది. దాహం వేస్తోంది. బావి దగ్గర నీళ్లు తోడుతున్న కొంతమంది స్త్రీలు కనిపించారు. జీపు దిగి ఒకామెనడిగి నీళ్లు తాగాడు.

ఆకాశం వంక చూస్తా “వా.. ఏం పెట్టావ్‌రా ఈ నేలలో. నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతోంది” అని సెల్యూట్ చేసి, తనకి మంచినీళ్లు పోసిన స్త్రీతో “ఈ నేల తాకి, ఈ నీళ్లు తాగి పద్నాలుగేళ్లయ్యింది. వస్తానమ్మా” అన్నాడు నమస్కరిస్తా.

“ఎవరు బాబూ నువ్వు?” అనడిగింది ఆ పక్కనే ఉన్న మరొకామె.

“ఆదికేశవరెడ్డి గారి మనవణ్ణి” అనాడు అదే పేరున్న ఆది. అంతే. అక్కడున్న అందరు స్త్రీలూ అతడికి దణ్ణం పెట్టారు. ఆదికి మంచినీళ్లు పోసినామె అతడికి బొట్టు పెట్టింది.

“ఇక నుంచీ మీలో ఒకడిగా ఈ ఊళ్లోనే ఉంటాను” చెప్పాడు ఆది.

సీన్ 2

విజయదశమిలోపు తన ఆస్తులన్నీ తనకి హేండోవర్ చెయ్యమనీ, లేదంటే ఎనిమిదేళ్ల వయసులోనే బాంబులేసిన తనకు ఇప్పుడెయ్యడం పెద్ద కష్టం కాదనీ వార్నింగ్ ఇచ్చి వెళ్తున్న ఆది జీపుని బాంబుతో పేల్చేశాడు నాగిరెడ్డి.

“రేయ్. సీమంటే ఇట్టుంటుందిరా. పో. ఎక్కడో చోట హాయిగా బతుకు. లేదూ. ఇక్కడే బతుకుతానంటావా. ఉండటానికి ఇల్లిస్తా. పదెకరాల పొలమిస్తా. నా ముందు తలదించుకుని బతకాలి. తల ఎత్తావో నరికేస్తా” అన్నాడు నాగిరెడ్డి, కళ్లల్లో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ.

చాలా మామూలుగా “ఊ.. ఇంకా” అన్నాడు ఆది.

“ఏందిరా.. ఏందిరా ఇంకా” అని రంకె వేశాడు నాగిరెడ్డి.

“చాలా ఉంది” అంటా విజిలేశాడు ఆది. బయట నాగిరెడ్డి సుమోలు నాలుగు ఒకేసారి గాల్లోకి లేచి పేలిపోయాయి. ఈసారి చిటికేశాడు ఆది. ట్రాక్టరు పైకి లేచి, ముక్కలు ముక్కలైంది.

“ఏంట్రా అన్నావ్. నీ ముందు తలదించుకుని బతకాలా. తలదించే వంశలో పుట్టలేదురా. తొడగొట్టే వంశంలో పుట్టా. ఆ..” అని గట్టిగా తొడగొట్టాడు ఆది.

ఇందులో మొదటి సన్నివేశం సీమలోని నీళ్లు సైతం అక్కడి పౌరుషాన్ని ప్రతిబింబిస్తాయని చెబితే, రెండో సన్నివేశం ఆది ఎలాంటివాడో పట్టిస్తుంది. సినిమా అంటేనే డ్రామా. ‘ఆది’ వంటి ఎమోషనల్ డ్రామాని పండించాలంటే ఎమోషనల్ డైలాగులు తప్పనిసరి. ఇవి ఆయా సన్నివేశాల్లో ఉద్వేగాన్ని ప్రేరేపించడం కోసం ఉపయోగించినవిగానే మనం చూడాలి. మనిషిలోని భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకోవడం సరికాదనే విమర్శకులూ ఉన్నారు. అది వేరే సంగతి. అయితే ఆ ఉద్వేగభరిత సంభాషణలూ సందర్భోచితంగానే ఉండాలనేది గుర్తుంచుకోవాలి. అప్పుడే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అవసరానికి మించిన సంభాషణలూ, సందర్భరహిత మాటలూ ప్రేక్షకుణ్ణి చికాకు పరుస్తాయి. అపహాస్యానికి గురవుతాయి. అందుకు ఆ తర్వాత వచ్చిన ఎన్నో రాయలసీమ నేపథ్య చిత్రాలే నిదర్శనం.

