సినిమాలెందుకు హిట్టవుతాయి?: ‘జయం’ (సంపూర్ణ విశ్లేషణ)


సినిమాలెందుకు హిట్టవుతాయి?: 'జయం' (సంపూర్ణ విశ్లేషణ)

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ‘జయం’ (సంపూర్ణ విశ్లేషణ)

అతి తక్కువమంది పాత తారలతో, అతి ఎక్కువమంది కొత్త తారలతో రూపొందించిన ‘జయం’ చిత్రం మొత్తం తెలుగునాడుని, ప్రత్యేకించి కాలేజీ కుర్రకారుని ఓ ఊపు ఊపేస్తుందని ఎవరైనా ఊహించారా! నిజంగానే ‘జయం’ ప్రభంజనం అనూహ్యం. నితిన్ అనే ఒక బక్కపలుచని కుర్రాడు, సదా అనే అందమైన ఓ కొత్తమ్మాయితో దర్శకుడు తేజ పెద్ద మ్యాజిక్కే ఛేశాడు.

అప్పటికే ‘చిత్రం’, ‘నువ్వు నేను’ (మధ్యలో ‘ఫ్యామిలీ సర్కస్’ వంటి ఫ్లాప్ ఉన్నా) విజయాలతో మంచి ఫాంలో ఉన్న తేజకి ‘జయం’ తెచ్చిన పేరు సామాన్యమైంది కాదు. ‘నువ్వు నేను’తోటే అందర్నీ తనవేపు తిప్పుకున్న ఆయన ఈ సినిమాతో హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు.

ఇక తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ కావడంతో నితిన్, సదా.. ఇద్దరూ యువతరానికి ఆరాధ్య తారలయిపోయారు. ముఖ్యంగా సుజాత పాత్రలో సదా ప్రదర్శించిన అభినయం, ఆమె హావభావాలు చాలామందికి ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి.

అర్ధనగ్న ప్రదర్శన చేస్తేనే హీరోయిన్ అనే నమ్మకం ఉన్న కాలంలో లంగా, ఓణీ డ్రస్సుల్లో సదా అందచందాలు కుర్రకారుని ఎంతగా అక్కట్టుకున్నాయో! అప్పట్లో చుడీదార్లకే పూర్తిగా అలవాటుపడిన అమ్మాయిలు ఒక్కసారిగా లంగా, ఓణీల మీద మోజు పెంచేసుకుని, ఎక్కడ చూసినా ఆ డ్రస్సులతోటే ముచ్చటగా కనిపించిన సంగతి అందరికీ జ్ఞాపకమే. ‘జయం’ లేదా ‘సదా’ డ్రస్సులుగా వాటికి పేరొచ్చింది.

అంతటి ఎఫెక్టుని కలిగించిన ఆ సినిమా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల మధ్యలోనే తయారై ఇరవై కోట్ల రూపాయలకు మించి వసూళ్లని సాధించి, ట్రేడ్ పండితుల్నే విస్మయానికి గురిచేసింది. ఇక మ్యూజికల్‌గా ‘జయం’ది అసాధారణ విజయం. ఆడియో సేల్స్‌లో చాలా పెద్ద సినిమాల రికార్డుల్ని తుడిచిపెట్టిన సినిమా ఇది.

ఈ చిత్రానికి బాణీలనందించిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకారం “ఇప్పటివరకు ‘అన్నమయ్య’ తర్వాత బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ‘జయం’. అప్పట్లోనే 25 లక్షల ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోయాయి.” అప్పట్లో ఏ టీ బంకు దగ్గర చూసినా “రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చె సిన్నదో” పాటే.

దాంతో పాటు “బండి బండి రైలుబండీ వేళకంటూ రాదూలెండీ” (తర్వాత “బండి బండి రైలుబండీ ఎంత మంచి రైలుబండీ”గా మార్చారు.), “అందమైన మనసులో ఇంత అలజడెందుకో”, ‘ప్రియతమా తెలుసునా నా మనసు నీదేననీ”, “ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా” పాటలు కూడా పాపులర్ అయ్యాయి.

చిన్నతనంలోనే పెళ్లి ఖాయమనుకున్న ఓ అమ్మాయి, అబ్బాయి స్కూలు రోజుల్లోనే దూరమయ్యాక, కాలేజీ రోజుల్లో ఆ అమ్మాయి మరో అబ్బాయితో ప్రేమలో పడితే, మొదటి అబ్బాయి సీనులోకి వచ్చి ఆమెని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని యత్నిస్తే, ప్రేమికులు అతణ్ణి ఎలా ఎదుర్కొన్నారనే లైను మీద రూపొందించిన ‘జయం’ సాధించిన విజయం నిజానికి ఆశ్చర్యకరం.

ఈ సినిమాకి ముందు గోపీచంద్ ‘తొలివలపు’తో హీరోగా పరిచయమై, పరాజయం చవిచూశాడు. హీరోగా మరో అవకాశం రాని రోజుల్లో తేజ ఇందులోని విలన్ రఘు పాత్రను ఆఫర్ చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గోపీచంద్ ఆ పాత్రలో అమోఘంగా రాణించాడు. ఫలితంగా ఉత్తమ విలన్‌గా నంది అవార్డును దక్కించుకున్నాడు.

నిజానికి ఈ పాత్రకి మొదటగా ఎంపికైంది సచిన్ అనే ముంబై నటుడు. “అతను ఓ రోజు షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. కానీ అతని పర్ఫార్మెన్స్ తేజకి తృప్తి కలిగించలేదు. అతన్ని తీసేసి ఆ పాత్రకి చాలామందిని పరీక్షించాడు. చివరికి గోపీచంద్ ఆ పాత్రకి సరిపోతాడని అతన్ని తీసుకున్నాడు. అందుకు తగ్గట్లే రఘు పాత్రకి పూర్తి న్యాయం చేశాడు గోపి. ‘జయం’ లేకపోతే అతను లేడు” అని చెప్పారు ఆర్పీ పట్నాయక్.

అదేవిధంగా సుజాత పాత్రకి మొదట అనుకున్న తార ప్రత్యూష. ఆమె దాదాపు ఓకే అయిపోయి షూటింగ్ మొదలు పెడదామనుకునేంతలోనే ఆమె దుర్మరణం పాలై, ఆ అవకాశం సదాకి లభించింది. ఆమె ఆ పాత్రకి ఏ స్థాయిలో న్యాయం చేకూర్చిందో తెలిసిందే.

కథా సంగ్రహం

సినిమాలెందుకు హిట్టవుతాయి?: 'జయం' (సంపూర్ణ విశ్లేషణ)

సుజాత, రఘు స్నేహితులైన శివకృష్ణ, ప్రసాద్ బాబు పిల్లలు. చిన్నప్పుడే వాళ్లకి పెళ్లి చేయాలని స్నేహితులు నిశ్చయించుకుంటారు. స్కూల్లో చదువుకుంటున్న సుజాతకి ప్రసాద్ బాబు పట్టీలు కొనిచ్చి, “ఈ పట్టీలెప్పుడూ నీ కాళ్లకే ఉండాలమ్మా” అని చెబుతాడు. రఘు చెడు అలవాట్లకి బానిసవుతాడు. ఓసారి సుతాతతో తోటి విద్యార్థి మాట్లాడుతున్నాడని తెలిసి క్లాస్‌రూంకి వెళ్లి మరీ వాడ్ని కొడతాడు రఘు.

అదేమని అడిగిన సుజాతతో “నువ్వెవరితో మాట్లాడినా నాకిష్టముండదు. నువ్వు నాక్కబోయే పెళ్లానివి. నేను చెప్పినట్టే వినాలి” అంటాడు. “నీలాంటి మూర్ఖుడ్ని నేనసలు పెళ్లే చేసుకోను.. ఛీ” అంటుంది సుజాత. ఇద్దరూ వాదించుకొని విడిపోతారు.

పక్క ఊళ్లోని మైకా భూములు చూసుకోవడం కష్టంగా ఉందంటూ కుటుంబం సహా ఆ ఊరు వెళ్లిపోతాడు ప్రసాద్ బాబు. ఐదారేళ్లు గడిచిపోతాయి. సుజాత (సదా)కి కాలేజీలో తండ్రిలేని పిల్లాడు వెంకటరమణ అలియాస్ వెంకట్ (నితిన్) పరిచయమవుతాడు. క్రమంగా ఇద్దరూ సన్నిహితమవుతారు.