ఉరకలెత్తే ఉద్వేగభరిత కథనం

‘ఆది’ సినిమా విజయానికి ప్రధానంగా దోహదం చేసింది ఎమోషనల్ డ్రామానే. ఆ డ్రామాని వినాయక్ పండించిన తీరు చూస్తే, ఆ చిత్రాన్ని ఒక కొత్త దర్శకుడు కాక, కాకలు తీరిన దర్శకుడు తీశాడనే అభిప్రాయం కలుగుతుంది. తన తల్లిదండ్రుల్ని కిరాతకంగా హత్యచేసిన నాగిరెడ్డి (రాజన్ పి. దేవ్) అనే ఫ్యాక్షనిస్టుపై ఆదికేశవరెడ్డి అనే ఇరవై రెండేళ్ల కుర్రాడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే చిన్న అంశాన్ని సరిగ్గా రెండున్నర గంటలసేపు చిక్కనైన స్క్రీన్‌ప్లేతో తెరమీద రసవత్తరంగా నడిపి భేష్ అనిపించుకున్నాడు వినాయక్. ఆది పాత్రనూ, దానికి వ్యతిరేకమైన నాగిరెడ్డి పాత్రనూ బలంగా రూపొందించి ఉద్వేగభరిత సన్నివేశాలతో కథను పరుగులెత్తించాడు. ఆది పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో, అతని చిన్నప్పటి సన్నివేశంతోనే రుచి చూపించాడు. ఆది తల్లిదండ్రుల్ని నాగిరెడ్డి హత్య చేసే సమయానికి ఆది ఎనిమిదేళ్ల పిల్లాడు. నాగిరెడ్డి బారినుంచి తప్పించుకోవాలంటే అతడికి దొరక్కుండా పారిపోవడం ఒక్కటే కర్తవ్యం. ఆ సమయంలో ఎర్రన్న (చలపతిరావు) అనే అతను ఆదిని తీసుకుని పారిపోతుంటాడు. నాగిరెడ్డి మనుషులు వాళ్ల వెంట పడతారు. వాళ్లమీద బాంబులు వేస్తాడు ఎనిమిదేళ్ల పిలగాడు ఆది. అది చూసి “నాన్నా. నీ పేరేమిటి?” అనడుగుతాడు అప్పటిదాకా ఆ పిల్లాడి పేరు తెలీని ఎర్రన్న.

ఆది.. ఆదికేశవరెడ్డి” అని చెబుతాడు ఆది, పళ్లు బిగించి. అమెరికా నుంచి వచ్చినా, పసివాడైనా ఆదిలో సీమ పౌరుషం ఉరకలెత్తుతున్నదని ఆ సన్నివేశంతో తెలియజేశాడు స్క్రీన్‌ప్లే రచయిత కూడా అయిన వినాయక్. ఈ కథ కూడా అతనిదే. ఆది పెరిగి పెద్దవాడై, హైదరాబాద్‌లో కాలేజీ స్టూడెంట్ అయిన అతను చెప్పే తొలి డైలాగ్ “మాది రాయలసీమన్నా. అమ్మతోడు. ఎంతమందొస్తే అంతమందినీ అడ్డంగా నరికేస్తా”. అలా అని ఆదికి ఎప్పుడూ కొట్లాటలే అనుకుంటే పొరబాటే. స్వతహాగా అతను సరదా కుర్రాడు. అందుకే ‘చికు చికు బంబం చికు చికు బంబం చిదులు వేసే వయసేలే’ అని పాడతాడు. ఆ పాటలోనే ‘వేటకి వేటా మన ఆటా వేటుకి వేటూ మన బాటా’ అని తన స్వభావాన్ని తెలియజేస్తాడు.

కొన్ని లోపాలూ లేకపోలేదు

సినిమాలెందుకు హిట్టవుతాయి?: జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజికి 'ఆది' (ముగింపు భాగం)

చాలా సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలోనూ అతను ప్రేమించింది విలన్ కూతుర్నే. నాగిరెడ్డి కూతురే నందిని (కీర్తి చావ్లా) అని తెలిసినప్పుడు ఆమెని మరచిపోవాలని అనుకుంటాడు ఆది. కానీ ఏ పాపమూ తెలీని ఆమె ప్రేమని వొదులుకోవద్దని ఎర్రన్న చెప్పడంతో ఆమెని మనసారా తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. అలాంటి ఆది ఓ సందర్భంలో ఆమెతో అన్న మాటలు ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీసేట్లు ఉంటాయి.

“మీ అమ్మానాన్నల్ని చంపింది మా నాన్నే అని నాకెందుకు చెప్పలేదు?” అని నందిని అడిగితే “బయటి విషయాలు భార్యలతో డిస్కస్ చేసే అలవాటు మాకు లేదు” అంటాడు ఆది. అంటే ఆది తల్లిదండ్రుల్ని నందిని తండ్రి చంపడం బయటి విషయమా? దాన్ని ప్రేయసికి చెప్పకూడదా? ఆది స్వభావానికి సరితూగే డైలాగ్ కాదు అది. రచయిత అప్రమత్తంగా ఉంటే ఈ తప్పు దొర్లేది కాదు.