రైలుబండిలో ఒకరి చేతిని మరొకరు పట్టుకొన్న సుజాత, వెంకట్ కనిపిస్తారు సిద్ధాంతి దీక్షితులు (రాళ్లపల్లి)కి. ఆ సంగతిని శివకృష్ణ దృష్టికి తీసుకొస్తాడు. అతను నమ్మడు. తిరిగి రెండోసారీ వాళ్లని చూసిన దీక్షితులు ఈసారి పంచాయితేయే పెడతాడు నరసింహ వద్ద. రేపట్నుంచీ కాలేజీకి వెళ్లొద్దనీ, రఘుతో త్వరలోనే పెళ్లి జరిపిస్తాననీ తేల్చేస్తాడు శివకృష్ణ.

స్నేహితుడికి ఫోన్ చేసి రేపు ఉదయం పదకొండు గంటలకి తాంబూలాలు పుచ్చుకోడానికి రమ్మంటాడు. తాను సుజాతని పెళ్లి చేసుకోననీ, దానికి అందగత్తెననే పొగరనీ అంటాడు రఘు. ముందు అమ్మాయిని చూడమనీ, నచ్చకపోతే అలాగే చేద్దువుగానీలే అని తల్లి చెప్పడంతో సరేనంటాడు. అయితే అప్పటికే అతను పనిమనిషితో శారీరక సంబంధం పెట్టుకుంటాడు. పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇస్తాడు.

సుజాతని చూసీ చూడగానే తెగ నచ్చేస్తుంది రఘుకి. వచ్చే శుక్రవారమే పెళ్లంటూ ముహూర్తం ఖాయం చేస్తాడు దీక్షితులు. తాను వెంకటరమణ అనే అతన్ని ప్రేమించాననీ, అతన్నే చేసుకోవాలని అనుకుంటున్నాననీ రఘుకి చెబుతుంది సుజాత. దాంతో ఆమె గొంతు పట్టుకొని పైకెత్తి “వాడ్ని ప్రేమించినా ఫర్వాలేదు. కడుపు తెచ్చుకున్నా ఫర్వాలేదు. పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి” అంటాడు క్రూరంగా.

సుజాత చెల్లివల్ల ఆమె రామాలయానికి వస్తున్న సంగతి తెలుసుకొని అక్కడకి వెళ్లి ఆమెని కలుస్తాడు వెంకట్. తన మనుషులతో అక్కడకి వచ్చి వెంకట్‌ని నెత్తురు కారేలా చావగొడతాడు రఘు. “వచ్చే శుక్రవారం 7.20 గంటలకి సుజాతతో నా పెళ్లి. నువ్వు తప్పకుండా వొస్తున్నావ్. నీ కళ్లముందే సుజాతని చేసుకుంటా” అని చెబుతాడు.

తన ఇంట్లో “సుజాతతో నీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఎందుకంటే నేను, సుజాత ప్రేమించుకున్నాం కాబట్టి – వెంకట్” అనే రాతలు చూసి రఘు కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంకట్ కోసం మనుషుల్ని పంపిస్తాడు. పెళ్లి పనులు మొదలవుతాయి. పీటల మీద కూర్చున్న వధూవరుల్ని మధుపర్కాలు కట్టుకురమ్మంటాడు దీక్షితులు.

సుజాత ఎంతకీ గదిలోంచి రాకపోవడంతో తలుపులు బద్దలు కొడతాడు రఘు. అప్పుడే పైకప్పు మీంచి తాడుతో దిగి సుజాతని ఎత్తుకుపోతాడు వెంకట్. రఘు బృందం వెంటాడతారు. కదులుతున్న రైలుబండి ఎక్కుతారు ప్రేమికులు. ఈలోగా రఘు విసిరిన గొడ్డలి వెంకట్ వెన్నుని గాయపరుస్తుంది. రఘు బృందం కూడా రైలుబండి ఎక్కుతారు.

వాళ్ల నుంచి తప్పించుకోడానికి రైలుపెట్టె పైనుంచి కిందికి దూకేస్తారు సుజాత, వెంకట్. నేరుగా నీళ్లలో పడతారు. అక్కడ హనుమంతుడి బొమ్మ ఉన్న కాషాయ జెండా దొరుకుతుంది వెంకట్‌కి. “అర్జునుడి నుంచి ఇప్పటిదాకా ఆ జెండా ఉన్నవాళ్లు ఓడిపోలేదు” అని దాన్ని పట్టుకుంటాడు. వెయ్యి ఏనుగుల బలం వస్తుంది అతడికి. అది పట్టుకొని రఘుని చితగ్గొడతాడు. ప్రేమికులు ఒక్కటవుతారు.

దుండగుల నుండి తప్పించుకోడానికి అడవిలో పరిగెత్తుతున్నారు వెంకట్, సుజాత. ఉన్నట్లుండి ఎదురుగా నెత్తురోడుతున్న ఓ కుందేలు తలకిందులుగా వేలాడుతూ ప్రత్యక్షమైంది. అంతే! భయంతో కేకవేసి వెనక్కి తిరిగి పరిగెత్తింది సుజాత.. వెంకట్ వారిస్తున్నా వినకుండా.

దుండగుల చేతికి చిక్కింది సుజాత. ఆమెని వాళ్లు చంపబోతుంటే అడ్డుకొని వాళ్లని కొట్టాడు వెంకట్.

సుజాత: వాళ్లని ఎందుక్కొట్టావ్?

వెంకట్: నీ కోసం.

సుజాత: నా కోసం కొడతావా ఎవరినైనా?

వెంకట్: కొడతా.

సుజాత: అయితే పారిపోవడమెందుకు? వాళ్లనందర్నీ కొట్టు.

అట్లాగే వాళ్లని కొట్టాడు వెంకట్.

వాళ్లని వెతుక్కుంటూ వచ్చిన రఘుకి చేత్తో జెండా పట్టుకొని దర్జాగా కూర్చొని కనిపించాడు వెంకట్. పక్కనే సుజాత!

సుజాత: ఈ రోజు నువ్వు వాడ్ని కొట్టాలి. నేను చూడాలి. జయం.

ఆవేశంగా రఘు మీదకెళ్లాడు వెంకట్. దృఢకాయుడైన రఘు చేతిలో దెబ్బలు తిన్నాడు.

రఘు: (సుజాతతో) ప్రతి ప్రేమ కథలో చచ్చేది ప్రేమికులేనే.

సుజాత చలించలేదు. తీక్షణంగా అతడ్నే చూస్తోంది.

సుజాత: అప్పుడే గెలిచాననుకోవద్దు.

ఆంజనేయుడి బొమ్మ ఉన్న జెండా తీసుకుని వెంకట్ చేతిలో పెట్టింది.

సుజాత: ఈ జెండా ఉన్నవాళ్లు అర్జునుడి నుంచి ఇప్పటిదాక ఎవరూ ఓడిపోలేదు.. వెళ్లు..

మొహమంతా నెత్తురోడుతున్న వెంకట్.. జెండా పట్టుకొని లేచాడు. బిత్తరపోయి చూస్తున్న రఘు వేపు అడుగులు వేశాడు.

సుజాత: (చేయి చాపి) కొట్టవయ్యా కొట్టు.. కొట్టూ.. జెండా కిందపడకుండా కొట్టు..

ఓ చేత్తో జెండా పట్టుకొని, ఇంకో చేత్తో తనకంటే ఎంతో బలిష్టుడైన రఘుని చితగ్గొట్టాడు వెంకట్. మధ్యలో ఓసారి జెండా చేజారిపోతే, రఘు చేతిలో దెబ్బలు తిన్న అతను మళ్లీ జెండా చేతికి అందగానే కిందపడి మళ్లీ లేవకుండా రఘుని కొట్టాడు.

రెపరెపలాడిన ‘జెండాపై కపిరాజు’

సినిమాలెందుకు హిట్టవుతాయి?: 'జయం' (సంపూర్ణ విశ్లేషణ)

ఒక జెండా చేతిలో ఉంటే బలహీనుడైనా బలవంతుడైపోతాడా? ఇదేమీ పుక్కిటి పురాణాల సినిమా కాదు. మాయలు, మంత్రాలు కనిపించే ఫాంటసీ సినిమానో, జానపద సినిమానో కాదు. మామూలు కాలేజీ కుర్రకారు ప్రేమకథ. అయినా లాజిక్‌కి అందని ఈ సన్నివేశమేమిటి? జెండా లేకపోతే బలహీనపడటం, జెండా పట్టుకుంటే బలం రావడం ఏమిటి?