ఈ సినిమాలో కనిపించే మరో తప్పు నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కనిపించిన గంగిరెడ్డి (రఘుబాబు) పాత్ర చిత్రణ. వీరారెడ్డి (ఆది తండ్రి) పేదలకి భూములు పంచాలనుకుంటే, అతడికి విరుద్ధంగా నాగిరెడ్డిని ఎగదోసేది గంగిరెడ్డే. ఇంకోసారి తనని గంగిరెడ్డి బృందం చంపుతున్నప్పుడు ‘ఒరేయ్ మేం కష్టపడుతున్నది మీ అందరికీ పొలాలు ఇవ్వడం కోసమేరా’ అంటాడు ఎర్రన్న. ‘వాడి మాటలు వినకండిరో’ అంటూ తన మనుషుల్ని ఉసిగొల్పి, ఎర్రన్నని చంపుతాడు గందిరెడ్డి. ఎర్రన్నని అలా చంపాలని ప్లాన్ చేసేదీ అతనే. అలాంటి అతను క్లైమాక్సులో హఠాత్తుగా మంచివాడిగా మారిపోవడం పెద్ద వింత!

‘గంగిరెడ్డీ.. మీరన్నా చావండి. ఆణ్ణన్నా చంపండి’ అని నాగిరెడ్డి ఆజ్ఞాపిస్తే, ‘నీ కోసం మేమెందుకు చావాలన్నా?’ అని ప్రశ్నించి నాగిరెడ్డినే కాక, ప్రేక్షకుణ్ణీ ఆశ్చర్యపరుస్తాడు గంగిరెడ్డి. ఇలాంటి కొన్ని లోపాలు మినహాయిస్తే ‘ఆది’ ఆద్యంతమూ జనరంజక చిత్రం. ఇరవై రెండేళ్ల ఆది పాత్రలో పద్దెనిమిదేళ్ల ఎన్‌టీఆర్ వయసుకు మించిన అభినయ సామర్థ్యాన్ని ప్రదర్శించి, అచ్చెరువు కలిగించాడు. సినిమానంతా తన భుజాల మీద మోశాడు. భావోద్వేగ సన్నివేశాల్లో హావభావ విన్యాసాలతో, డైలాగ్ డిక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో, పాటల్లో చెలరేగిపోయాడు. నందిని పాత్రలో హీరోయిన్‌గా కీర్తి చావ్లా అటు అందం విషయంలోనూ, ఇటు అభినయం విషయంలోనూ ఏ కాస్త మెరుగ్గా ఉన్నా ‘ఆది’ మరింత హిట్టయ్యేది. ఈ చిత్రంలో మిగతా అందరూ పరిధుల మేరకు రాణిస్తే ఫెయిలైన ఒకే ఒక్క నటి కీర్తి చావ్లా. రాజన్ పి. దేవ్, చలపతిరావు, రఘుబాబు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. అలీ, వేణుమాధవ్ కొద్దిసేపు నవ్వించారు.

ఆ కాలంలో ఉచ్ఛస్థితిలో ఉన్న మణిశర్మ కీ బోర్డు నుంచి జాలువారిన మరో పాపులర్ ఆడియో ఆల్బం ‘ఆది’. దర్శకుడు వినాయక్ చెప్పినట్లు ‘నీ నవ్వుల తెల్లదనాన్నీ నాగమల్లీ అప్పడిగిందీ’ పాట చక్కని మెలోడీతో ఆహ్లాదం కలిగిస్తే, ‘చికు చికు బంబం చికు చికు బంబం చిందులు వేసే వయసేలే’, ‘తొలి పిలుపే నీ తొలి పిలుపే’, ‘అయ్యోరామ ఆంజనేయా ఎంత పని చేశావు’, ‘సున్నుండ తీసుకో సిగ్గుపడక తీసుకో’ పాటలూ జనరంజకమయ్యాయి. సి. రాంప్రసాద్ ఛాయాగ్రహణం, విక్రంధర్మా, స్టన్ శివల స్టంట్స్, గౌతంరాజు ఎడిటింగ్ ‘ఆది’కి బలమయ్యాయి. అన్నింటికీ మించి ‘ఆది’కి అసలైన హీరో వి.వి. వినాయక్. ఎన్‌టీఆర్‌ని అతను తెరమీద ఆవిష్కరించిన తీరే పాతిక కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాగా దీన్ని నిలిపింది. ఎన్‌టీఆర్‌కి స్టార్‌డంని తీసుకొచ్చి, వినాయక్ భవిష్యత్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా నిలిచే క్రమంలో పునాది అయ్యింది.