పైగా ‘జెండాపై కపిరాజు’ని చేతపట్టుకున్నోళ్లు అర్జునుడి నుండి ఇప్పటిదాకా ఓడిపోలేదనే స్టేట్‌మెంట్ ఒకటి! ఆ జెండాకి అంత శక్తి ఉందా? నిజంగా ఉందో, లేదో కానీ ‘జయం’ సినిమాకి శక్తినిచ్చిన సన్నివేశాల్లో ఈ పతాక సన్నివేశం ప్రధానమైంది.

ఆ సన్నివేశంలో భావోద్వేగాల్ని ప్రేరేపించడానికీ, వెంకట్, సుజాత పాత్రలతో ప్రేక్షకులు సహానుభూతి చెందడానికీ ఈ జెండా సన్నివేశం బాగా ఉపకరించింది. ఇక్కడ లాజిక్ కంటే ‘నమ్మకం’ అనేది బాగా ‘వర్కవుట్’ అయింది. ‘దేవుడు ఉన్నాడు’ అనే భావన ఎలా నమ్మకానికి సంబంధించిందో.. ఇదీ అంతే. అంటే దేన్నయినా ప్రగాఢంగా నమ్మితే, ఆ నమ్మకమే ‘జయం’ చేకూరుస్తుందనే నమ్మకంతో ఈ సన్నివేశాన్ని కల్పించి, ‘జయం’ పొందాడు దర్శకుడు తేజ.

చిన్ననాటి బంధం శత్రుత్వమైంది

సినిమాలెందుకు హిట్టవుతాయి?: 'జయం' (సంపూర్ణ విశ్లేషణ)

‘చిత్రం’, ‘నువ్వు నేను’ సినిమాల తర్వాత తేజకి మరో సూపర్ డూపర్ హిట్ ‘జయం’. దేనికి జయం? ప్రేమకి. వేర్వేరు ఊళ్లకి చెందిన ఇద్దరు పడుచువాళ్లు.. అదీ కాలేజీలో సహాధ్యాయులు ప్రేమలో పడి, ఆ ప్రేమలో జయం పొందడమే ఈ చిత్రం. పైపైన చూస్తే, ఇది సగటు ప్రేమ కథాచిత్రం. అయినా దీనికే ఎందుకంత విజయం అని పరిశీలిస్తే దర్శకుడి కల్పనా చాతుర్యమే కారణమని తేలుతుంది.

ఇందులో చిన్ననాడు హీరోయిన్ సుజాతని తన సైకిల్‌పై ఎక్కించుకొని స్కూలుకు వెళ్లేది హీరో వెంకట్ కాదు.. విలన్ రఘు! ఆమెతో బంధం ఏర్పడేది హీరోకి కాదు.. విలన్‌కి!! కాకపోతే ఇద్దరి మధ్యా తగువు వచ్చి ఎడమొహం, పెడమొహం అయ్యారు. ఆ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించేశారు. ఆ సంగతి ఆ ఇద్దరికీ తెలుసు. కానీ రఘు దురలవాట్లు సుజాతకి గిట్టలేదు.

తనతో మాట్లాడాడని రాము అనే తోటి విద్యార్థిని రఘు క్లాసురూంలోనే కొట్టేసరికి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావేమిటని అడిగింది. రఘు “నువ్వెవ్వడితో మాట్లాడినా నాకిష్టముండదు. నువ్వు నాక్కోబోయే పెళ్లానివి. నేను చెప్పినట్టే వినాలి” అనేసరికి, “నీలాంటి మూర్ఖుడ్ని నేనసలు పెళ్లే చేసుకోను. ఛీ” అని ఛీకొట్టింది సుజాత.

నువ్వు నన్ను చేసుకునేదేంటే.. నేనే నిన్ను చేసుకోను పో” అన్నాడు రఘు. ఆ తర్వాత రఘు వాళ్లు వేరే ఊరు వెళ్లిపోవడంతో ఇద్దరూ విడిపోయారు.

తోటి విద్యార్థితో ప్రణయం

ఐదారేళ్ల తర్వాత సుజాత ఇంటర్మీడియేట్ పూర్తిచేసి కాలేజీలో బీకాం చేరింది. తోటి విద్యార్థి అయిన వెంకటరమణ అలియాస్ వెంకట్ ప్రేమలో పడింది. ఈ ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించే సన్నివేశాల కల్పనలో దర్శకుడు చాతుర్యాన్ని ప్రదర్శించాడు. రైల్వే స్టేషన్‌ని అందుకు ఉపయోగించుకున్నాడు. సుజాత, వెంకట్ ఇద్దరూ కాలేజీకి వెళ్లాలంటే ఒకే రైలెక్కాలి.

సుజాత వస్తున్నదంటే గుర్తు ఘల్లు ఘల్లుమనే ఆమె కాలి పట్టీలు. ఆ పట్టీలకూ ప్రాముఖ్యం ఉంది. వాటిని ఆమెకిచ్చింది రఘు తండ్రి. కాబోయే కోడలికి ప్రేమతో ఇచ్చిన పట్టీలవి. వాటిని వేసుకొని కళ్లముందు కూతురు తిరుగుతుంటే సుజాత తండ్రి నరసింహ “ఇలా నా కూతురు పట్టీలు వేసుకొని పరిగెత్తుతూ ఉంటే..” అంటూ ఎక్కడికో వెళ్లిపోతుంటాడు తరచూ.

అలాంటి పట్టీలు లేకుండా ఓసారి సుజాత కనిపించేసరికి “పట్టీలు లేకుండా వొచ్చారేంటండీ?” అనడిగాడు వెంకట్. “నా ఇష్టం. నా సంగతి నీకెందుకయ్యా. వెళ్లవయ్యా వెళ్లూ..” అంటూ కుడిచేతిని పొడవుగా చాచి, స్టైల్‌గా చెబుతుంది సుజాత. ఈ సినిమాలో సుజాత కేరెక్టర్ మేనరిజం అది. ఆమె “వెళ్లవయ్యా వెళ్లూ” అన్న ప్రతిసారీ ముచ్చటేసింది ప్రేక్షకులకి. ఆ మేనరిజంతో సుజాత పాత్రని వాళ్లకి బాగా చేరువ చేశాడు తేజ.

పట్టీల గురించి అలా ఆరా తీసి మాట్లాడేసరికి వెంకట్ ఆమెకి చేరువయ్యాడు. ఆమెకి “ఐ లవ్ యు” చెప్పడానికి వెంకట్ అర్ధరాత్రి రెండో ఆట చూసి, స్నేహితులతో కలిసి సుజాత ఇంటికెళ్లే సన్నివేశాన్ని దర్శకుడు కల్పించిన తీరు కుర్రకారుని బాగా ఆకట్టుకుంది. నడుముకి తాడు కట్టుకొని ఇంటి పైకప్పు ఎక్కి, అక్కడి పెంకులు తీసి, వెంకట్ లోపలికి దిగితే, మరోవైపు బయట ఆ తాడు పట్టుకొని లాగుతుంటారు అతడి మిత్రబృందం.

తాడు సాయంతో గాల్లో తేలుతూనే సుజాతని లేపి “ప్రియతమా తెలుసునా నా మనసు నీదేననీ” అంటూ పాడతాడు వెంకట్. ఆ పాట ఎంత హిట్టో, ఆ సీనూ అంత హిట్టు. ప్రి క్లైమాక్స్‌లోనూ రఘుతో సుజాతకి బలవంతపు పెళ్లి జరుగుతుంటే, ఇలాగే తాడుతో సుజాత గదిలో దిగి, ఆమెని తనతో తీసుకుపోతాడు వెంకట్.

గోడమీది రాతలకు ఎంత బలమో..!

రఘు పాత్రని ఎంత నీచంగా చూపించాలో అంత నీచంగానూ చూపించి, సుజాత అతన్ని ద్వేషించడంలో, వెంకట్‌ని ప్రేమించడంలో ఎలాంటి తప్పూ లేదని ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయడంలో ‘జయం’ పొందాడు తేజ. కంటికి నదురుగా కనిపించిన పని మనిషితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న రఘు మొదట సుజాతతో పెళ్లి వొద్దన్నాడు. కానీ ఆమెని చూసి, ఆ అందానికి దాసోహమై, చేసుకుంటే బలవంతంగానైనా సుజాతనే చేసుకోవాలనే స్థితికి వచ్చాడు.

అందుకే తాను వెంకటరమణ అనే అతన్ని ప్రేమించాననీ, అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాననీ చెప్పిన సుజాతతో “వాడ్ని ప్రేమించినా ఫర్వాలేదు. కడుపు తెచ్చుకున్నా ఫర్వాలేదు. పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి” అన్నాడు. అక్కడ్నించి అతడికీ, వెంకట్‌కీ మధ్య సుజాత కోసం యుద్ధం మొదలైంది. ఫిజికల్‌గా రఘుతో పోలిస్తే చాలా బలహీనుడు వెంకట్. ముఖాముఖి పోరులో రఘుని గెలవడం దాదాపు అసాధ్యం.

ఆ సంగతి తెలిసీ మాటలతో రెచ్చగొట్టాడు వెంకట్. ఆ మాటలు నోటితో చెప్పినవి కావు. గోడమీది రాతలతో చెప్పినవి. రఘు ఇంట్లోనే తొలిసారి “సుజాతతో నీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఎందుకంటే నేను, సుజాత ప్రేమించుకున్నాం కాబట్టి – వెంకట్” అని రాసి, పక్కనే ఓ చేతి గుర్తు పెడతాడు వెంకట్. ఇంకోసారి “నీ పెళ్లి ఆపడమే నా ధ్యేయం – వెంకట్” అనీ, మరోసారి “నిన్ను సుజాత మెడలో తాళి కట్టనివ్వను. నువ్వు చూస్తుండగానే నేను కట్టి ప్రేమంటే ఏమిటో చూపిస్తా – వెంకట్” అనీ రాస్తాడు.

వెంకట్ నడిపే ఈ మైండ్‌గేం కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఆ రోజుల్లో ఈ సినిమా పబ్లిసిటీకి గోడల మీద ఇలాంటి రాతల్నే ఉపయోగించి, జనంలోకి ఆ సినిమా బాగా వెళ్లడంలో విజయం సాధించారు.

‘వెళ్లవయ్యా వెళ్లూ’ మెస్మరిజం!

సినిమాలెందుకు హిట్టవుతాయి?: 'జయం' (సంపూర్ణ విశ్లేషణ)

దాదాపు అరగంటసేపు నడిచే క్లైమాక్స్.. ముందే చెప్పుకున్నట్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నదంటే ‘జెండాపై కపిరాజు’ విశేషమే! హీరోయిన్ చిన్ననాటి సన్నివేశాల్ని బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించడంలో పెద్దగా ప్రయోజనం లేకపోయినా అదీ బాగానే అనిపించింది. ప్రధాన పాత్రధారులందరూ పాత్రల స్వభావానికి తగ్గట్లు నటించి మెప్పించారు. వాస్తవం చెప్పుకోవాలంటే వెంకట్ పాత్రలో నితిన్ చెప్పుకోదగ్గ ప్రతిభని ప్రదర్శించలేకపోయినా, అతడి పాత్ర జనాన్ని ఆకట్టుకున్నదంటే.. అమాయకమైన అతడి చూపుల వల్లే. పల్లెటూరి కుర్రాడి పాత్రకి అతికినట్లు సరిపోయాడు.

ఇక అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించింది సుజాత పాత్రలో జీవించిన సదా. “వెళ్లవయ్యా వెళ్లూ” అనే మేనరిజంతో ఆమె చిన్నా, పెద్దా తేడా లేకుండా అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఆ పాత్ర అలా రాణించడంలో గాయని సునీత ఆమెకిచ్చిన వాయిస్ తోడ్పడింది.

ఆమె తర్వాత రఘు పాత్ర చేసిన గోపీచంద్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. రఘు పాత్రలోని కూరత్వాన్ని అతను బాగా ప్రదర్శించాడు. అతని రూపం దానికి బాగా సాయపడింది. వెంకట్ స్నేహితుడు ఆలీబాబాగా సుమన్‌శెట్టి ముచ్చటగా ఉన్నాడు. కాకపోతే అతనికీ, లెక్చరర్ జ్ఞానసరస్వతిగా నటించిన షకీలాకీ మధ్య సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. సెక్స్ కామెడీకి చోటు కల్పించే అలవాటు తేజ బలహీనత. పైగా దాన్ని లెక్చరర్లు, స్టూడెంట్ల మీద చిత్రీకరించడం!

సుజాత చెల్లెలిగా నటించిన బేబి శ్వేత కూడా ఆకట్టుకుంది. అక్షరాల్ని తిప్పిరాసే అలవాటున్న అమ్మాయిగా కథకి ఉపయోగపడే పాత్ర ఆమెది. మిగతావాళ్లు పరిధుల మేరకు రాణించారు.

దర్శకుడిగానే కాక కథనందించి, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చిన తేజ అన్నిట్లోనూ సక్సెస్ అయితే, ఆయన బాటలో మిగతా టెక్నీషియన్లూ రాణించారు. ఆర్పీ పట్నాయక్ కట్టిన బాణీలకి కులశేఖర్ రాసిన పాటలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. రీరికార్డింగూ ఎఫెక్టివ్‌గా వచ్చింది. సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణ పనితనం ‘జయం’కి కీలకమైంది. మొత్తానికి దర్శకుడిగా అదివరకే విజయాలు సాధించిన తేజ నిర్మాతగా సాధించిన తొలి ‘జయం’ ఇది.

‘జయం’నీ, సంగీతాన్నీ వేర్వేరుగా చూడలేను: ఆర్పీ పట్నాయక్

సినిమాలెందుకు హిట్టవుతాయి?: 'జయం' (సంపూర్ణ విశ్లేషణ)

‘జయం’ ఆడియో విడుదల వేడుకలో “ఈ ఆడియో హిట్ కాకపోతే మ్యూజిక్ చెయ్యడం మానేస్తాను” అని ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చా. అప్పుడు నన్ను చాలామంది విమర్శించారు. దాని మీదున్న నమ్మకమే నా స్టేట్‌మెంట్‌కి కారణం. ఆ సినిమాలో ఎన్ని పాటలున్నాయంటే నేను చెప్పలేను. ఎందుకంటే అది టోటల్ మ్యూజికల్ ఫిల్మ్. ఆ సినిమానీ, సంగీతాన్నీ వేర్వేరుగా చూడలేను.

‘అందమైన మనసులో ఇంత అలజడెందుకో’ పాట ఓ లలిత గీతంలా ఉంటుంది. అదంటే నాకెంతో ఇష్టం. ఆ పాట సూపర్ హిట్ అవుతుందని నాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి తేజ. ఇక నేను ఎక్కువ టైం తీసుకున్న పాట.. ‘ప్రేమా ప్రేమా నీకిది న్యాయమా’. చిత్రీకరణ పరంగా నాకు బాగా నచ్చేది ‘ప్రియతమా తెలుసనా’ పాట.

నల్లమల అడవుల్లో క్లైమాక్స్ సన్నివేశాలు తీసేప్పుడు ఏదో లోపించిన ఫీలింగ్ కలిగింది తేజకి. ఎమోషన్‌ని క్యారీ చెయ్యడానికి ఇన్‌స్పిరేషన్ కోసం ఓ పాట పంపమన్నాడు. రాత్రికి రాత్రే ఓ సాంగ్ చేసి పంపించా. కెమెరా ఆన్ చేసి పాటని మొదలుపెట్టారు. వెంటనే సమీర్ రెడ్డి (సినిమాటోగ్రాఫర్) కెమెరా వద్ద నుంచి లేచి పక్కకి వెళ్లిపోయాడు. ఆ పాటకి ఓ విధమైన షాక్‌కి గురయ్యాడు.

“ఈ పాట వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. వొణుకు పుడుతోంది. కొద్దిసేపు అలవాటు పడనివ్వండి. అప్పుడు కెమెరా వద్ద కూర్చుంటా” అన్నాడు. ఆ పాటే.. ‘ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా’.

రీరికార్డింగ్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. మంచి స్క్రీన్‌ప్లేకి బ్యాగ్రౌండ్ స్కోర్ ఉపయోగపడుతుందని రుజువు చేసిన సినిమా ఇది. వెన్నుమీద గొడ్డలి గాయమైన హీరో క్లైమాక్సులో చేసే వీరోచిత కార్యాలకి జనం కన్విన్స్ అయ్యారంటే అందుకు దోహదం చేసింది రీరికార్డింగ్.. ప్లస్.. ఇప్పుడు చెప్పుకున్న పాట. చాలా మ్యూజిక్ క్లాసుల్లో ఈ క్లైమాక్స్ సీన్ గురించి చెబుతుంటా.

(అయిపోయింది)

– బుద్ధి యజ్ఞమూర్తి

సినిమాలెందుకు హిట్టవుతాయి?: ‘జయం’ (సంపూర్ణ విశ్లేషణ) | actioncutok.com