‘ఆది’ నాటి ధైర్యం ఇప్పుడు లేదు: వి.వి. వినాయక్

సినిమాలెందుకు హిట్టవుతాయి?: జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజికి 'ఆది' (ముగింపు భాగం)

ఎన్‌టీఆర్ ఈ కథ ఓకే చెయ్యగానే మా నాన్నకి ఫోన్ చేశా. ఓ స్నేహితుడిలా ఆయనతో అన్నీ చర్చించేవాణ్ణి. ‘ఆది’ రిలీజయ్యాక నాకు హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ వస్తుందని గట్టి నమ్మకంతో చెప్పా. నా ఆత్మవిశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నిజంగానే సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు గారు అప్పట్లో అందరికంటే అత్యధిక పారితోషికం ఆఫర్ చేశారు.

‘ఆది’ అంటే నా ఒక్కడికే కాదు, దానికి సంబంధించిన వాళ్లందరికీ ప్రత్యేక ప్రేమ. నా జీవితంలో మరపురాని, మరవలేని సినిమా. ఎన్ని సినిమాలు తీసినా ‘ఆది’ ఆదే. ఆ సినిమా చేసిన ఆత్మవిశ్వాసం, అప్పటి పొగరు, ఆ ధైర్యం ఆ తర్వాత నాకు లేకుండా పోయాయి. అది అంత హిట్టవడమే కారణం. ఈ చిత్రంలో యాక్టర్లు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, నేను కోరుకున్నవాళ్లే వచ్చారు. నిర్మాతలు ఆ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాకు తెలిసి కొత్త దర్శకుల్లో అంటే తొలి సినిమాకే పూర్తి స్వేచ్ఛతో, ఏదంటే అది చేయగలిగింది నేనొక్కణ్ణే.

‘అన్నయ్యా’ అని పిలుస్తూ తన కుటుంబంలో మనిషిగా నాకు గౌరవాన్నిచ్చాడు ఎన్‌టీఆర్. అంత శక్తివంతమైన పాత్రని అంత చిన్న వయసులో మెప్పించడం మామూలు సంగతి కాదు. యువ హీరోల్లో ఎవరికీ లేనటువంటి డైలాగ్ డిక్షన్ ఎన్‌టీఆర్ సొంతం. ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంలో మరీ. డాన్సుల్లోనూ, ఎనర్జీ లెవల్స్‌లోనూ అతనిది పైస్థాయి. పైగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముణ్ణి జనం ఆ అబ్బాయిలో చూడటం కూడా సినిమా విజయానికి కారణం. ‘ఆది’ పాత్రని నా ఊహకి మించి గొప్పగా చేశాడు. అతను ఆల్‌రౌండర్. ‘బార్న్ ఆర్టిస్ట్’. యాక్షన్ సీన్లలో, డాన్సుల్లో పక్కవాళ్ల కో-ఆర్డినేషన్ కుదరక రెండు మూడు టేకులు ఎప్పుడన్నా తీసుకున్నాడేమో గానీ, తనకు సంబంధించిన సన్నివేశాల్లో రెండో టేక్ తీసిన సందర్భమేదీ నాకు జ్ఞాపకం లేదు. ఇది రాయలసీమ కథ అయినప్పటికీ క్లైమాక్స్ సన్నివేశాల్ని విజయనగరంలోని సైనిక్ స్కూల్లో చేశాం. క్లైమాక్స్ తీసేప్పుడు ఎన్‌టీఆర్ చేతికి గ్లాస్ తగిలి గాయమైంది. ‘ఆది’ హిట్టయ్యాక ఏ సినిమాలో ఎన్‌టీఆర్‌కి దెబ్బ తగిలితే ఆ సినిమా హిట్టవుద్దనే సెంటిమెంట్ ఏర్పడింది.

ఈ సినిమాకి సంబంధించి చెప్పుకోవాల్సిన మరో అంశం మణిశర్మ సంగీతం. ఆయన సినీ జీవితంలోని గొప్ప పాటల్లో ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’ పాట తప్పకుండా ఉంటుంది. ఈ పాట రాసింది చంద్రబోస్. ‘ఆది’ తీయడానికి రెండేళ్ల ముందే ఈ పాటని నాకు వినిపించాడు. దాన్ని ఎవరికీ ఇవ్వొద్దనీ, నా సినిమాలో అది ఉండాలనీ అడిగా. సరేనని, మాట మీద నిలబడ్డాడు.

(అయిపోయింది)

– బుద్ధి యజ్ఞమూర్తి

సినిమాలెందుకు హిట్టవుతాయి?: జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజికి ‘ఆది’ (ముగింపు భాగం) | actioncutok.com

More for you: